నేనే టీడీపీ.. టీడీపీనే నేను అన్నట్టు రెచ్చిపోతున్న బుద్దా వెంకన్నను.. ఆయన సొంత జిల్లా పార్టీ నేతలే లైట్ తీసుకున్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో బుద్దా పిక్ కనిపించలేదు. వైసీపీపై.. వైసీపీ నేతలపై వరస విమర్శలతో యమ స్పీడ్‌లో ఉన్న బుద్దా.. ఆ సమావేశంలో తన రేంజ్‌ను ఓ లెవల్లో ఊహించుకున్నట్టున్నారు. కానీ.. ఫ్లెక్సీల్లో ఫొటో లేకపోవడంతో ఒక్కసారిగా నీరుగారిపోయారు. ఏడవడం ఒక్కటే తక్కువ. ఏడుపు వచ్చిందని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగింది?
టీడీపీలో ముఖ్య నేతగా వ్యవహరిస్తున్న బుద్దా వెంకన్న అలిగారు. చాలా కాలం తర్వాత జరిగిన కృష్ణాజిల్లా ఉమ్మడి సమావేశంలో తనకు అవమానం జరిగిందని ఆయన విపరీతంగా ఫీలయ్యారు కూడా. స్టేజ్ మీదున్న ఫ్లెక్సీల్లో తన ఫొటో లేకపోవడంపై హర్ట్ అయ్యారు. తాను పెద్ద లీడర్‌గా.. బెజవాడ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటే.. తన ఫొటో పెట్టారా..? అని ప్రశ్నించారు వెంకన్న. సమావేశానికి వచ్చినా.. స్టేజ్ ఎక్కకుండా సభికులతోనే కూర్చొని తన నిరసనను తెలిపారు. వేదిక మీదకు రావాలని మిగిలిన నేతలు ఆహ్వానించినా.. స్టేజ్ ఎక్కలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే సమావేశం నుంచి వెళ్లిపోయారు బుద్దా వెంకన్న. ఆయనతోపాటు మరో నేత నాగుల్ మీరా కూడా పీఛేముడ్ అన్నారు. వెళ్తూ వెళ్తూ ప్రస్తుత సమావేశంలో పరిస్థితి చూస్తుంటే తన కళ్ల వెంట నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంకన్న.
ఆ సమావేశంలో బుద్దా వెంకన్న ఫొటో ఎందుకు పెట్టలేదన్నది చర్చగా మారింది. కావాలనే పెట్టలేదా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అనే టాక్ నడుస్తోంది. ఆ సభలో వేదికపై కూర్చున్న వాళ్లలో చాలామంది ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్లే. వాళ్లంతా బుద్దా వెంకన్నతో సఖ్యతగా ఉన్నవారే. కేశినేని నానికి వ్యతిరేకంగా వీళ్లను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు వెంకన్న తెర వెనక మంత్రాంగం నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. అలాంటి బుద్దా వెంకన్న ఫొటో ఫ్లెక్సీలో కనిపించకపోవడం బుద్దాన్నే కాదు.. కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ ఎపిసోడ్‌లో వెంకన్న అనుమానాం అంతా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంపై ఉందట.
నెట్టెం రఘురాం.. ఎంపీ కేశినేని నానికి ఫేవర్‌గా వ్యవహరిస్తున్నారనేది కొంత కాలంగా బుద్దాకు సందేహం ఉందట. ఎన్టీఆర్ జిల్లా పార్టీ బాధ్యతలను నెట్టెం తీసుకున్న తర్వాత ఒక్కసారైనా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించలేదన్నది.. కేశినేని నాని వ్యతిరేకుల్లో జరుగుతున్న చర్చ. సమన్వయ కమిటీ సమావేశం జరిగితే.. కచ్చితంగా బెజవాడ పార్టీలో ఉన్న లుకలుకలు.. విభేదాలు మొత్తంగా బయటకు వస్తాయని భావించారట. ఎంపీ నానికి వ్యతిరేకంగా చాలా గళాలు వినిపిస్తాయనే ఉద్దేశంతోనే నెట్టం సమావేశం నిర్వహించడం లేదనేది బుద్దా అండ్ కో భావన. ఇవన్నీ చూస్తుంటే.. కచ్చితంగా స్టేజ్ మీద తన ఫొటో లేకపోవడానికి నెట్టెం ప్రధాన కారణం అన్నది బుద్దా అనుమానమట.
ఇదే సందర్భంలో మరో చర్చ జరుగుతోంది. స్టేజ్ మీద పెట్టిన ఫ్లెక్సీలో జిల్లా ఇంఛార్జులు.. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యులు.. జిల్లా పార్టీ బాధ్యుల ఫొటోలను మాత్రమే వేశామని చెబుతున్నారట. వర్ల రామయ్య పొలిట్‌బ్యూరో సభ్యుడిగా.. టీడీ జనార్దన్ పొలిట్ బ్యూరోలో ఎక్స్ అఫిషీయోగా ఉండటంతో వాళ్ల ఫొటోలు వేశామన్నది పార్టీ వర్గాల వాదన. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేకపోవడంతో.. ఎవరి ఫొటోను వేయలేదనేది ఆ చర్చ సారాంశం. ఇందులో బుద్దా వెంకన్నను అవమానించాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారట. కావాలనే పబ్లిసిటీ కోసం బుద్దా ఇదంతా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుద్దా వెంకన్న విషయంలో తాజాగా జరిగిన మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారట.
మాజీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత.. నానిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న.. తర్వాతి రోజు గుడివాడలో కంప్లయింట్ ఇచ్చేందుకు టీడీపీ బృందంతో కలిసి వెళ్లలేదు. గుడివాడ వెళ్తే తనకు ఏమైనా అవుతుందని బుద్దా భయపడ్డారా..? అని ప్రశ్నిస్తున్నారట. పైగా వెంకన్న చేసే దాంట్లో సగానికి పైగా వ్యవహారం ప్రచారం కోసమే ఉంటుందని.. అందువల్ల ఫ్లెక్సీల్లో ఫొటో ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదంటున్నారట బుద్దా వ్యతిరేకులు.