Site icon NTV Telugu

Off the Record: పరకాల ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ లో అసంతృప్తి

Prkl

Prkl

Off the Record: అంతా.. నా ఇష్టం. నేను మోనార్క్‌ని అంటూ… పంచాయతీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? సొంత కేడర్‌ని డెవలప్‌ చేసుకునేందుకు వేస్తున్న పిల్లిమొగ్గలు ఉన్న కేడర్‌ని డిస్ట్రబ్‌ చేస్తున్నాయా? ఆయన ఎంటుకున్న సెలక్ట్‌ అంట్‌ ఎలక్ట్‌ పద్ధతి రెబెల్స్‌ బెడదను పెంచుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ జరుగుతోందా తంతు?

Read Also: Wedding: ‘‘రసగుల్లా’’ కోసం రచ్చ రచ్చ.. చివరకు పెళ్లి రద్దు..

పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. గాలివాటంలో గెలిచిన ఎమ్మెల్యే తీరు ఇలా కాకుంటే ఇంకెలా ఉంటుందిలే అంటూ… పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తున్నారట. వయసులో పెద్దవాడని, గతంలో ఆయనకు ఉన్న ట్రాక్ మంచిదనే ఉద్దేశంతో ఇప్పటివరకు బహిరంగంగా విమర్శించలేదు గానీ… రానురాను రేవూరి ప్రకాష్‌రెడ్డి తీరు చాలా తేడాగా ఉంటోందని సొంత పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారట. నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందర్నీ కలుపుకొని వెళ్లిన రేవూరి పరకాలకు షిఫ్ట్‌ అయ్యాక పూర్తిగా మారిపోయారని, ఆ కలుపుకోలుతనం లేకుండా పోయిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తాజాగా గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి.

Read Also: Sangareddy: సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

రేవూరి ప్రకాష్ రెడ్డి తీరుతో క్యాడర్ చీలిపోతోందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అంటూ ఎమ్మెల్యే కొత్తగా తీసుకొచ్చిన ఫార్ములాతో ఇబ్బందులు వస్తున్నాయట. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 108 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవూరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో లేని కష్టకాలంలో పరకాల ఇన్ఛార్జ్‌గా ఉండి కేడర్‌ను కాపాడిన ఇనగాల వెంకటరామిరెడ్డి, లోకల్‌గా పట్టున్న కొండా దంపతులు, రేవూరి గెలుపునకు సహకరించిన దొమ్మటి సాంబయ్య… ఇలా ఎవ్వరితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఎన్నికల్లో పోటీ చేసే ఉత్సాహంతో ఉన్న కార్యకర్తలు నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే…మీ గ్రామంలో మీకు మీరు చర్చించి ఒక్కరిని సెలెక్ట్ చేయండి ఆ సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎన్నిక అయ్యేలా మనం సహకరిద్దాం అంటూ సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పాలసీని ప్రవేశపెట్టారట.

Read Also: GHMC: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం.. కమిషనర్ కీలక ఆదేశాలు

దీంతో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడిన వాళ్ళ మధ్య విభేదాలు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ పార్టీలో పాత వాళ్ళకంటే… తర్వాత చేరిన వాళ్ళ హవా నడుస్తున్న క్రమంలో… ఎమ్మెల్యే నిర్ణయం కొత్త వాళ్లకే ప్లస్‌ అవుతుందంటూ ఓల్డ్‌ కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పుడు వారిని సమన్వయం చేసి ఒకరు పోటీలో నిలిచేలా మండల నాయకులు ప్రయత్నిస్తారు. అక్కడ కూడా సమస్య తేలకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు. కానీ… ఇప్పుడు పరకాలలో రేవూరి తీసుకువచ్చిన సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతితో ఏకాభిప్రాయం కుదరదు సరికదా… రెబల్స్ బెడద పెరిగిపోతోందట. ఇదే సమయంలో మండల స్థాయి నాయకులు సైతం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి కొత్తగా రావడం వల్ల ఆయనకంటూ ప్రత్యేకమైన కేడర్ లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వివిధ పార్టీల నుంచి వలస నేతలు వచ్చారు.

లోకల్‌గా సొంత కేడర్‌ లేకపోవడంతో రేవూరి కూడా వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నారట. గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరో…. పని చేయని వాళ్ళు ఎవరో కూడా అవగాహన లేకపోవడం వల్ల… తన మనుషుల్ని కాపాడుకునే క్రమంలో కొత్త కొత్త వివాదాలకు తెరలేపుతున్నారన్నది లోకల్ టాక్‌. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికీ క్యాడర్ ఉన్న ఇనగాల వెంకటరాంరెడ్డి, కొండా దంపతులు, ఈ సెలక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌ పద్ధతిని సమర్థిస్తూ తమ మనుషులకు సర్ది చెప్పలేకపోతున్నారట. మండల స్థాయి నాయకులతో సమన్వయానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన కొండా అనుచరులు గీసుకొండ, ఆత్మకూరు, సంగెం మండలాల్లో కొండా కాంగ్రెస్ పేరుతో నామినేషన్స్‌ వేస్తున్నారు. దీంతో రెబెల్స్‌ బెడద పెరిగిపోతోంది.

మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చే పనుల తీరు పైనా మండల స్థాయి నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతోందట. ఇటీవల పరకాల నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి సుమారు 400 కోట్ల అభివృద్ధి పనులను కేటాయించారు. ఈ పనుల్ని పరకాల నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులకు గాని ద్వితీయ శ్రేణి నాయకులను గాని ఇవ్వకపోవడంపై లోకల్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా కాంట్రాక్టర్లకు, నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఇచ్చేస్తే మేమేం కావాలన్నది పరకాల కేడర్‌ క్వశ్చన్‌. మొత్తంగా ఎమ్మెల్యే వైఖరితో పరకాల పరిధిలో రెబెల్స్‌ బెడద పెరిగిపోయి ఇబ్బందులు పెరుగుతున్నాయన్నది కాంగ్రెస్‌ ఇంటర్నల్‌ టాక్‌.

Exit mobile version