ఆ సీనియర్ ఎమ్మెల్యేకు సొంతపార్టీ నేతలే దూరం జరుగుతున్నారా? ఎమ్మెల్యే వద్దన్న వారికి పార్టీ పెద్దలు పట్టం కడుతున్నారా? ఎన్నికల తర్వాత కేడర్‌తో.. లోకల్ లీడర్లతో ఎందుకు గ్యాప్ వచ్చింది?
ఆనంతో విభేదించిన పార్టీ నేతలకు బుజ్జగింపులు
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. సంచలన కామెంట్స్‌తో అధికారపార్టీని కలవరపెడుతున్న ఆయనపై.. లోకల్ వైసీపీ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో ఆనం గెలుపుకోసం పనిచేసిన నాయకులు.. కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేకు దూరం జరుగుతున్నారు. వెంకటగిరి వైసీపీ వర్గాలుగా విడిపోయింది. ఇక్కడి పరిణామాలపై పార్టీ పెద్దలు కూడా ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఎన్నికల్లో అంతా కలిసి పనిచేసినా.. ఇప్పుడు దూరం
2019 ఎన్నికలు ముందు వరకు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో వెంకటగిరి వైసీపీ ఇంచార్జ్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి. లోకల్ వైసీపీ లీడర్లుగా గుర్తింపు పొందిన ఢిల్లీ బాబు, రాంప్రసాద్‌రెడ్డి, సురేష్‌రెడ్డిలు బొమ్మిరెడ్డికి మద్దతుగా ఉండేవారు. ఆనం వైసీపీలో చేరడం.. పార్టీ టికెట్ చకచకా జరిగిపోయింది. ఈ నిర్ణయం రుచించని సురేష్‌రెడ్డి, ఢిల్లీబాబులు సైలెంట్ అయిపోయారు. ఇంతలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ దొంతు శారద, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యచేంద్ర సైతం వైసీపీలో చేరడంతో పార్టీ బలం పెరిగింది. అయితే జగన్ సూచనల మేరకు అసంతృప్త నేతలతో ఆనం సమావేశమై సమస్యను కొలిక్కి తెచ్చారు.
శారదకు పదవి రాకుండా ఆనం అడ్డుకున్నారని ప్రచారం
ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే ఆనం వైఖరి రుచించని పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతూ వచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దొంతు శారద ఛైర్‌పర్సన్ పదవి ఆశించారు. కానీ.. భానుప్రియ అనే మరో మహిళను ఎమ్మెల్యే ఆనం ఎంపిక చేయడంతో.. శారద వర్గం దూరమైంది. పార్టీ పెద్దలు ఆమెతో చర్చలు జరిపి శాంతింపజేశారు. ఆమెకు నామినేటెడ్ పదవి రాకుండా ఆనం అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. సరిగ్గా అదే సమయంలో శారదను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. పదవి వచ్చినా శారద వర్గం ఆనంతో గ్యాప్ మెయింటైన్ చేస్తూనే ఉంది.
ఆనంపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు
మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికలోనూ విభేదాలు రావడంతో పార్టీ నేత రాంప్రసాద్‌రెడ్డి సైతం ఎమ్మెల్యే ఆనంకు దూరమయ్యారు. స్థానికంగా తమ సూచనలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర గుర్రుగా ఉన్నారట. ఈ వరస పరిణామాలు వైసీపీ పెద్దల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. కొందరు పార్టీ నాయకులు.. వైసీపీ జిల్లా వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారట. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆనంపై వారు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితేపార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించబోమని సజ్జల హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆనం వద్దన్నా దొంతు శారదకు పదవి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారట. ప్రస్తుతానికి కొంత సర్దుకోవాలని చెప్పినా.. అసంతృప్త నేతలు మాత్రం ఆనంతో దూరంగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారట.