శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం వైసీపీ వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఈస్థాయిలో ఎక్కడా వర్గపోరు లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నవీన్ నిశ్చల్‌ను కాదని.. 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని టాక్. బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓడినా.. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి హిందూపురంలో ఇక్బాల్ పెత్తనం పెరిగడం.. నవీన్ వర్గానికి అస్సలు రుచించడం లేదట. ఇది చాలదన్నట్టుగా ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లీడ్ రోల్ తీసుకోవడం స్థానిక వైసీపీని మూడు ముక్కలాటగా మార్చేసింది.
ఇక్బాల్, మాధవ్ వర్గాల తీరు నవీన్ శిబిరానికి మింగుడు పడటం లేదు. పార్టీలో పెత్తనం చేయడం.. తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రగిలిపోతున్నారట. ఇంతలో నవీన్ నిశ్చల్‌కు ఆగ్రోస్ ఛైర్మన్‌గా నామినేటెడ్ పదవి ఇచ్చినా వారం రోజులుగా హిందూపురం వైసీపీలో మారుతున్న పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ మాధవ్‌లకు వ్యతిరేకంగా పార్టీలోని మరోవర్గం వేగంగా పావులు కదుపుతోంది. కర్నాటకలోని దేవనహళ్లి సమీపంలో ఉన్న ఒక రిసార్ట్‌లో ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఆ భేటీకి హిందూపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్, చిలమత్తూరు, లేపాక్షి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కొందరు కౌన్సిలర్లు, వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
రహస్య భేటీలో చర్చించిన అంశాలకు అనుగుణంగా ఫీల్డ్‌లోకి దిగాలని నిర్ణయించిన వైసీపీ నేతలు.. ఈసారి హిందూపురంలోనే దుకాణం పెట్టేశారు. బాలయేసు కాలేజీలో మరోసారి ఎంపీ, ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారట. ఈ సమావేశానికి నవీన్ నిశ్చల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరామిరెడ్డితోపాటు 12 మంది కౌన్సిలర్లు, లేపాక్షి, చిలమత్తూరు ఎంపీపీలు, లేపాక్షి వైస్ ఎంపీపీ హాజరుకావడంతో అసమ్మతి హీట్ పెరిగింది. హిందూపురం వైసీపీలో నాయకుడంటూ ఉండాలంటే.. లోకల్ వారై ఉండాలని.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే కుదరబోదని చర్చించారట. అదే విషయాన్ని వైసీపీ హైకమాండ్‌కు చేరవేయాలని నిర్ణయించారట. 2024 వరకు వారి పెత్తనం ఇలాగే ఉంటే.. వైసీపీ గెలవడం ఎలా ఉన్నా.. పరిస్థితులు దిగజారిపోతాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నాయట. ఎమ్మెల్సీ, ఎంపీలకు వార్నింగ్ ఇచ్చేలా పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవిని వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కట్టబెట్టారని.. ఆ పదవిని పార్టీ కోసం పని చేసిన బీసీలకు ఇవ్వాలని రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తీర్మానం చేశారట. 20మంది కౌన్సిలర్లతోపాటు వైస్ ఛైర్మన్ బలరాంరెడ్డి సంతకం చేసిన ఆ తీర్మానం కాపీని పార్టీ పెద్దలకు ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే హిందూపురం వైసీపీ ఇంఛార్జ్‌గా కొత్త వ్యక్తిని నియమించాలని.. ఎమ్మెల్సీ, ఎంపీల పెత్తనం వద్దని మరో తీర్మానం చేశారట. ఆ తీర్మానాల కాపీలను వైసీపీ పెద్దలకు అందజేసేందుకు తాడేపల్లిలో వాలిపోయారు అసమ్మతి నేతలు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను కలిసేందుకు నిర్ణయించారట. మరి.. ఈ రగడకు పార్టీ పెద్దలు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.