Site icon NTV Telugu

Srikakulam Ycp: తారస్థాయికి వర్గ విభేదాలు

ఆ జిల్లాలోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు.

ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్‌పై కేడర్‌ రుసరుసలు
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్‌లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్‌. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను దూరం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎచ్చెర్ల వైసీపీలోలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌పై మండిపడుతున్నారు కార్యకర్తలు. ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనియర్ నేతలు వివిధ దఫాలుగా సమావేశం అయ్యారు. కిరణ్ వ్యవహార శైలికి మాత్రమే తాము వ్యతిరేకమని, పార్టీ అధినాయకత్వంపై తమకు అపారవిశ్వాసం ఉందని ప్రకటించడంతో ఎచ్చెర్ల రాజకీయాలు వేడెక్కాయి.

ఆమదాలవలసలో తమ్మినేనికి వ్యతిరేకంగా నేతల నిరసన గళం
ఒక్క ఎచ్చెర్లే కాదు.. టెక్కలి, ఆమదాలవలసల్లో అసంతృప్తులు ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య దూరం పెరుగుతుందనే ప్రచారం ఉంది. తమ్మినేనికి వ్యతిరేకంగా పార్టీ నేత కోట గోవిందరావు బ్రదర్స్‌ నిరసన గళం డోస్‌ పెంచారు. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తే..అక్కడ తమ్మినేని ఫొటోలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు కోట బ్రదర్స్‌. ఆమదాలవలస మండలంలో చింతాడ రవికుమార్‌, పొందూరులో సువ్వారి గాంధీల తీరు కూడా అలాగే ఉందట. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో చెప్పకపోయినా ముఖ్యనేత కుటుంబసభ్యుల హవాపై ద్వితీయ శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారట.

టెక్కలిలో నేతల సమన్వయ లోపం.. కేడర్‌కు శాపం..!
టెక్కలి వైసీపీలోనూ సేమ్‌ సీన్‌. అక్కడ వైసీపీ అసంతృప్తుల గొడవలు ఉన్నాయి. పేరాడ తిలక్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మధ్య మూడు ముక్కలాట కొనసాగుతోంది. ఆధిపత్యం కోసం ఎవరి ఎత్తులు వారు వేస్తునే ఉన్నారు. ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో చివరికి తామే చిత్తవుతున్నామని వాపోతోంది కేడర్‌. నాయకుల మధ్య సమన్వయ లోపం తమకు శాపంగా మారిందన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట.

తర్జనభర్జనల్లో ఎమ్మెల్యేలు
ఇప్పటికి ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అసమ్మతి సంకేతాలు పంపిస్తోంది. ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారట. రానున్న రోజుల్లో విభేదాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన వైసీపీ అభిమానులది. మరి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

Exit mobile version