Site icon NTV Telugu

Congress : లోకల్ Vs నాన్ లోకల్..ఆధిపత్యపోరుతో కాంగ్రెస్ లో రచ్చ రచ్చ

Congres

Congres

సూర్యాపేట కాంగ్రెస్‌లో స్థానికత అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చి చర్చగా మారింది. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత పటేల్‌ రమేష్‌రెడ్డి మధ్య ఓ రేంజ్‌లో వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయడానికి ఇద్దరూ కుస్తీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. అదే విధంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లోకల్‌.. నాన్‌ లోకల్‌ అంశం వీరి మధ్య చిచ్చు పెడుతోంది.

రమేష్‌రెడ్డిపై ఆ మధ్య కొందరు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలిసి భగ్గుమన్నారు రమేష్‌రెడ్డి. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. సూర్యాపేటకు నేనే లోకల్‌ నాపై ఫిర్యాదు ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు రమేష్‌రెడ్డి. ఇక్కడే 27 ఏళ్లుగా రాజకీయాల్లో ఎదిగిన తనను స్థానిక ప్రజలు తప్పకుండా ఎన్నికల్లో ఆశీర్వదిస్తారని.. ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని ఆయన చెప్పారు. ఈ విమర్శలే ప్రస్తుతం లోకల్‌ కాంగ్రెస్‌లో చర్చగా మారాయి. పైగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండలోనే ఈ కామెంట్స్‌ చేయడం కాకా రాజేస్తోంది.

సూర్యాపేటలోని పలు మండలాల్లో రమేష్‌రెడ్డి కొద్దిరోజులుగా రచ్చబండలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రిని ఉద్దేశించి పదునైన విమర్శలు ఆపడం లేదు. వీటిపై దామోదర్‌రెడ్డి వర్గీయులు కాంగ్రెస్‌ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ ఫిర్యాదును కూడా రమేష్‌రెడ్డి అనుకూలంగా మలచుకోవడంతో విభేదాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అనే ఆసక్తి నెలకొంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో లోకల్‌ నాన్‌ లోకల్‌ అంశాన్ని చర్చల్లో పెడుతున్నారు.

కొన్నాళ్లుగా సూర్యాపేట కాంగ్రెస్‌లో అలికిడి లేదు. రెండు వర్గాలు కామ్‌గానే ఉన్నాయి. కానీ.. రాహుల్‌ గాంధీసభ, రైతు డిక్లరేషన్‌, రచ్చబండ కార్యక్రమాలతో సూర్యాపేటలో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఆధిపత్యపోరాటంలో రెండు వర్గాలు పోటాపోటీగా ప్రొగ్రామ్స్‌ కండక్ట్ చేస్తున్నాయి. రమేష్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మనిషిగా గుర్తింపు ఉంది. రేవంత్‌తోపాటే ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరారు. 2018లోనే సూర్యాపేట టికెట్‌ ఆశించి భంగపడ్డారు కూడా. రేవంత్‌ పీసీసీ చీఫ్‌ అయ్యాక రమేష్‌రెడ్డి గేర్‌ మార్చేశారు. వ్యూహాత్మకంగా స్థానికత అంశాన్ని చర్చల్లో పెడుతున్నారనే వాదన ఉంది. ఈ విషయంలో దామోదర్‌రెడ్డి వర్గం గుర్రుగా ఉందట. అందుకే రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఏ విధంగా బరస్ట్‌ అవుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version