Dharmana Krishna Das :ఆయన మాజీ డిప్యూటీ సీఎం. ప్రస్తుతం పార్టీ పదవిలో ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు పెద్దగా చప్పుడు చేయని ఆయన.. ప్రస్తుతం మంగమ్మ శపథాలతో అధికారపార్టీలో కలకలం రేపుతున్నారు. సొంత నియోజవర్గంలో కుర్చీ కిందకు నీళ్లొస్తుంటే మాత్రం గమనించడం లేదట. ఆయనెవరో .. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రస్తుత ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేశారు ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. సమావేశం ఏదైనా.. పార్టీ ప్రభుత్వ కార్యక్రమమైనా.. ఆయన పొలిటికల్ టచ్ ఇస్తుంటారు. 2024 ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే జోస్యం చెప్పడం ఆయనకే చెల్లింది. ఇదే సమయంలో టీడీపీకి సవాళ్లు విసురుతున్నారు కృష్ణదాస్. మాటల వరకు బాగానే ఉన్నా.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నరసన్నపేటలో పరిస్థితి ఏంటంటే.. కేడర్ ఆందోళన చెందేలా ఉందట. పెద్దఎత్తున పార్టీ వర్గాలు ఆయనంటే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
అసమ్మతి స్వరాలు పెరిగి.. ఆయన సీటుకే ఎసరొచ్చేలా ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాస్తవాలు విస్మరించి… ఏవేవో ప్రకటనలు.. బీరాలు పలుకుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట పార్టీ కార్యకర్తలు. వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్నవాళ్లను వదిలేసి.. కొత్తవారిని వెనకేసుకుని తిరుగుతున్నారట కృష్ణదాస్. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇతర నియోజకవర్గాల్లో వర్గపోరును సెట్ చేస్తున్న ఆయన.. సొంత సెగ్మెంట్‌లో గ్రూపులను మాత్రం సరిచేయలేకపోతున్నారనే వాదన ఉంది.
నరసన్నపేటలో కృష్ణదాస్‌ను వ్యతిరేకిస్తున్న లోకల్ వైసీపీ లీడర్లు నలుగురు కలిసి వేరేగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా.. ఇసుక దందా, భూ కబ్జాలు, వసూళ్లుకు పాల్పడేవారని చేరదీస్తున్నారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. సమస్యను చక్కదిద్దేందుకు కృష్ణదాస్ చిన్నకుమారుడు కృష్ణ చైతన్య చొరవ తీసుకున్నా.. పలితం లేకుండా పొయిందట. పార్టీ నేతలు ముద్దాడ బాల భూపాలనాయుడు, రాజశేఖర్, రమణభరద్వాజ్ లు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చగా మారాయి. ఇసుక దందా వెనక కృష్ణదాస్ పెద్ద కుమారుడు రామలింగం నాయుడు, అతని భార్య ఉన్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది.
వంశధార ఇసుకే కాదు ఇతరత్రా ఏ పనులు కావాలన్నా కృష్ణదాస్ చుట్టూ కోటరీ తయారైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా పెద్దాయనకు తెలిసే జరుగుతుందో లేదో కానీ.. ఆయన మౌనం అనుమానాలకు తావిస్తోందని చెబుతోంది అసమ్మతి వర్గం. ఈ గొడవల కారణంగానే మొదటి నుంచీ కృష్ణదాస్‌ను నమ్ముకొన్ని కొందరు నాయకులు చిన్నాల కూర్మినాయుడు , బాలభూపతినాయుడు, బగ్గు రామకృష్ణ , తమ్మినేని భూషణ్ క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నారట. అవినీతికి దూరంగా ఉంటారని కృష్ణదాస్ గురించి నిన్నమొన్నటి వరకు చెప్పుకొన్నవాళ్లే.. తాజా ఆరోపణలపై నోరెళ్ల బెడుతున్నారట. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర గురించి రకరకాల అంశాలు సోషల్ మీడియాలో.. పార్టీ వర్గాల్లో చర్చగా మారుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి గురించి ఏవేవో కామెంట్స్ చేస్తున్న కృష్ణదాస్.. కాస్త నరసన్నపేటపై కూడా కన్నేయాలని హితవు చెబుతున్నారట. మరి.. ఆ సంగతి మాజీ డిప్యూటీ సీఎం గుర్తించారో లేదో కాలమే చెప్పాలి.