NTV Telugu Site icon

Congress : ఆ సీనియర్ నేత ముందు జూనియర్స్ కుప్పి గంతులు వేస్తున్నారా.?

Vh Hanumanth Rao Congress

Vh Hanumanth Rao Congress

వి. హన్మంతరావు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఆయన నియోజకవర్గం అంబర్‌పేటలో అడుగు పెట్టాలంటే పార్టీ నేతలు హడలిపోతారు. పేరుకు సీనియరైనా.. నియోజకవర్గాన్ని VH అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శ కాంగ్రెస్‌ వర్గాల్లోనే ఉందట. ఎన్నికల్లో VH పోటీ చేసే పరిస్థితి లేదన్నది కొందరి వాదన. అలాగని అంబర్‌పేట కాంగ్రెస్‌లో బలమైనే నేతనూ తయారు చేయడం లేదట. 2018 ఎన్నికల్లో పొత్తులో బాగంగా.. అంబర్‌పేటను కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జూనియర్ నేతలు హడావిడి మొదలు పెట్టేశారు.

ఏకంగా నలుగురు కాంగ్రెస్‌ యువనేతలు పార్టీ టికెట్‌ కోసం గట్టి ఫోకస్సే పెట్టారట. హన్మంతరావు మనసులో ఏముందో వెల్లడి కాకపోయినా.. సత్తా చాటితే అంబర్‌పేట టికెట్‌ తమకే వస్తుందని లెక్కలేస్తున్నారట ఆ యువనేతలు. వారిలో కాంగ్రెస్‌ OBC సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌ ఒకరు. కాకపోతే VHతో శ్రీకాంత్‌కు గ్యాప్‌ ఉంది. VHపై దాడి ఘటనలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది రగడ. తనకు చెప్పకుండా అంబర్‌పేటలో మరో నేతను ఎంకరైజ్‌ చేయడం ఏంటనే లొల్లి జరిగింది. అందుకే 2018లో అంబర్‌పేట సీటును TJSకు ఇచ్చేశారు.

అంబర్ పేటలో తనకు సన్నిహితంగా ఉండే శ్రీకాంత్‌గౌడ్‌ను VH ప్రోత్సహిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో శ్రీకాంత్‌గౌడ్‌ సతీమణికి టికెట్‌ ఇప్పించారు కూడా. కానీ.. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అదేమైనా మైనస్‌ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయట. ఇదే సమయంలో సిటీ యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మోత రోహిత్‌ కూడా కూడా అంబర్‌పేటపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ యూత్‌ కాంగ్రెస్‌ యాక్టివిటీస్‌ను ఆయన పెంచుతున్నారు. కాంగ్రెస్‌కే చెందిన మరో నేత శ్రీనివాస యాదవ్‌ సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. VHతో సన్నిహితంగా ఉంటున్నారు కూడా. OBC విభాగంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి అనుకూల టీమ్‌ లేదు. ఆ కోణంలో రేవంత్‌కు దగ్గరయ్యే పనిలో ఉన్నారట శ్రీనివాసయాదవ్‌. ఈ విధంగా కాంగ్రెస్‌లో ఎవరికి వారు తమదే సీటు అనే ధీమాతో పావులు కదిపేస్తున్నారు. అయితే టికెట్‌ కేటాయింపునకు వచ్చే సరికి VH ఆశీసులు ఎవరికి అన్నదే పార్టీలో ప్రశ్న.

అంబర్‌పేటలో కాంగ్రెస్‌ యువనేతల హడావిడి చూశాక.. హన్మంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. VH కూడా అన్నీ గమనిస్తున్నారట. మరి.. అంబర్‌పేట కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై సమయం వచ్చినప్పుడు హన్మంతరావు స్పందిస్తారో లేక తనదైన శైలిలో గిట్టని వారికి తలంటేస్తారో చూడాలి.