NTV Telugu Site icon

TRS : హీరో విజయ్ అడుగులపై తెలంగాణలోనూ చర్చ

Vijay

Vijay

తమిళనాడులో సుపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత అంతే ఫాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరో విజయ్‌. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్‌ తక్కువ కాలంలోనే స్టార్‌డమ్‌ సాధించారు. సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో అడుగులు తమిళనాడుతోపాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి. విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత విజయం రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. దానికి ఇంకా సమయం ఉందని ఆ ప్రచారానికి అప్పట్లో తెరదించారు విజయ్‌.

ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టేనని హీరో విజయ్‌ భావిస్తున్నట్టు ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీపై మంతనాలు చేపట్టేశారట. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు దఫాలుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో విజయ్‌ రహస్యంగా చర్చలు జరిపారు. ఆ చర్చలపై తమిళనాడులో వేడీ వేడీ చర్చ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో నేరుగా ప్రగతిభవన్‌కి వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు హీరో విజయ్‌. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారట. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ అజెండాపై ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్‌తో విజయ్ భేటీ ఉత్కంఠ పెంచింది.

విజయ్‌ ఎందుకు హైదరాబాద్‌ వచ్చారు? సీఎం కేసీఆర్‌తో ఏం మాట్లాడారు అనే దానిపై తమిళనాడులోనూ ఆసక్తి పెరుగుతోందట. ఇద్దరి మధ్య ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తావన ఉండటంతో రాజకీయంగా జరగబోయే పరిణామాలపై రకరకాల ఊహాగానాలు చర్చల్లో ఉన్నాయి. ఆ మధ్య తమిళనాడు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. అదే స్టాలిన్‌కు తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో DMK వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్‌ కిశోర్‌. ఇదే పీకే ప్రస్తుతం టీఆర్ఎస్‌కూ సేవలు అందిస్తున్నారు. హీరో విజయ్‌కు కూడా ప్రశాంత్ కిశోర్‌ ఏదో విలువైన సూచనే చేసి ఉంటారని సమాచారం. ఆ వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్‌తో విజయ్‌ సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే కొత్తపార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో చర్చించారా? లేక ప్రత్యామ్నాయ అజెండాతో కలిసి సాగేందుకు మాటలు కుదిరియా అనేది సస్పెన్స్‌.

ఇక నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. కొందరు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు కూడా సమావేశం అయ్యారు. బీజేపీ వ్యతిరేకశక్తులతో కలిసి పనిచేస్తానని బహిరంగంగానే ప్రకటించారు ప్రకాశ్‌రాజ్‌. ఇప్పుడు హీరో విజయ్‌ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే హీరో విజయ్‌ అడుగులు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్‌తో ప్రత్యామ్నాయ అజెండాపై కలిసినడుస్తారా? లేక కేవలం 2026లో జరిగే తమిళనాడు ఎన్నికలకే పరిమితం అవుతారా అన్నది చూడాలి.