Site icon NTV Telugu

TRS : ఆ నియోజక వర్గంలో టీఆర్ఎస్ లో కర్చీఫ్ పాలిటిక్స్ మొదలయ్యాయా..?

Kerchif Politics

Kerchif Politics

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ టీఆర్ఎస్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్‌ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు సునీతా లక్ష్మారెడ్డి. పార్టీ కూడా ఆమెను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను చేసింది. అప్పటి నుంచి నర్సాపూర్‌లో దూకుడు పెంచారు సునీత.

పుట్టిన రోజుల వేడుకల సమయంలో నర్సాపూర్‌ అంతా సునీత కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు.. ఎంపీటీసీలు వేడుకలకు ఆహ్వానించి టచ్‌లో ఉండాలని చెప్పారట. అలాగే కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనతో కలిసి సాగిన కేడర్‌ను ఆకర్షించే పనిలో ఉన్నారట సునీత. వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసే ఉద్దేశంతోనే ఆమె గేర్‌ మార్చినట్టు కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. సునీత వర్గీయులు సైతం టికెట్‌ మేడమ్‌కే వస్తుందని ప్రచారం మొదలుపెట్టేశారు.

ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇటీవల మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి ఇంటిలోనే ఉంటున్నారు. ఇది సునీతా లక్ష్మారెడ్డికి కలిసొచ్చినట్టుగా కేడర్‌ చెబుతోంది. అయితే ఎమ్మెల్యే వర్గీయులకు ఈ పరిణామాలు అస్సలు రుచించడం లేదట. ఒకప్పుడు నర్సాపూర్‌లో పరిమితంగానే కార్యక్రమాల్లో పాల్గొనేవారు సునీతా లక్ష్మారెడ్డి. ఇప్పుడు ప్రొగ్రామ్‌ చిన్నదే అయినా అటెండ్‌ అవుతున్నారట. ఫంక్షన్లు పరామర్శలు వేటినీ వదలడం లేదట ఈ మాజీ మంత్రి. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అనుచరులు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమ నేతకే వస్తుందని.. సునీతకు నిరాశ తప్పదని కౌంటర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులను ఏకరవు పెడుతున్నారట.

మొత్తానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. నర్సాపూర్‌ టీఆర్ఎస్‌లో మాత్రం ఎలక్షన్‌ వేడి రాజుకుంది. టికెట్‌ కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్‌ వేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వర్గపోరులో ఎవరి పైచెయ్యి సాధిస్తారో.. ఇంకెవరూ ఉసూరు మంటారో చూడాలి.

Exit mobile version