Site icon NTV Telugu

Off The Record: రేవంత్ పాదయాత్రపై రగడ

Maxresdefault (2)

Maxresdefault (2)

రేవంత్ రెడ్డి పాదయాత్రపై దుమారం..| OTR | Ntv

పాదయాత్రపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి షెడ్యూల్‌ ప్రకటించినా.. దాని చుట్టూ రేగిన వివాదం ఇంకా చల్లారలేదు. ఇంతలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మారిపోయారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రపై కొత్త ఇంఛార్జ్‌ వైఖరి ఏంటో తెలియదు. దీంతో యాత్రకు అధిష్ఠానం అనుమతి లేదని చెప్పిన నేతల వ్యూహం ఆసక్తి రేకెత్తిస్తోంది.

రేవంత్‌ పాదయాత్రపై తనకు సమాచారం లేదన్న బోసురాజు
ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి టీం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలపాటు యాత్ర షెడ్యూల్ ఖరారు చేసినట్టు టాక్‌. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి పాదయాత్రకి సిద్ధం అవుతున్నారు అని చర్చ తెర మీదకు రావడంతో.. AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌ సంచలనం రేకెత్తించాయి. యాత్రకు అధిష్ఠానం అనుమతి లేదన్నది ఆయన వాదన. పార్టీ హైకమాండ్‌ అనుమతి ఉంటే పాదయాత్రకు మద్దతు ఇస్తామని చెప్పారు మహేశ్వర్‌రెడ్డి. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సైతం రేవంత్ పాదయాత్ర చేస్తున్నట్టు తనకు సమాచారం లేదన్నారు. పీసీసీ చీఫ్‌ కూడా దీనిపై ఎక్కడా అధికారికంగా ప్రకటన చేయలేదని ఆయన తెలిపారు. దీంతో 26 నుంచి మొదలయ్యే పాదయాత్రపై నీలినీడలు కముకున్నాయి. రేవంత్ టీం మాత్రం పాదయాత్ర ఉంటుందని ఢంకా బజాయిస్తోంది.

రేవంత్‌, భట్టి కలిసి పాదయాత్ర చేస్తారా?
ఏఐసీసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బ్లాక్‌స్థాయిలో పాదయాత్రలు 2 నెలలపాటు జరుగుతాయి. యాత్ర ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ.. ప్రియాంకా గాంధీలు వచ్చే అవకాశం ఉంది. అయితే రేవంత్ ఒక్కరే రాష్ట్రమంతా పాదయాత్ర చేయడానికి హైకమాండ్ అనుమతి లేదంటున్నారు కొందరు కాంగ్రెస్‌ నేతలు. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో.. పీసీసీ చీఫ్‌లు ఎక్కువ రోజులు పాదయాత్ర చేసే వేసులుబాటు ఇచ్చారని రేవంత్ వర్గం చెబుతోంది. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో పాదయాత్ర చేయాలంటే.. పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేతలు కలిసి చేయాలనే ప్రతిపాదన ఉందట. ఆ వాదనే నిజమైతే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు కలిసి పాదయాత్ర చేస్తారా? అనేది పార్టీ వర్గాల ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ ఒకవైపు.. సీఎల్పీ నేత భట్టి మరోవైపు పాదయాత్ర చేస్తారు అనే చర్చ కూడా నడుస్తోంది. ఇద్దరూ చేరోవైపు పాదయాత్ర చేసినా పార్టీకి మేలే అనేవాళ్లు కాంగ్రెస్‌లో ఉన్నారు.

కర్నాటకలో పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేత కలిసి బస్సుయాత్ర
కర్ణాటక కాంగ్రెస్‌లోనూ తెలంగాణ తరహాలోనే పార్టీలో గొడవలు ఉన్నాయి. అక్కడ మాజీ సీఎం సిద్ధరామయ్య.. పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ల మధ్య పడటం లేదు. ఎన్నికల వేళ విభేదాలను పక్కన పెట్టి.. కలిసి ఉన్నారనే సంకేతాలు పంపేందుకు సిద్ధ రామయ్య, డీకే శివకుమార్లు కలిసి బస్సుయాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోనూ అలాంటి కార్యాచరణ చేయాలనే అభిప్రాయాన్ని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ వ్యక్తం చేశారు. సమయం ముంచుకొస్తున్నా.. పార్టీలో పాదయాత్రపై ఇంకా అనేక చర్చలు.. ప్రతిపాదనలు నలుగుతూనే ఉన్నాయి. అధిష్ఠానం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. మాణిక్కం ఠాగూర్‌ ప్లేస్‌లో AICC వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమితులైన మాణిక్‌రావు ఠాక్రే ఇంకా రాష్ట్రానికి రాలేదు. ఠాక్రే ఈ నెల 11న హైదరాబాద్‌ వస్తారట. మరి అప్పుడైన పాదయాత్ర విషయంలో పార్టీకి స్పష్టత ఇస్తారో లేదో చూడాలి.

Exit mobile version