తెలంగాణలో కొత్త రాజకీయ కూటమికి హుజురాబాద్ వేదిక కాబోతుందా? ఉద్యమాలలో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన పక్షాలు.. ఎన్నికల్లో కలిసి పోతాయా? విపక్ష ఓట్లు చీలకుండా.. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
విపక్ష ఓటు బ్యాంక్ చీలకుండా కాంగ్రెస్ ఎత్తుగడ..!
హుజురాబాద్ ఉపఎన్నికలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లాలని చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అభ్యర్ధి ఎంపికతోపాటు.. వ్యూహాత్మకంగా ఈ అంశంపైనా ఫోకస్ పెట్టింది. గతంలో జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షానికి వచ్చిన ఓట్ల కంటే ప్రతిపక్షం చీల్చిన ఓట్లే ఎక్కువ. అందుకే ఇప్పుడు విపక్ష ఓటు బ్యాంక్ చీలిపోకుండా పావులు కదుపుతోంది కాంగ్రెస్. హుజురాబాద్‌లో కేడర్‌ను నిలబెట్టుకోవాలన్నది ఒక ఆలోచన. కొత్త ప్రణాళికలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు వివిధ పక్షాల నాయకులతో సంప్రదింపులు మొదలుపెట్టారు.
ఐక్యంగా.. బలంగా అడుగులు వేయాలని ఆలోచన..!
హుజురాబాద్‌లో CPI, CPM, జనసమితి, టీడీపీలతో కలిసి పనిచేయాలని అనుకుంటోంది కాంగ్రెస్. అయితే గతంలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికాయి. హజుర్‌నగర్, నాగార్జునసాగర్‌లలో లెఫ్ట్‌పార్టీల వైఖరి కొంత చర్చకు కూడా దారితీసింది.
ప్రస్తుతం హుజురాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ కొంత హోంవర్క్ చేసే పనిలో ఉంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతోపాటు టీజేఎస్ అధిపతి కోదండరామ్‌తో మాట్లాడుతున్నారు రేవంత్. ప్రస్తుత ఉపఎన్నికలో కలిసి వెళ్లడం వల్ల వచ్చే రాజకీయ లబ్ధి కంటే.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఐక్యంగా.. బలంగా అడుగులు వేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఆ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపుతోంది కాంగ్రెస్.
లెఫ్ట్ పార్టీలతో గ్యాప్ రాకుండా పీసీసీ టీమ్ జాగ్రత్తలు..!
తెలంగాణలో బీజేపీని కట్టడి చేయడానికి.. లెఫ్ట్ పార్టీలు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లూ.. పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉతమ్‌కు, కమ్యూనిస్ట్ పార్టీల నేతలకు మధ్య కొంత గ్యాప్ ఉంది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలను ఉత్తమ్ ఇబ్బంది పెట్టారనే ఫీలింగ్‌లో ఉంది CPI. ఇప్పుడా పొలిటికల్ గ్యాప్ లేకుండా కొత్త పీసీసీ బృందం జాగ్రత్తలు తీసుకుంటోందట. కాంగ్రెస్ నుంచి ఈ దిశగా ప్రయత్నాలు ఎలా ఉన్నా.. కలిసి పనిచేయడంలో కమ్యూనిస్టుల ఆలోచన ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. కాకపోతే త్వరలోనే విపక్షపార్టీల నాయకులతో సమావేశమై.. ఎన్నికల్లో కలిసి సాగడానికి చర్చించబోతున్నారట. మరి..ఈ కలయిక హుజురాబాద్ నుంచే మొదలవుతుందో.. లేక వచ్చే ఎన్నికలకు నాటికి పోస్ట్‌పోన్ చేస్తారో చూడాలి.