Mahabubnagar TRS MP Manne Srinivas Reddy : అధికార పార్టీకి చెందిన ఎంపీ ఉత్సవ విగ్రహంగా మారిపోయారా? నియోజకవర్గానికి చుట్టపు చూపుగానైనా రావడం లేదా? ఏ విషయంలో ఎమ్మెల్యేలు.. ఎంపీపై ఫైర్ అవుతున్నారు? గత చరిత్రను తలచుకుని బాధపడుతోంది ఎవరు? లెట్స్ వాచ్..!
మన్నె శ్రీనివాసరెడ్డి. మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఎంపీ. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో శ్రీనివాసరెడ్డి గెలుపు నల్లేరుపై నడకైందని పార్టీ వర్గాలు చెబుతాయి. పారిశ్రామిక వేత్తగా ఉన్న ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడం.. గెలుపొందడం చకచకా జరిగిపోయినా.. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు మాత్రం ఆ వేగంతో లేవన్నది కేడర్ చెప్పేమాట. పార్టీ శ్రేణులే కాదు.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఎంపీపై నారాజ్‌గా ఉన్నారట. టీఆర్ఎస్‌లో ఇతర ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా.. కనీసం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని శాసన సభ్యులను కలుపుకొని వెళ్లడం లేదని టాక్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. చేపట్టాల్సిన పనులపై ఎంపీకి చెప్పుకొందామని అనుకున్నా శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉండబోరన్నది ఎమ్మెల్యేల ఆరోపణ.
ఎంపీగా గెలిచిన కొత్తలో మన్నె శ్రీనివాసరెడ్డి మెరుపు తీగలా కనిపించారట. తర్వాత ఆ మెరుపు ఎక్కడుందో.. నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదో పార్టీ వర్గాలకే అంతుచిక్కడం లేదట. పార్లమెంట్ పరిధిలో ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన కార్యక్రమాలకు సైతం వచ్చేది తక్కువేనట. ఇక ఎమ్మెల్యేలు స్వయంగా పిలిచినా.. మీరు ఉన్నారు కదా.. అలా నడిపించేయండి అని సలహా ఇస్తారట శ్రీనివాసరెడ్డి. దీంతో మెరుపు తీగ కాస్తా నల్లపూస అయిపోయిందని సెటైర్లు వేస్తున్నాయి గులాబీ శ్రేణులు.
గతంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యులుగా ఉన్న వారిని.. వారి పనితీరును గుర్తు చేసుకుని కథలు కథలుగా చెప్పుకొంటున్నారట స్థానిక జనం. మల్లిఖార్జున్, జైపాల్‌రెడ్డి, విఠల్‌రావు, జితేందర్‌రెడ్డిలు ఎంపీగా గెలిచిన తర్వాత.. తమ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనేది వాళ్ల వాదన. కొందరు కేంద్రమంత్రులుగా ఢిల్లీలో చక్రం తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 తర్వాత మహబూబ్‌నగర్‌లో ఎంపీ ఉన్నారో లేదో కూడా తెలియడం లేదన్నది జనం మాట. ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ముఖం చూపించకపోతే ఎలా అన్నది పార్టీ వర్గాల అభిప్రాయంగా ఉంది. దీంతో తమ ఎంపీ ఉత్సవ విగ్రహం అనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పారిశ్రామిక వేత్తగా ఉన్న ఎంపీ శ్రీనివాసరెడ్డి.. నియోజకవర్గానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు అని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయట. భారీ పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీ ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ప్రాతిపదికన కేంద్రీయ విద్యాలయాలు.. జవహర్ నవోదయ విద్యా సంస్థల ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. వాటిని సాధించడంలో శ్రీనివాసరెడ్డి సక్సెస్ కాలేదని పార్టీ వర్గాలే విమర్శలు చేస్తున్నాయి.
ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంతోపాటు.. జాతీయ నేతలు.. .కేంద్ర మంత్రులు ప్రవాసీ పార్లమెంట్ యోజన పేరుతో పాలమూరు పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాలు ఊదరగొడుతున్నారు. రాజకీయంగా పట్టు పెంచుకునే పనిలో కమలనాథులు ఉంటే.. ఎంపీగా వాటికి కౌంటర్లు ఇవ్వడం లేదని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయట. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఎంపీ శ్రీనివాసరెడ్డిలో చురుకుదనం లేకపోతే ఇబ్బందే అన్నది మరికొందరి వాదన. అయితే తమ పరిశ్రమలైన MSN ఫార్మాపై ఐటీ దాడుల తర్వాత శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి.. ఉత్సవ విగ్రహంగా మారడానికి కారణం ఏంటో ఎంపీ వెల్లడిస్తారో లేదో చూడాలి.