ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆశ. దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను మరింత బలంగా ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. ఈ క్రమంలో బీజేపీ రణతంత్రం ఒకలా ఉంటే.. కాంగ్రెస్ పొలిటికల్ వార్ ఇంకోలా ఉంది. కాకపోతే రెండు పార్టీల మధ్య ఒక విషయంలో సారూప్యత ఉండటంతో.. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో టెన్షన్ పట్టుకుందట. వాటిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముందుగా కాంగ్రెస్ విషయానికి వద్దాం. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా సీనియర్లే. ఎవరికివారు సొంత వ్యూహాలు రచిస్తారు. అనుకున్నది అనుకున్నట్టు కాకపోతే.. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక్క క్షణం ఆగరు. ఇటీవల హస్తినలో రాహుల్ గాంధీతో భేటీ జరిగిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. కొందరు మాత్రం ఇంకా సెట్ కాలేదన్నది గాంధీభవన్ వర్గాల వాదన. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సునీల్ అనే వ్యూహకర్త వచ్చారు. ఆయన టీమ్ క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టడంతో హస్తం శిబిరంలో అలజడి మొదలైందట.
కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లోపం ఎక్కువ. ఆ విషయం రాహుల్ గాంధీ వరకు వెళ్లింది. సమస్యను సెట్ చేయడానికి సునీల్ టీమ్ సాయం తీసుకున్నారట రాహుల్‌గాంధీ. ఇటీవల పీసీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆ భేటీకి కొందరు సీనియర్లు డుమ్మా కొట్టేశారు. సమావేశానికి వచ్చిన నేతలు మళ్లీ ఫిర్యాదులు చేసుకున్నారట. అయితే మీటింగ్‌కు వచ్చిన నాయకులకు తెలియని విషయం ఏంటంటే.. సునీల్ టీమ్ సభ్యులు కూడా అక్కడే ఉన్నారట. సమావేశం వివరాలను.. మీటింగ్‌కు ఎవరెవరు వచ్చారు.. ఎవరు రాలేదు అనే అంశాలు నోట్ చేసుకుని రాహుల్ గాంధీకి నివేదిక పంపిందట సునీల్ టీమ్.
ఈ విషయం తెలిసినప్పటి నుంచీ కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన మొదలైందట. సమావేశానికి ఆహ్వానం ఉన్నా రానివాళ్లు ఒకలా.. మీటింగ్‌కు వచ్చి ఏదేదో మాట్లాడేసిన నాయకులు మరోలా వణికిపోతున్నారట. ఇన్నాళ్లూ నాయకులే ఎవరికి వారు హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపేవాళ్లు. ఇప్పుడు సీన్ రివర్స్. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి మినిట్ టు మినిట్ వెళ్లిపోతోందట. కేవలం పార్టీ సమావేశాల్లో జరుగుతున్న విషయాలే కాకుండా.. నియోజకవర్గాల వారీగానూ గ్రౌండ్ రిపోర్ట్ అధిష్ఠానానికి పంపుతోందట సునీల్ టీమ్. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా సునీల్ టీమ్ ఏం చేస్తోంది? ఎప్పుడు రాష్ట్రానికి వచ్చింది అని ఆరా తీయడంతో బిజీ అయిపోయారు. రాహుల్ గాంధీ కూడా క్షేత్రస్థాయిలో పని చేయలేకపోతే టికెట్ ఇవ్వబోమని తేల్చేయడంతో నేతల్లో చలనం వచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి సునీల్ పేరు చెబితేనే పార్టీ నాయకులు ఉలిక్కి పడుతున్నారట.
ఇక బీజేపీ వైపు నుంచి కూడా తెలంగాణలో కేంద్ర టీమ్‌లు తిరుగుతున్నాయట. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రతి అంశాన్నీ వడపోస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సర్వే బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ కీలక కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. జిల్లాల్లో ఉంటున్న బీజేపీ నేతలు ఎవరు? హైదరాబాద్ వదిలిపెట్టకుండా రాజకీయం చేస్తోంది ఎవరు? పూర్తిగా తన దగ్గర సమాచారం ఉందని సంతోష్ వెల్లడించారట. పార్టీ ఇంట్రెస్ట్‌తో కాకుండా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో పనిచేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారని కుండబద్దలు కొట్టేశారట.
బీజేపీ సర్వే బృందాలు నియోజకవర్గాల్లో తిరుగుతూ నేతల పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో వారి రీచ్ ఏ విధంగా ఉంది? స్థానిక అంశాలపై ఏ మేరకు స్పందిస్తున్నారు? ఎంత స్పీడ్‌గా రియాక్ట్ అవుతున్నారు అనేది ఆరా తీస్తున్నారట. ఇతర పార్టీలలోని ముఖ్య నాయకులు ఎవరు? వారిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇతర పార్టీల నుంచి ఎవరిని లాగితే బీజేపీకి లాభం అనే అంశాలపై సర్వే టీమ్‌లు ఎప్పటికిప్పుడు రిపోర్ట్‌లు ఢిల్లీకి పంపుతున్నాయట. నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే అంశాలు.. సామాజిక పరిస్థితులు.. కులాల ప్రభావం కూడా అంచనా వేస్తున్నట్టు సమాచారం. రాజకీయాలతో సంబంధం లేకుండా లోకల్‌గా ప్రభావితం చూపించే వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు టాక్.
ఈ సర్వేలను చూస్తుంటే ప్రస్తుతం టికెట్లు ఆశిస్తున్న చాలామంది అడ్రస్ లేకుండా పోతారని చెవులు కొరుక్కుంటున్నారు కమలనాథులు. ఫీల్డ్‌లో ఉన్న సర్వే టీమ్‌లు నేరుగా బీఎల్ సంతోష్‌కే రిపోర్ట్ చేస్తుండటంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి సర్వే బృందాలు అటు కాంగ్రెస్‌లోనూ.. ఇటు బీజేపీలోనూ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
Watch Here : https://youtu.be/pGPwwko95ks
