ఏపీలో మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ రెండేళ్లూ పార్టీతోపాటు నేతలు ప్రజల్లోనే ఉండేలా ప్రొగ్రామ్‌ను నిర్దేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. ఒక్కో సచివాలయ పరిధిలో రెండు రోజులు పర్యటించాలి. వలంటీర్లతోపాటు.. సచివాలయ సిబ్బంది వారి వెంటే ఉండాలి. అధినేత ఆదేశించగానే మెజారిటీ ప్రజాప్రతినిధులు ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చారు. అలా ఇవ్వకపోతే అధినేతకు వెంటనే రిపోర్ట్లు వెళ్లిపోతున్నాయి.
నాయకులు ఫీల్డ్‌లో తిరుగుతున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి రెండు, మూడు నిఘా బృందాలను అధినేత సిద్ధం చేశారట. ఏ రోజుకారోజు ఎవరెవరు ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు వెళ్లారు? ఎలాంటి సమస్యలు ప్రజల నుంచి వచ్చాయి అనే విషయాలు సాయంత్రానికి సీఎం టేబుల్ మీదకు చేరిపోతున్నాయట. అయితే గడప గడప కార్యక్రమంలో కొన్నిచోట్ల ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. టీడీపీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. అక్కడి దృశ్యాలను వెంటనే వైరల్ చేస్తున్నారు కొందరు. ఇది స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆందోళన కలిగిస్తోంది. కొన్నిచోట్ల తమకు అర్హత లేకపోయినా ప్రజలు ఏదో ఒకటి చేసి తమ దరఖాస్తు పరిశీలించాలని అదే పనిగా కోరుతున్నారు. వారి విన్నపాలకు అవుననకా.. కాదనలేక ఇబ్బంది పడుతున్నారట. కొన్నిచోట్ల నిన్నటి వరకు దొరకని ఎమ్మెల్యే ఇప్పుడు తమ ఇంటి వరకు వచ్చే సరికి పాత కోపం ప్రదర్శిస్తున్న ఘటనలు ఉన్నాయి.
ఒక సాదాసీదా ఎమ్మెల్యేలా.. జూనియర్ నాయకుడిలా గడప గడపకు వెళ్లడం మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు కొంత నామోషీగా ఫీలవుతున్నట్టు సమాచారం. సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇంకా గడప గడప కార్యక్రమానికి బోణి కొట్టని ఎమ్మెల్యేల సంఖ్య చాలానే ఉందట. పైగా కడప జిల్లా వరకు రాని అసని తుఫానును సాకుగా చూపించి ప్రొగ్రామ్‌ను వాయిదా వేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వంటి నేతల తీరుపై పార్టీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు మాత్రం.. ఒకవైపు జనం.. మరోవైపు సీఎం జగన్.. ఎలారా బాబు అని తంటాలు పడుతున్నారట. చిత్తూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇలా బయటకొచ్చి అలా వెళ్లిపోతున్నారట. కొందరు ఎమ్మెల్యేలు ఫీల్డ్‌లోకి రావడం ఇష్టం లేక సొంత ఇంటి గడప కూడా దాట లేదట.
సీఎం జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. మీరు సరిగా పనిచేయక పోవడం వల్ల ప్రజలు ఆగ్రహం చూపిస్తే.. ఇప్పుడే ఆ రుచి చూసేయండి.. ఈ రెండెళ్లూ నిత్యం జనాల్లో ఉంటే వారి కోపం చల్లారుతుంది.. వారి సమస్యలు పరిష్కరించడానికి మీకు సమయం చిక్కుతుంది అని అప్పుడే సీఎం జగన్ సూచించారు. ఈ హితోక్తులు ఎంత మంది ఎమ్మెల్యేలు చెవికి ఎక్కించుకున్నారన్నదే ప్రశ్న. మరి.. వచ్చే ఎన్నికల నాటికి ఎంత మంది గ్రాఫ్ మారుతుందో.. ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలి.