ఏపీలో బీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి? ఆ రాష్ట్రంలోని కీలక సామాజికవర్గంపై గురి పెట్టారా? ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన్నే ఎందుకు నియమించారు ? ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ ఆశిస్తోంది ఏంటి? ఆ రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను గులాబీ నేతలు వడపోస్తున్నారా? లెట్స్ వాచ్..!
ఏపీలో బీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి?
బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించింది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను అందుకు ముందుగా ఎంచుకుంది. దాదాపు పది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ను ప్రకటించినా ఇప్పటిదాకా రాష్ట్ర అధ్యక్షులను ఎంపిక చేయలేదు. తెలంగాణ-ఏపిల్లో భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వేరుపడి దాదాపు తొమ్మిదేళ్లు గడిచిన సమయంలో కేసియార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ శాఖను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబుతోపాటు ప్రజారాజ్యం, జనసేన తరపున పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌కు పార్టీపరంగా ఏపీ పగ్గాలు అప్పగించారు.
కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేస్తారా?
తెలుగు రాష్ట్రాలే అయినప్పటికీ తెలంగాణతో పోల్చితే ఏపీలో సామాజికవర్గాల ప్రభావం ఎక్కువ. ఆ సామాజికవర్గాల ఆధారంగానే అక్కడి రాజకీయ పార్టీల అజెండాలు ఉంటాయి. టిడిపి కమ్మ, వైసీపీ రెడ్డి, జనసేన కాపు సామాజికవర్గాల కేంద్రీకృతంగా రాజకీయాలు చేస్తాయనే చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది. కీలక నాయకులంతా ఆయా వర్గాల నుంచే ఉంటారు. చివరికి పార్టీ అధ్యక్షులు కూడా ఆ వర్గం వాళ్లే. సామాజికవర్గాల పరంగా ఈ డివిజన్ ఏపీలో చాలా క్లీయర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో బీఆర్ఎస్ శాఖను ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కాపు సామాజికవర్గానికి పెద్ద పీట వేశారు. ఆ వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్ ఏపీ చీఫ్‌గా నియమించడం చర్చగా మారింది. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు కాకుండా మిగిలిన బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయాలనేది కేసియార్ ఆలోచనగా కనిపిస్తోంది. కులాల ఆధారంగా నడుస్తున్న ఆ రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ తీసుకురావాలనే దిశగా మంతనాలు చేస్తున్నారు గులాబీ దళపతి.
ఏపీలోని కాపు, బీసీ నేతలపై గులాబీ పార్టీ కన్ను
కాపులతోపాటు బీసీ పాపులేషన్ ఏపీలో చాలా ఎక్కువ. ఎన్టీయార్ బీసీ మంత్రంతో టీడీపీని అధికారంలోకి తెచ్చారు. టీడీపీ, వైసీపీలు కూడా ఆ వర్గానికి ప్రాధాన్యం తగ్గించలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్, జనసేన, టీడీపీల్లో ప్రాధాన్యంలేని కాపు, బీసీ నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. మరి.. ఈ ఈక్వేషన్లు గులాబీ పార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో కాలమే చెప్పాలి.