రండి నడిరోడ్డుపై తేల్చుకుందామని సవాళ్లు చేసుకున్నారు. సడెన్‌గా ఒకరు డ్రాప్ అయ్యారు. రెండోవాళ్లకు అది అస్త్రంగా మారిపోయింది. మధ్యలో మరో లేడీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మన్యంలో సవాళ్ల సిగపట్లపై హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం. గిరిజన ప్రాంతమైనా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాటే. కురుపాం ఎమ్మెల్యే.. మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై తాజాగా స్థానిక టీడీపీ నేతలు సవాల్ విసిరారు. 500కోట్లకుపైనే అక్రమాస్తులు సంపాదించారన్నది టీడీపీ ఆరోపణ. దీనికి గట్టిగానే బదులిచ్చారు పుష్పశ్రీవాణి. ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారమె. ఈ నెల 11నే చర్చకు సిద్ధమని చెప్పడంతో దానికి టీడీపీ నేతలు ఓకే చెప్పారు. కానీ.. ఆరోజున పుష్పశ్రీవాణి రాకపోవడంతో టీడీపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. ఆమెకు సొంత వదిన అయిన శత్రుచర్ల పల్లవిరాజు ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
గుంటూరులో వైసీపీ ప్లీనరీకి వెళ్లడంతో చర్చకు రాలేనని పుష్పశ్రీవాణి ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో చర్చ వాయిదా పడింది. అయితే సమస్య మాత్రం సెగలు రేపుతూనే ఉంది. పూర్తి ఆధారాలతో వస్తే.. భయపడి పారిపోయారని పల్లవిరాజు ఎదురుదాడి చేయడం కురుపాం రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టైమ్, డేటు పుష్పశ్రీవాణే ఫిక్స్ చేసి.. ఇప్పుడు సాకులు వెతకడం.. అతికినట్టు లేదని విమర్శల డోస్ పెంచేశారు. నిజంగా చర్చ చేయాలని ఉంటే విమానంలో రాలేరా అనేది టీడీపీ ప్రశ్న.
ఈ గొడవ వెనక పెద్ద రాజకీయమే ఉందట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రెండు పార్టీలు జనాల అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన జనార్దన్ థాట్రాజు చనిపోయారు. ఆయన తర్వాత శత్రుచర్ల విజయరామరాజు అనుచరురాలైన జగదీశ్వరి కురుపాం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ టీడీపీ సీటు ఖాళీగా ఉందని భావించారో ఏమో.. పల్లవి రాజు అడ్వాన్స్ అవుతున్నారు. టీడీపీలో చేరి టికెట్ పట్టే ఆలోచనలో ఉన్నారట. శత్రుచర్ల విజయరామరాజుకు కుమార్తె వరస కూడా కావడంతో పెద్దల ఆశీసులు తప్పక లభిస్తాయని ఆమె లెక్కలేస్తున్నారట. ఇదే సమయంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీవాణిపై స్థానికంగా వైసీపీలో అసమ్మతి పెరుగుతోంది. టికెట్ ఆశించేవాళ్లు మెల్లగా తెరపైకి వస్తున్నారు. రాష్ట్రంలో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కుతుండటంతో.. జనాల్లో తమ పేరు చర్చల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు రెండు పార్టీల నేతలు. తాజా సవాళ్లు.. బహిరంగ చర్చను ఆ కోణంలోనే చూస్తున్నారట. మరి.. రానున్న రోజుల్లో ఈ సవాళ్ల సిగపట్లు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.