కన్ఫ్యూజన్ ముందు పుట్టి కామ్రేడ్ లు తర్వాత పుట్టి ఉంటారేమో..చారిత్రక తప్పిదాలు, ట్రయల్ అండ్ ఎర్రర్‌లు కామనై పోయాయి.మునుగోడు విషయంలో కలిసినట్టే కలిసినా మళ్లీ ఎవరిదారి వారిదేనట..
కలుస్తున్నామని చెప్పినా క్రాస్ రోడ్స్ లో కామ్రేడ్స్ ఏం చేస్తారట ?
కమ్యూనిష్టుల మధ్య సఖ్యతని ఇప్పుడు ఊహించేవారు లేరు.అది ఎప్పటికీ ఎండమావే అనుకుంటున్న పరిస్థితి.కానీ మునుగోడు ఉప ఎన్నికల విషయం లో మాత్రం ఏకతాటి మీదకు వచ్చారు.
సీపీఐ దారిలోనే… సీపీఎం కూడా మునుగోడు ఎన్నికల్లో గులాబీ పార్టీకి జై కొట్టింది.బీజేపీని కట్టడి చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది సీపీఎం.
టియ్యారెస్‌కు మద్దతు ప్రకటించే అంశం కంటే ముందు…కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కానీ, ఇది రెండు పార్టీలకు కొత్త విషయం కాదు. ఎన్ని మాటలు చెప్పినా, తీరా ఎన్నికలు వచ్చే నాటికి ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటాయి. రాజకీయ విధానం దాదాపు, ఇద్దరిదీ ఒకటే…కానీ ఆలోచన విధానాలే తేడాగా ఉంటాయి అనేది ఓపెన్ టాక్. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నట్టే ఉంటారు కానీ..కలిసి నడవడం మాత్రం అసాధ్యం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ… తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు… టియ్యారెస్‌కి మద్దతు పలికారు. అయితే… వచ్చే ఎన్నికల్లో కూడా.. టియ్యారెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంది సీపీఐ. కానీ సీపీఎం మాత్రం మద్దతుని మునుగోడు ఉప ఎన్నికకు పరిమితం చేసింది. టియ్యారెస్‌తో కలిసి సీపీఐ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల పై అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. నల్గొండలో దేవరకొండ, మునుగోడు రెండే బలమైన సీట్లు. వచ్చే ఎన్నికల్లో టియ్యారెస్, సీపీఐకి మునుగోడుని వదిలేసే పరిస్థితి ఉందా? అనేది కీలక ప్రశ్న. దేవరకొండని సీపీఐ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నా, ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టియ్యారెస్ జిల్లా అధ్యక్షుడు. అలాంటి సీటుని టియ్యారెస్ వదిలేసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నే.
హుస్నాబాద్, ఖమ్మం లోని మధిర, కొత్తగూడెం, వైరా లాంటి సీట్లు అడగాలని చూస్తుంది సీపీఐ. కానీ, ఇందులో జరిగేదెంత అనేది అనుమానమే. కానీ సీపీఎం మాత్రం దీనికి భిన్నంగా పని చేస్తోంది. ఉభయ కమ్యునిస్టు పార్టీ లు లెఫ్ట్ ఐక్యత దిశగా పని చేయాలని అనుకుంటున్నా, కండిషన్లు అప్లై అవటం ఆగటం లేదు. ఇప్పటికైతే మునుగోడు వరకే కలిసి నడుస్తున్నారు. సీపీఎం ప్రస్తుతానికి మునుగోడు వరకే మద్దతు పరిమితం అని, సాధారణ ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితి కి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామనే ధోరణి లో సీపీఎం ఉంది. ఓ వైపు ఐక్యత అంటూనే ఇంకో వైపు ఎవరి దారి లో వారు రాజకీయ ఎత్తుగడలు అమలు చేస్తున్నారు. రెండు పార్టీలకు క్లారిటీ ఉందా లేదా? అనేది ఒక ప్రశ్నైతే, రెండూ కలిసి లెఫ్ట్ అభిమానుల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారనే టాక్ మాత్రం గట్టిగానే ఉంది.