రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీజేపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలకు చెందిన నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడటం చర్చగా మారింది. గోపన్‌పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు అందరికీ తెలిసిపోయింది. అసెంబ్లీ బీజేపీ ఇంఛార్జ్ గజ్జెల యోగానంద్‌తో సహా పలువురు నాయకులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డితో జరిగిన వాగ్వాదం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
ప్రస్తుతం నియోజకవర్గం బీజేపీలో మూడు గ్రూపులు ఉండటంతో కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితి. బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒకరు దగ్గరైతే.. మరొకరు బండి సంజయ్ ముఖ్య అనుచరుడు.. ఇంకొకరు కేంద్ర మంత్రులకు కావాల్సిన వ్యక్తి. ఇలా ఎవరికి వారు హోదా చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరంటే మరొకరికి చిన్నచూపు. పరస్పరం దాడులు.. ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందనేది కేడర్ ఆవేదన. శేరిలింగంపల్లిలో గజ్జెల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవికుమార్‌యాదవ్‌లు ఆ వర్గాలకు నేతృత్వం వహిస్తున్నారు.
ఇటీవల రవికుమార్ అనుచరుడైన కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డికి సంబంధించిన ప్రైవేటు స్థలానికి వెళ్లి యోగానంద్, మొవ్వ సత్యనారాయణ అనుచరులు ఫోటోలు తీశారు. అయితే వాళ్లంతా గోపన్‌పల్లిలోని చెరువులను సందర్శించారు. ఆ సమయంలో వారిపై దాడి జరిగింది. అడ్డుకోబోయిన మొవ్వ సత్యనారాయణను కూడా వదల్లేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు.. బీజేపీలోనూ కలకలం రేపింది.
ఒక నాయకుడికి చెందిన ప్రైవేటు ఆస్తులు, భవనాలు, ఇతర విషయాల్లో మరో నాయకుడు జోక్యంతో దాడులు చేసుకునే వరకు సమస్య వెళ్లింది. పోలీసులు విచారణ చేస్తుండగానే.. ఈ అంశంపై మూడు వర్గాలు వేర్వేరుగా పార్టీ పెద్దలకు తమ వాదన వినిపించారు. ఈ అంశాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజా నిజాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తోందట. నియోజకవర్గంపై పట్టుసాధించే క్రమంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుందనే అభిప్రాయంలో పార్టీ పెద్దలు ఉన్నారట. అయితే ఒక్కోవర్గం వెనక పార్టీ నేతల బలమైన మద్దతు ఉండటంతో ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. అసలు చర్యలు తీసుకుంటారో లేదో కూడా చెప్పలేకపోతున్నారట. మరి.. ఇలాగే ఉపేక్షిస్తే శేరిలింగంపల్లి బీజేపీలో ఇంకెన్ని సిత్రాలు బయటపడతాయో చూడాలి.