కంకి కొడవలి పార్టీలో కూడా పోటీ ఉంది. పార్టీ పగ్గాల కోసం.. ఎవరి ప్రయత్నాలు వారివే. రాష్ట్ర మహాసభలకు CPI సిద్ధం అవుతున్న వేళ… తెలంగాణలో పార్టీకి కొత్త సారథి ఎవరనేది వామపక్ష శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో CPI రాష్ట్ర కార్యదర్శిగా నారాయణ పని చేశారు. అప్పట్లో పార్టీ నిత్యం మీడియాలో ఉండేది. సమస్యలపై పోరాటం చేయడమో.. లేక ఏదో ఒక అంశంపై రోడ్డెక్కేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత cpi పగ్గాలు చాడా వెంకటరెడ్డికి వచ్చాయి. ఆయన తన స్థాయిలో పని చేస్తున్నా.. నారాయణను మరిపించే స్థాయిలో లేదనేది పార్టీలో జరిగే చర్చ. చాడా చేయలేక పోయారా..? పరిస్థితులు కలిసి రాలేదా..? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త కార్యదర్శిపై చర్చ సాగుతోంది.
ఇప్పుడు CPI తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈ నెల 3 నుంచి 7 వరకు శంషాబాద్‌లో జరగబోతున్నాయి. సాధారణంగా పార్టీ రాష్ట్ర సారథిని ఎన్నుకోవడానికి రాష్ట్ర మహాసభలు వేదిక అవుతాయి. తెలంగాణలో cpi మూడో రాష్ట్ర మహాసభలకు సిద్దం అవుతుంది. అన్ని పార్టీల మాదిరిగానే ఇక్కడ కూడా పోటీ ఉందట. ఇతర రాజకీయ పక్షాలను బూర్జువా పార్టీలుగా పిలిచే కామ్రేడ్‌లు.. రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎంపికలోనూ వారి మాదిరే పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే పార్టీకి బలమైన నేపథ్యం ఉండాలని కామ్రేడ్లు భావిస్తున్నారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా.. రాష్ట్ర మహాసభల నిర్ణయం మేరకే cpiలో రాష్ట్ర కార్యదర్శి ఎంపిక జరగనుంది. ఈ దఫా చాడా వెంకటరెడ్డి ఫ్లేస్‌లో కొత్తగా పగ్గాలు చేపట్టేది ఎవరనేది ఉత్కంఠగా మారింది.
Cpi ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిని కొనసాగించాలని కోరే వారు కూడా పార్టీలో ఉన్నారు. అయితే ఇటీవలే చాడాకి గుండె ఆపరేషవ్ అయ్యింది. ఆరోగ్యం సహకరిస్తే ఆయన్ని కొనసాగించాలనే చర్చ కూడా ఉంది. మరికొందరు మాత్రం కొత్త రాష్ట్ర కార్యదర్శిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే కొత్త కార్యదర్శి ఎవరు? దీనిపై ఇద్దరు పేర్లు పార్టీలో చర్చగా ఉన్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన పల్లా వెంకటరెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుల పేర్లు బలంగా చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం పల్లా వెంకటరెడ్డి CPI సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన కార్యదర్శి పోస్ట్ ఆశిస్తున్నట్టు సమాచారం.
పార్టీ కోసం అసెంబ్లీలో.. ఖమ్మం జిల్లాలో సమస్యలపై పోరాటం చేసి.. నికార్సైన కమ్యునిస్టుగా పార్టీ నేతలు భావించే కూనంనేని సాంబశివరావు వైపు కొందరు మొగ్గు చూపుతున్నారట. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడంతోపాటు.. సింగరేణిలో పట్టున్న నేతగా కూనంనేనికి గుర్తింపు ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో CPIని గాడిలో పెట్టడానికి కూనంనేని చాలా అవసరమనే వాదన వినిపిస్తున్నారట ఆయన మద్దతుదార్లు. ఇద్దరి మధ్య ప్రస్తుతం గట్టి పోటీనే ఉంది. ఇదే సమయంలో పార్టీలో సామాజికవర్గాల సమీకరణాలపై లెక్కలు వేస్తున్నారట. అన్ని వడపోతల తర్వాత ఇద్దరిలో ఒకరికి పగ్గాలు ఇస్తారని భావిస్తున్నారు. మరి తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడే ఈ కీలక సమయంలో కంకి కొడవలిని పట్టుకునే దెవరో చూడాలి.