Ashok Gajapathi Raju : కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు రూటు మార్చేశారా? విజయనగరం రాజకీయాల్లో ఆసక్తికరమేనా? ఏ విషయంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కలవర పడుతున్నారు? టీడీపీ మార్చిన వ్యూహం ఏంటీ? లెట్స్ వాచ్..!
విజయనగరం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఆయన కుమార్తె కోలగట్ల శ్రావణి విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. నియోజవర్గంలో కోలగట్ల ఫామిలీదే శాసనం. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కోలగట్ల సత్తా చాటారు. ఆయన ఊ కొట్టందే ఏ పనీ కాదనే వాదన ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనకు ఎదురే ఉండబోదని కోలగట్ల లెక్కలేసుకుంటున్న తరుణంలో టీడీపీ శిబిరంలో జరుగుతున్న చర్చ కలవర పెడుతోందట. దాని చుట్టూనే ప్రస్తుతం విజయనగరంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమెపై స్వల్ప ఆధిక్యంతో గెలిచారు కోలగట్ల. వచ్చే ఎన్నికల్లోనూ అదితి గజపతిరాజే టీడీపీ నుంచి బరిలో ఉంటారని ఇన్నాళ్లూ ఎమ్మెల్యే భావించారట. కానీ.. ఈ దఫా అసెంబ్లీ బరిలో అశోక్‌గజపతిరాజే పోటీ చేస్తారని టీడీపీలో చర్చ సాగుతోంది. ఆ మాట ఎమ్మెల్యే చెవిలో పడటంతో అలర్ట్ అవుతున్నారట. వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో కావడంతో.. ఛాన్స్ తీసుకోవడానికి ఇష్ట పడటం లేదు. బలమైన నేతలను అసెంబ్లీ బరిలో దించాలని యోచిస్తోందట. ఆ క్రమంలోనే విజయనగరంలో అశోక్‌గజపతిరాజును అసెంబ్లీకి పోటీ చేయిస్తారని సమాచారం.
అశోక్ గజపతిరాజు కొంత కాలంగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. 2014లో ఎంపీగా గెలిచి.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అంతకు ముందు విజయనగరం ఎమ్మెల్యేగా.. మంత్రిగానూ ఉన్నారు. టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో ఏమో.. కొద్దిరోజులుగా విజయనగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఇదంతా అసెంబ్లీ బరిలో దిగడానికి చేసుకుంటున్న సన్నాహాలుగా భావిస్తున్నారట. బాదుడే బాదుడు కార్యక్రమాలు, పార్టీ సమావేశాలతో టీడీపీ కేడర్‌ను ఉత్సాహ పరుస్తున్నారట. ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉంటే.. లోక్‌సభ పరిధిలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలి. కానీ.. విజయనగరం అసెంబ్లీ పరిధిలోనే రాజుగారు తిరగడం చూశాక వైసీపీ శిబిరంలో చర్చ మొదలైందట.
మాన్సాస్ ట్రస్ట్ గొడవ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారు అశోక్‌గజపతిరాజు. ఆ ఎపిసోడ్‌పై విజయనగరంలో గట్టి చర్చే జరిగింది. పైగా నియోజకవర్గంపై ఆయనకు పట్టు ఉంది. అందుకే అశోక్‌గజపతిరాజు పోటీ చేస్తే సమీకరణాలు మారతాయని ఎమ్మెల్యే కోలగట్ల లెక్కలేస్తున్నారట. అశోక్ పోటీ చేస్తే.. ఇదే తనకు చివరి పదవి అని సన్నిహితుల దగ్గర కామెంట్స్ చేస్తున్నారట ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అశోక్‌గజపతిరాజును ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అనే దానిపైనా కోలగట్ల కసరత్తు చేస్తున్నారట. మరి విజయనగరం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎవరు ఉంటారో.. ఎవరు గెలుస్తారో కాలమే చెప్పాలి.