NTV Telugu Site icon

TTD Ekantha Seva: ఈ ఏకాంత సేవలేంటి గోవిందా?

కోవిడ్ ఆంక్షలను TTD వినియోగించుకున్నట్టుగా ఇంకెవ్వరూ ఉపయోగించి ఉండరు. తమకు అవసరమైతే రూల్స్‌ను బయటకు తీస్తుంది. లేకపోతే వాటిని గాలికొదిలేస్తుంది. ఇంతకీ కరోనా నిబంధనల పేరుతో TTD చేస్తోంది ఏంటి.. చెయ్యనిది ఏంటి?

కోవిడ్‌ పేరుతో ఏకాంతంగానే ఉత్సవాలు
దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులోకి రాకముందే అప్రమత్తమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. జనతా కర్ప్యూ.. లాక్‌డౌన్‌ విధించకముందే TTD వాటిని అమలు చేసి చూపించింది. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకముందే 2020 మార్చి 20 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు. ఈ క్రమంలో స్వామివారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది TTD. కొన్ని ఉత్సవాలు చేయకుండా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. పద్మావతి పరిణయోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలా? భక్తుల సమక్షంలో చేయాలా అనేది తేల్చుకునేలోపే ఏడాది అయిపోయింది. ఆ ఏడాది స్వామివారికి పరిణాయోత్సవాలు లేవు.

కరోనా తగ్గుముఖం పట్టినా ఏకాంత ఉత్సవాలేనా?
గత ఏడాది ప్రారంభంలో కోవిడ్ తీవ్రత తగ్గడంతో పరిమిత సంఖ్యలో భక్తులను మాడవీధుల్లోకి అనుమతించారు. వాహన సేవలను చేపట్టారు. ఇంతలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో స్వామివారి వార్షిక ఉత్సవాలు ఏకాంతానికే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ఆంక్షలను కేంద్రం సరళీకరించినా.. TTD పట్టించుకోవడం లేదు. ఏకాంత ఉత్సవాల నిర్వహణ సులభంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం వాటికే మొగ్గు చూపుతుందన్న వాదన ఉంది. ఈ వైఖరే విమర్శలకూ తావిస్తోంది.

అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలూ ఏకాంతమే..!
శ్రీవారు ఉత్సవ ప్రియుడు. అందుకే స్వామివారికి రోజూ నిత్యోత్సవాలు.. ప్రతివారం వారోత్సవాలు.. నెలనెలా మాసోత్సవాలు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కోవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఆ వైభవం భక్తులకు దూరమైంది. సేవలన్నీ ఏకాంతమే. వాటిల్లో పాల్గొనే భాగ్యం కేవలం TTD పాలకపెద్దలు, ఉన్నతాధికారులు.. వారి కుటుంబ సభ్యులకే దక్కుతోంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా.. తిరుమలతోపాటు.. TTD పరిధిలోని అనుబంధ ఆలయాల్లోనూ ప్రధాన ఉత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో కోటి మంది భక్తుల సమక్షంలో మేడారం సమక్మ సారక్క జాతర జరిగినా.. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రధాన ఆలయాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. TTDలో ఉలుకు లేదు. కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం ఆలయాల్లో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. నిజానికి.. అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తే.. దర్శనం చేసుకునేది స్థానికులే. ఆ విషయం తెలిసినా నిర్ణయం మార్చుకోరు.

ఏకాంత ఉత్సవాల ఆంతర్యం ఏంటి?
చిత్తూరు జిల్లాలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గింది. రోజుకు 30 కేసులు కూడా నమోదు కావడం లేదు. మరి.. ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే TTD చరిత్రలో మొదటి సారిగా శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించారు. పౌర్ణమి గరుడ సేవను మాత్రం మాడవీధుల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏకాంత ఉత్సవాలకు ప్రామాణికం ఏంటన్నది స్పష్టత లేదు. పైగా ఏకాంత ఉత్సవాలు టీటీడీ వారి కోసమే అన్నట్టుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా శ్రీవారి ఉత్సవాలను TTD కోసం కాకుండా.. భక్తుల కోసం నిర్వహిస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి. మరి.. ఆ సూచనల ప్రకారం TTD మైండ్‌ సెట్‌ మారుతుందో లేక బ్లైండ్‌గానే ముందుకెళ్తుందో చూడాలి.
.