తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్ ఎస్ యు ఐ నాయకుడి వివాహానికి హాజరైన ఇద్దరు నేతలు, ఆ పెళ్లి వేడుకను తమ రాజకీయ, వర్గ విభేదాలకు వేదికగా మార్చుకోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కొద్దిరోజుల క్రితమే వరంగల్ లో రాహుల్ సభ విజయవంతం కావడం, కలసి పని చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తున్న పరిస్థితుతుల్లో, తాజాగా ఇద్దరు కీలక నేతలు అద్దంకి దయాకర్, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ల మధ్య జరిగిన వాగ్వాదం, తోపులాట కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనానికి, ఆగ్రహానికి గురిచేస్తోంది.
కలసి పని చేయాల్సిన కీలక సమయంలో, కనిపించిన ప్రతిసారి కత్తులు దూసుకోవడంపై కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. రెండుసార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అసలు పొసగడం సలేదన్నది బహిరంగ సత్యం.
సుదీర్ఘ కాలం తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో, సూర్యాపేటకు మకాం మార్చారు. అప్పటి నుంచి తుంగతుర్తిలో తన పట్టు కోల్పోకుండా దామోదర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కోమటిరెడ్డి వర్గీయుడిగా ముద్ర ఉన్న అద్దంకి దయాకర్, తుంగతుర్తి లో ఎంట్రీ ఇవ్వడం, దామోదర్ రెడ్డి సహించలేకపోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.
అద్దంకి దయాకర్ కూడా అదే రీతిలో తుంగతుర్తిపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు. వీరి మధ్య కోల్డ్ వార్ కు అంతకంతకూ పెరుగుతోందే తప్ప, తగ్గడం లేదు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తన అనుచరులు లేదా ఆయన సూచించిన అభ్యర్థి, తుంగతుర్తి ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తుండటంతో, ఇద్దరిమధ్యా విభేదాలకు బీజం వేసింది.
అద్దంకి దయాకర్ సైతం ఎన్నికలకు ముందు మాత్రమే నియోజకవర్గంలో కనిపించడం, ఆ తర్వాత కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడంతో, నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు సపోర్ట్ లేకుండా పోయిందని టాక్. దీంతో నియోజవర్గంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరింత చక్రంతిప్పుతున్నారు. ఆయన ఆధిపత్యాన్ని తగ్గించడంలో అద్దంకి దయాకర్ పూర్తిగా విఫలమయ్యారన్న వాదన బలంగా వినబడుతోంది.
సెగ్మెంట్ లో దయాకర్ కు సెగలు?తన వర్గానికి చెందిన వ్యక్తి వుండాలని దామోదర్ రెడ్డి వ్యూహం?
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అద్దంకి దయాకర్, వచ్చే ఎన్నికల్లో కూడా తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో, దయాకర్ ను నియోజకవర్గం నుంచి ఎలాగైనా పంపించాలని దామోదర్ రెడ్డి పావులు కదుపుతున్నారన్న చర్చ వినిపిస్తోంది. తన వర్గానికి చెందిన వ్యక్తిని లేదా తాను సూచించిన వ్యక్తిని తుంగతుర్తి నుంచి బరిలోకి దింపాలని, ఇప్పటి నుంచే మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
మరోసారి నియోజకవర్గాల పునర్ విభజన జరిగే అవకాశం ఉండటం, అదే జరిగితే తుంగతుర్తి జనరల్ స్థానంగా మారితే, జనరల్ స్థానంలో తనకు పట్టున్న తుంగతుర్తి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి.
ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్, మూడోసారి కూడా బరిలోకి దిగితే అద్దంకి దయాకర్ గెలిచినా ఓడినా బలమైన నేతగా తుంగతుర్తి నియోజకవర్గంలో నిలబడే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అవకాశాన్ని అద్దంకి దయాకర్ కు ఇవ్వకుండా, దామోదర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.
కారణాలు ఏవైనా, కలిసి పని చేయాల్సిన సమయంలో కీలక నేతలు కత్తులు దూసుకోవడం పట్ల, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ రెండు రోజుల పర్యటనలో నేతలందరికీ దిశానిర్దేశం చేసినా, పద్ధతిలో మార్పు రాకపోవడం పట్ల స్థానికంగా నేతలు కలత చెందుతున్నారు.