ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ బయటకు మాట్లాడరు. గట్టిగా ప్రశ్నిస్తే… అది పార్టీ డిసైడ్ చేస్తుందని చెప్పి తప్పించుకుంటారు. బీజేపీ చెబితే ఎక్కడి నుంచైనా బరిలో ఉంటామని మరో మాట దానికి జత చేస్తారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల చేసిన ప్రకటన ప్రస్తుతం కాషాయ శిబిరంలో చర్చగా మారింది.
నిన్న మొన్నటి వరకు బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీకి సై అంటూ వచ్చారు ఈటల రాజేందర్. అలాంటిది ఒక్కసారిగా తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. ఈ అంశంపై ఇతర పార్టీల కంటే ఎక్కువ చర్చ జరుగుతోంది బీజేపీలోనే. గజ్వేల్‌లో పని ప్రారంభించానని.. ఆ నియోజకవర్గంపై కన్నేసినట్టు ఈటల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని ప్రకటించారాయన. మరో సువేందు అధికారిని అవుతానని బెంగాల్‌లో మమత బెనర్జీని ఓడించిన అంశాన్ని ప్రస్తావించారు ఈటల. దీంతో బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో ఈటల ప్రకటనపై బీజేపీలో ఇంకో చర్చ కూడా జరుగుతోంది. హుజురాబాద్‌ను ఆయన వదులుకొనే ప్రసక్తే లేదని.. అలాంటిది గజ్వేల్‌కు ఎలా వెళ్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే.. జాతీయ నేతల అనుమతితో ఈటల ఆ ప్రకటన చేశారని అభిప్రాయపడేవాళ్లూ ఉన్నారు. ఈ అంశంపై పార్టీ వర్గాలకే క్లారిటీ లేదట. రేపటి రోజున ఈటలను చూసి మరోనేత.. తాను హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెబితే పరిస్థితి ఏంటి అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారట. అయినా.. పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి దగ్గరకు మమత బెనర్జీ వెళ్లింది తప్పితే.. మమతా బెనర్జీపై పోటీ చేస్తానని సువేందు సవాల్ చేయలేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. సీటు విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే చాలా మంది బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని.. అలాంటిది ఈటల అలా ఎలా ప్రకటన చేస్తారని కరుడుగట్టిన నేతలు నిలదీస్తున్నారట. మరి.. ఈటల ప్రకటన వెనక అసలు సంగతేంటో కాలమే చెప్పాలి.
