Off The Record: సత్తు గిన్నెకే సౌండ్ ఎక్కువన్న సామెత ఆ నియోజకవర్గం టీడీపీ నాయకులకు సరిగ్గా సూటవుతుందట. అక్కడ పార్టీ గెలిచి రెండు దశాబ్దాలకు పైనే అయింది. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే… అసలు లోకల్ కేడర్ గెలుపన్న సంగతే మర్చిపోయారట. అలాంటి చోట కలిసికట్టుగా కష్టపడాల్సిన నేతలు పరస్పరం గోతులు తీసుకుంటూ పార్టీని కూడా ముంచుతున్నారట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? పార్టీ పెద్దలకే కొరకరాని కొయ్యలా ఎందుకు మారింది?
Read Also: Priyanka Gandhi : ఓటు చోరీపై నిజాలు బయటపెట్టండి
కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఎన్నిక ఏదైనా.. ఇక్కడ టీడీపీకి ఫలితాలు మాత్రం చాలా అధ్వాన్నంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే.. ఆలూరులో టీడీపీ గెలుపన్నది ఎప్పుడో మర్చిపోయారట. అలాంటి చోట కలిసికట్టుగా పని చేసి పట్టు సాధించాల్సిన తమ్ముళ్ళు.. దుమ్ము దుమ్ముగా కుమ్ములాడుకుంటున్నారట. ఈ రచ్చ ఇప్పుడు పీక్స్‌కు చేరిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి.. నియోజకవర్గంలో మామాటే చెల్లుబాటవుతుందన్న కోణంలో.. ఇన్ఛార్జ్ పదవి కోసం ఎవరికి వారు గట్టిగా పావులు కదుపుతున్నారట. దీంతో కలహాలు పెరుగుతున్నాయంటున్నారు కార్యకర్తలు. వరుసగా ఇన్నిసార్లు ఇక్కడ పార్టీ ఎందుకు ఓడిపోతోందని అంటే.. అందరి ఆన్సర్ ఒక్కటే. అంతర్గత కుమ్ములాటలన్నదే సమాధానం. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన ప్రతిసారి పోస్ట్‌మార్టంలో ఇదే విషయం తేలుతోందట. ఎక్కువ సందర్భాల్లో స్వల్ప తేడాతోనే పార్టీ అభ్యర్థి ఓడిపోవడాన్నిబట్టి చూస్తుంటేనే విషయం అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. చివరికి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని అంటున్నారు. నాయకుల మధ్య ఐక్యత లోపించడం, పోటీ చేసిన అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఎవరినీ కలుపుకోకుండా ఒంటెత్తు పోకడలు పోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ఈసారి ఎన్నికల నిధుల సద్వినియోగం, దారిమళ్ళడం లాంటి కారణాలు కూడా ఉన్నాయట. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కోట్ల సుజాత పోటీ చేయగా… అప్పుడు కూడా మిగిలిన వర్గాలు వ్యతిరేకంగా పని చేశాయట. అంతకు ముందు 2014లో వీరభద్ర గౌడ్ పోటీ చేసినప్పుడూ ఐక్యత లేని కారణంగానే స్వల్ప మెజారిటీతో ఓడిపోయారన్న పార్టీ వర్గాల మాట. మొత్తంగా ఆలూరు నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందన్నది పొలిటికల్ టాక్. ఇన్చార్జిగా ఉన్న వీరభద్రగౌడ్‌ను తప్పించి త్రీ మెన్ కమిటీని నియమించినా రచ్చ మాత్రం ఆగడం లేదట. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ఛార్జ్‌ని పెట్టడమన్నది టీడీపీ అధిష్టానానికే సవాల్‌గా మారినట్టు చెప్పుకుంటున్నారు. ఇన్ఛార్జ్‌లేక ఆలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కష్టంగా ఉందంటున్నారు టీడీపీ నాయకులు. అన్నదాత సుఖీభవ అమలు సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే మాజీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ వర్గం కార్యక్రమాన్ని బహిష్కరించినత పనిచేసింది. ట్రాక్టర్‌కు కట్టిన జెండాలపై పార్టీ నేత వైకుంఠం జ్యోతి ఫోటోలు ఉన్నాయన్న కారణంగా… వీరభద్ర గౌడ్ ట్రాక్టర్ నుండి దిగివెళ్ళిపోయారట.
Read Also: Visakhapatnam gun firing: సాగర తీరంలో కాల్పుల కలకలం..
ఆ సందర్భంలో ఇరు వర్గాల కార్యకర్తల జై వైకుంఠం, జై వీరభద్ర గౌడ్ అంటూ నినాదాలు చేశారు. చివరికి ఎమ్మెల్సీ బీటీ నాయుడు వీరభద్ర గౌడ్ ను బుజ్జగించి మరీ… కార్యక్రమానికి తిరిగి తీసుకువచ్చారట. అలాగే… సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా వీరభద్ర గౌడ్ వర్గీయులు రెండు మండలాల్లో అడ్డుకున్నారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌ని నియమించాలని డిమాండ్ చేశారు. ఆ పోస్ట్ కోసం వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతి , మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత రేస్‌లో ఉన్నారు. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లుగా ఉన్నారు. కానీ.. ఆలూరులో మాత్రం వీరభద్రగౌడ్ సమన్వయంతో వ్యవహరించడం లేదన్న కారణంగా ఆయన్ని తప్పించారు.
Read Also: Hyd Girl Death Update: బిల్డింగ్‌లో ఉన్న వారే హత్య చేశారా?.. ఇప్పటికీ వీడని మిస్టరీ
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజుతో త్రీమెన్ కమిటీ నియమించారు. అయినా లోకల్ టీడీపీ గాడిన పడలేదు. అదంతా ఒక ఎత్తయితే.. తాజాగా వీరభద్ర గౌడ్ కొత్త పాట పడుతున్నారట. టీడీపీ కార్యక్రమంలో టీడీపీ జిందాబాద్, జై జన్మభూమి వంటి నినాదాలు ఇవ్వడం సాధారణం. కానీ… ఆయన వాటన్నిటినీ వదిలేసి భారత్ మతాకీ జై అంటున్నారట. ఆ నినాదంలో తప్పు లేకున్నా…. టీడీపీకి జై కొట్టడం లేదనే లాజిక్ వెతుకుతున్నారట ప్రత్యర్థులు. అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి కార్యక్రమాల్లో భారత్ మాతాకీ జై అని మాత్రమే అన్నారట వీరభద్రగౌడ్. దీన్ని బట్టి చూస్తుంటే… ఆయనేమన్నా పక్క చూపులు చూస్తున్నారా అన్న చర్చ మొదలైందట నియోజకవర్గంలో. ఇలా… ఇన్ని రకాల సమస్యల మధ్య ఆలూరు టీడీపీని ఎలా గాడిన పెట్టాలో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారట టీడీపీ పెద్దలు.
