తిరుపతిలో హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీల నాయకులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న ప్రదేశాల నుంచి వారంతా రిటర్న్ కావడంతో కొత్త టెన్షన్ నెలకొంది. వైద్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇళ్లకు చేరుకున్నవారు జనాల్లోకి వెళ్లకుండా క్వారంటైన్‌లో ఉంటే బెటర్ అనే చెబుతున్నారు. అది సాధ్యమయ్యే పనేనా?
తిరుపతి నుంచి సొంతూళ్లకు నేతలు, కార్యకర్తలు రిటర్న్!
ఏపీలో పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల నుంచి వేల సంఖ్యకు కరోనా కేసుల వ్యాప్తి అత్యంత వేగంగా పెరిగింది. రోజుకు ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా.. కరోనా కేసులు మాత్రం అధికంగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో టెస్ట్‌లు నిర్వహిస్తే కేసులు ఇంకా ఎక్కువగానే ఉంటాయని అభిప్రాయపడుతున్నాయి వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు. మరోవైపు- తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలను తలచుకుని ఇంకా ఆందోళన చెందుతున్నారట. కరోనాకు హాట్ స్పాట్‌గా ఉన్న ఏరియాల నుంచి వారు తిరిగి రావడంతో ఏం జరుగుతుందో అన్న కలవరం నెలకొంది.
ప్రచారంలో కోవిడ్ నిబంధనలు గాలికి!
ప్రధాన పార్టీలతోపాటు.. చిన్న చితకా పార్టీలకు చెందిన అగ్రనేతలు కూడా అదే పనిగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. తిరుపతి అర్బన్‌లోనూ విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా పరిధిలోనూ అదే పరిస్థితి. చిత్తూరు పర్యటనకు.. ప్రచారానికి వెళ్లిన కొందరు నేతలు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే ప్రచారంలో పాల్గొనాలని చెప్పినా.. పార్టీలేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
సొంతూళ్లకు చేరుకుంటున్న వాళ్లు సూపర్ స్ప్రెడర్లేనా?
తిరుపతి నుంచి సొంతూళ్లకు చేరుకున్న నేతలు కార్యక్రమాలు.. సమీక్షల పేరుతో బిజీగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో తిరుపతి నుంచి వచ్చినవాళ్లు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కామన్. కేడర్ సైతం నాయకుడు వచ్చారంటే చాలు కరోనా భయాన్ని పక్కనపెట్టి వారి దగ్గర వాలిపోతున్నారు. ఈ నిర్లక్ష్యమే కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతుందన్న బెంగ వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో కన్పిస్తోంది. అదే జరిగితే ఒక్కో లీడర్ సూపర్ స్ప్రెడర్ కావడం ఖాయమనే ఆందోళన ఉంది.
కొన్నాళ్లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లితే మంచిదా?
తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని వచ్చిన ప్రతి ఒక్కరూ కొన్నాళ్లపాటు ఎవరినీ కలవకుండా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒకట్రోండు జిల్లాల్లో మినహా మెజార్టీ జిల్లాల్లో కరోనా కేసులు పెద్దఎత్తున నమోదు అవుతున్నాయి. తిరుపతి పర్యటనకు వెళ్లిన వారు కూడా ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని లేకుండా శ్రీకాకుళం మొదలుకుని.. చిత్తూరు వరకు ఉన్నారు. అందుకే రానున్న రోజులు చాలా కీలకంగా భావిస్తున్నారు అధికారులు.