Site icon NTV Telugu

TDP : ఆ మాజీ మంత్రి టైం చూసి పావులు కదుపుతున్నారా.? లేక స్పీడ్ పెంచారా.?

Chikkala Ramachandra Rao

Chikkala Ramachandra Rao

చిక్కాల రామచంద్రరావు. టీడీపీ సీనియర్ నేత. మొదట నుంచి పార్టీలో ఉన్నప్పటికి ఒక్క ఓటమితో ఆయనకి నియోజకవర్గం అంటు లేకుండా పోయింది. 2012లో చివరిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుని గ్రౌండ్‌వర్క్‌ చేసుకుంటుండంతో కాకినాడ జిల్లా టీడీపీలో ఒక్కసారిగా చర్చల్లోకి వస్తున్నారు.

తాళ్లరేవు నుంచి 1983లో తొలిసారి ఇండిపెండెంట్‌గా గెలిచిన చిక్కాల..1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరసగా సైకిల్ పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో తొలిసారి ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో తాళ్లరేవు నియోజకవర్గం రద్దు అయ్యి కొత్తగా కాకినాడ రూరల్ ఏర్పడింది. కానీ 2009, 2014, 2019 ఎన్నికల్లో చిక్కాలకి సీటు ఇవ్వలేదు. ఆ మూడుసార్లు పిల్లి అనంతలక్ష్మిఫామిలీ కాకినాడ రూరల్ నుంచి బరిలో నిలిచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయింది. రెండేళ్లుగా పిల్లి కుటుంబం టీడీపీకి దూరంగా ఉంటోంది. దాంతో నియోజకవర్గంలో పసుపు జెండా పట్టుకునే లీడర్ కరువయ్యారు. అందుకే చిక్కాల చూపు కాకినాడ రూరల్‌పై మళ్లిందనే ప్రచారం జోరందుకుంది.

చిక్కాల రామచంద్రరావు సొంత ఊరు కరప మండలం సిరిపురం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017లో స్థానిక సంస్థల కోటాలో చిక్కాలను పెద్దల సభకు పంపించింది టీడీపీ అధిష్ఠానం. 2023 వరకు పదవీకాలం ఉంది. ఆ పదవిని అడ్డం పెట్టుకుని జిల్లాస్థాయి సమావేశాల్లో తెగ హల్‌చల్ చేస్తున్నారట. పార్టీ తరఫున ఎవరు వచ్చినా రాకపోయినా.. పిలిస్తే చాలు ప్రతి సమావేశానికి హాజరవుతున్నారట. కాకినాడ రూరల్‌ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్తున్నారు చిక్కాల. కాకినాడ రూరల్‌పై ఎందుకంత ప్రేమ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్సీగా ఉన్న తాను ఏ అంశంపైన అయినా మాట్లాడతానని చెబుతున్నారట.

చిక్కాల గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2012లో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో రామచంద్రాపురంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో పోటీకి టీడీపీ తరపున ఎవరు ముందుకు రాలేదు. చివరికి పార్టీ ఆదేశాలతో బరిలో నిలిచారు. ఈ దఫాకాకినాడ రూరల్‌లో మాత్రం గట్టిగానే వర్కవుట్ చేస్తున్నారట. తరుచు నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసి ప్రయత్నాలు చేస్తున్నారట. పెళ్లిళ్లు పేరంటాలు అంటే క్షణాల్లో వాలిపోతున్నారట ఈ మాజీ మంత్రి. బరిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అని లెక్కలు వేస్తున్నట్టు చెబుతున్నారు. టీడీపీలో సీనియర్‌గా ఉన్న తాను సీటు ఆశిస్తే తప్పులేదు కదా అని ఆరాలు తీస్తున్నట్టు చిక్కాల.

కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని.. పార్టీ కూడా తనకు ఆ విధంగానే గౌరవం ఇచ్చిందని దీర్ఘం తీస్తున్నారట చిక్కాల రామచంద్రరావు. అవకాశాలను ఉపయోగించుకుంటే తప్పేంటన్నది ఆయన ప్రశ్న. కాకినాడ రూరల్‌ నా పాత నియోజకవర్గమే కదా అని కలిపేసుకుంటున్నారట చిక్కాల. పార్టీ కూడా త్వరలో ఈ విషయం పై
క్లారిటీ ఇస్తుందని అప్పుడు మనం జాగ్రత్తగా పని చేయాలని ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసేస్తున్నారట ఈ మాజీ మంత్రి. మరి.. చిక్కాల విషయంలో పార్టీ ఆలోచన ఏంటో కాలమే చెప్పాలి.

 

Exit mobile version