Site icon NTV Telugu

Off The Record:కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైందా?

tpcc 1

Maxresdefault (1)

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైందా ? అధిష్టానం వారికీ ఫుల్ స్టాప్ పెడుతుందా ? | OTR | Ntv

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన మొదలైందా ? రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మార్పుతో అధిష్టానం ప్రక్షాళనకి దిగిందా..? ఇన్‌చార్జ్‌ మార్పుతోనే పులిస్టాప్ పెడతారా ? మరో అడుగు ముందుకు వేస్తారా ? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే ప్రధానమైన చర్చ.

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలు…తిరుగుబాటు బావుట ఎగరేయడంతో కాంగ్రెస్ ప్రక్షాళన మొదలుపెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న ఠాగూర్‌ను బదిలీ చేసింది. అందరినీ సమన్వయ పరచాల్సిన రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు…ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ. దిగ్విజయ సింగ్ నివేదికలో కూడా ఇన్‌చార్జ్‌ వైఫల్యాలను స్పష్టం చేశారు. సీనియర్లు అనేక సమస్యలు ప్రస్తావించినా.. ప్రధానమైన సమస్య ఇన్‌చార్జేనని గుర్తించి ఠాగూర్ పై వేటువేసింది. ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో సమన్వయ లేమి పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని గుర్తించింది అధిష్టానం. వెంటనే మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మానిక్ రావు థాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ప్రక్షాళన ఇన్‌చార్జ్‌ వరకేనా ఏఐసీసీ కార్యదర్శులను కూడా ప్రక్షాళన చేస్తారా అనే చర్చ మొదలైంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏఐసీసీ నుంచి ముగ్గురు కార్యదర్శులు ఉన్నారు. ఇందులో సీనియర్ నేత బోస్ రాజుతో పాటు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరీ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రక్షాళనలో భాగంగా…ఇద్దరు కార్యదర్శులను మారుస్తారని చర్చ జరుగుతోంది. బోస్ రాజు సీనియర్… కర్ణాటక నుంచి వచ్చారాయన. ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉండటంతో…ఆయన కూడా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఆయన్ని ఎఐసిసి కార్యదర్శి బాధ్యతలు నుంచి తప్పించే అవకాశాలున్నాయట. దీనికి తోడు తెలంగాణలో కూడా ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండింటిని సమన్వయం చేయడంలో ఇబ్బంది తప్పదని… బోస్ రాజును తప్పిస్తారని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల వచ్చిన ఇద్దరు కార్యదర్శులు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి… ప్రియాంక గాంధీ టీమ్ మెంబర్స్. ఇద్దరిలో ఒకరిపై తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆ పార్టీ కీలక నేతకి, కార్యదర్శికి మధ్య పోసగటం లేదట. సదరు కార్యదర్శి పై అనేక రకాల ఫిర్యాదులు కూడా వచ్చినట్టు చర్చ జరుగుతోంది. సదరు నేతను పక్కన పెడతారని ప్రచారంలో ఉంది. ప్రియాంక గాంధీ టీంలో రోహిత్ చౌదరికి మంచి పేరుంది. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతారని అంటారు. ఇటీవల సీనియర్ల పంచాయతీలో కూడా రోహిత్ చౌదరి ఎప్పటికప్పుడు ప్రియాంక గాంధీకి సమాచారం చేరవేసినట్టు తెలిసింది. ప్రియాంక గాంధీకి నమ్మకస్తుడు. దీంతో రోహిత్ చౌదరిని అధిష్టానం కూడా ఎక్కువ పరిగణలోకి తీసుకుంటుందని సమాచారం.

ముగ్గురు కార్యదర్శులు ఇద్దర్ని మారుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండటంతో…నిర్మోహమాటంగా పనిచేసే నాయకత్వం ఎంతైనా అవసరం. ఇందులో భాగంగానే ఇన్‌చార్జ్‌ని మార్చేశారట. కార్యదర్శులను కూడా మార్చి ఎన్నికల నాటికి నాయకులందర్నీ… ఏకతాటి మీదకి తేవాలని ఆలోచనతో అధిష్టానం ఉందట. అయితే ప్రక్షాళనకి అధిష్టానం ఎప్పుడు శ్రీకారం చుడుతుందనేది చూడాలి.

Exit mobile version