Site icon NTV Telugu

BJP : ఢిల్లీ లో ఓకే మరి గల్లీలో..

Golilohands

Golilohands

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాబోదనే నినాదంతో కేడర్‌లో చురుకుపుట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. పార్టీ అగ్రనేతల రాక కూడా కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు. అయితే పైకి గంభీరంగా ఉన్నా బీజేపీ విస్తరణ.. సంస్థాగతంగా బలోపేతం అయ్యే విషయంలో నేతల మాటలకు.. గ్రౌండ్‌ లెవల్లో జరుగుతున్న పనులకు అస్సలు పొంతన కనిపించడం లేదట. ఇందుకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై తీసుకుంటున్న శ్రద్ధ ఏ పాటిదో.. అందులోని డొల్లతనం ఎంత ఉందో గ్రహించి కలవర పడుతున్నారట.

తెలంగాణలో 31 రిజర్వ్డ్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో 19 ఎస్సీ రిజర్వ్డ్‌, 12 ఎస్టీ రిజర్వ్డ్‌ సెగ్మెంట్లు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఆక్టివిటీని పెంచేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది బీజేపీ. ఆ కమిటీలతో పార్టీ రాష్ట్ర సారథి బండి సంజయ్‌ భేటీ అయ్యారు కూడా. రిజర్వ్డ్‌ నియోజకవర్గాల్లో చేయాల్సిన పనులు.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొన్ని సూచనలు చేశారట. ఢిల్లీ నాయకత్వం నుంచి కూడా ఇదే విధంగా కొన్ని అంశాలు చెప్పారట. పార్టీ పెద్దలు చెప్పడమైతే ఘనంగానే చెప్పారు కానీ.. క్షేత్రస్థాయిలో వాటి పనే మొదలు కాలేదట. కమిటీలు ఏం చేస్తున్నాయో.. కమిటీ సభ్యుల ప్రాధాన్యం ఏంటో.. ఎక్కడున్నారో అర్థం కావడం లేదట కమలనాథులకు.

రాష్ట్రం ఉన్న మొత్తం 119 నియోజకవర్గాల్లో 31 రిజర్డ్వ్‌ సెగ్మెంట్లే కావడంతో.. వీటిల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల పాగా వేయాలన్నది బీజేపీ ఆలోచన. అప్పుడే తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గాలు సుగమం అవుతాయని అనుకుంటున్నారట. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు.. ఫలితాల గణాంకాలు అదే విషయాన్ని చెబుతాయని లెక్కలతో కుస్తీ పడుతున్నారు నేతలు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టేందుకు ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గాల సమన్వయ కమిటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని.. ఎస్టీ రిజర్డ్వ్‌ నియోజకవర్గాల సమన్వయ కమిటీకి మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావును నియమించారు. ఈ రెండు కమిటీలతోనే సంజయ్‌ భేటీ అయ్యింది.

ఆ మధ్య ఖమ్మం జిల్లాలో ఎస్టీ కమిటీ సమావేశం జరిగింది. తర్వాత ఆ ఊసే లేదు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదట. ఈ సెగ్మెంట్లలో ఇతర సామాజికవర్గాలను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన ప్రొగ్రామ్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఈ రెండు కమిటీలలో ఉన్నవారికి పార్టీ మిగతా కార్యక్రమాలు అప్పగించిందట. ఇంకేముందీ.. ఆ పనుల్లో బిజీగా ఉన్నామని తప్పించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు చెప్పినా.. రాష్ట్ర నాయకత్వం దిశా నిర్దేశం చేసినా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు పట్టించుకోకపోవడం చర్చగా మారింది. ఢిల్లీకి.. గల్లీకి మ్యాచ్‌ కాకపోతే ఎలా అన్నది పార్టీలో కొందరి ప్రశ్న. మరి.. డొల్లగా మారిన పనితీరును కమలనాథులు సమీక్షించుకుంటారో లేదో చూడాలి.

 

Exit mobile version