ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కోంటోంది. గత ఎన్నికల్లో 11 స్ధానాలను గెలుచుకోగా… రెబల్ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య పన్నెండుకు పెరిగింది. సంస్ధాగతంగా పార్టీ పటిష్టతకు, జిల్లా అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం లభించింది. మంత్రివర్గ పునర్విభజన తర్వాత జిల్లాకు రెండు కీలకమైన పోర్ట్ ఫోలియోలు లభించాయి. గ్రామీణ అభివృద్ధి,
ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మంత్రిత్వ శాఖలు కావడంతో నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ… క్షేత్ర స్ధాయిలో పరిస్ధితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పైగా ఎవరికి వాళ్లు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లా నాయకత్వం ఆత్మీయంగా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. అధికారిక కార్యక్రమాల్లో మొక్కుబడి పలుకరింపులు తప్ప… మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న సందర్భం కనిపించ లేదు.
వాస్తవానికి మంత్రులను కలిసి నియోజకవర్గ స్థాయిలో గల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సింది ఎమ్మెల్యేలే. కానీ, ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు మంత్రులు కూడా శాఖాపరమైన వ్యవహారాలతో పాటు తమ నియోజకవర్గాల్లోని సమస్య పరిష్కారానికే పరిమితమవుతున్నారు.
ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరికి ఒకరు కలిసి రావడం లేదనే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమౌతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు పార్టీ పటిష్టత, ప్రభుత్వం ప్రతిష్టను రెండు భుజాలపై మోయాల్సిన భారం ఎమ్మెల్యేలదే. కానీ, అందుకు భిన్నమైన వాతావరణం కనిపించడంతో పార్టీ అధినాయకత్వం అయోమయానికి గురౌతోంది. ఈ పరిస్ధితికి పంతాలు, అంతర్గత విభేదాలు కారణమనే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితిపై YCPలోని కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .
మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణ జరిగి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అసంతృప్తి వీడడం లేదనే టాక్ నడుస్తోంది. ఇలాంటి వాళ్లలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల భీమిలిలో జరిగిన సమీక్షలో అవంతి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న బొత్స, పెద్ది రెడ్డి తర్వాత పార్టీలో తానే సీనియర్ అనే అభిప్రాయంతో వున్నారు అవంతి. పనుల కోసం ఎవరి దగ్గరకు వెళ్ళ వద్దని… నేరుగా హైకమాండ్‌ను సంప్రదించే సత్తా తనకు వుందని నాయకత్వంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు అవంతి. అయితే, ఈ కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశం మరొకటనే టాక్ నడుస్తోంది. మంత్రి అమర్నాథ్ దగ్గరకు వెళ్లకుండా లీడర్లను నియంత్రించేందుకు అవంతి ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
డబ్బుల కోసమో… పదవుల కోసమో… తాను రాజకీయాల్లోకి రాలేదని అవంతి తరచూ అనడం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం కాకముందు నుంచే ముత్యాల నాయుడితో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అంతర్గత వైరం వుంది. వివిధ కారణాలతో వీరిద్దరూ ఎడ ముఖం – పెడ ముఖంగా వుండే వాళ్లు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ముత్యాల నాయుడికి ఎదురెళ్ళి స్వాగతం పలికి ధర్మశ్రీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. నియోజక వర్గ అవసరాల కోసం ఆయన అమరావతినే నమ్ముకోవడం విశేషం. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడినా, చేసినా జీర్ణించుకోలేక కొందరు ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారనేది బహిరంగ రహస్యం. గడపగడపకు కార్యక్రమంలో ఎదురౌతున్న ప్రశ్నలను దాటుకుని వెళ్ళడం ఇబ్బంది మారుతోంది. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్నారనేది వాళ్ళ చర్యల్ని బట్టి అర్ధమవుతోంది.
నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్… ఇటీవల నాతవరం మండల పర్యటనలో ఉపయోగించిన భాష పట్ల సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇక, దక్షిణ నియోజక వర్గంలో అయితే రాజకీయాలు భరించలేక సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ పదవికి రాజీనామాస్త్రం సంధించారు. రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్ధానిక పరిస్ధితులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పాడేరు, అరకు ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ అభివృద్ధి, సంక్షేమంపై నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావం తక్కువగా ఉంది. పాయకరావుపేటలో ఎమ్మెల్యే బాబురావుతో మండల స్ధాయి నాయకత్వం ప్రత్యక్ష వైరం నడుపుతోంది. ఈ వ్యవహారం ఇప్పటికే పలు మార్లు పార్టీ పెద్దల వరకూ వెళ్ళింది. అయితే, తనతో విభేదిస్తున్న వాళ్లు మంత్రి అమర్నాథ్ పొందుతుండడం ఎమ్మెల్యేకు మింగుడుపడ్డం లేదు. ఒకటి రెండు సందర్భాల్లో అమర్నాథ్, గొల్లబాబూరావ్ కలిసినప్పటికీ… కేవలం పలుకరింపులకే పరిమితమయ్యారు. మరో సీనియర్ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు తనకు సంబంధించిన వ్యవహారాలన్నీ అధిష్టానంతోనే మాట్లాడుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కూడా మంత్రులతో సఖ్యతగా వుంటున్నా… నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకోలేకపోయారు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డికి మంత్రుల దగ్గరకు వెళ్ళి చేయించుకునే పనులు పెద్దగా వుండవు. నియోజకవర్గం మొత్తం గ్రేటర్ విశాఖ పరిధిలో ఉంది. దీంతో ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. నేతలు మంత్రుల దగ్గరకు వెళ్ళకుండా కొందరు ఎమ్మెల్యేలు కట్టడి చేసినప్పటికీ సీనియర్లు మాత్రం ఎప్పటి అవసరాలు అప్పుడే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమాత్యులను నేరుగా కలిసి… గ్రామాల్లోని సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని సమన్వయపర్చడం ఎవరికి సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.