Site icon NTV Telugu

YCP : వైసీపీ ఎమ్మెల్యేకి చుక్కలు..గడప గడపకు సవాల్

Burra

Burra

బుర్రా మధుసూదన్‌. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. మూడేళ్లుగా పెద్దగా సమస్యలు లేకుండా రోజులు గడిచిపోయినా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో రివర్స్‌ కొడుతోందట. ఇన్నాళ్లూ వైసీపీ ద్వితీయశ్రేణి నేతలతో సయోధ్య కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారు మధుసూదన్‌. ఇటీవలే కొత్తగా వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. కానీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమే ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాయట.

సమస్యలపై కొందరు.. ఇన్నాళ్లూ ఏమైపోయారు అని ఇంకొందరు ప్రశ్నలు సంధిస్తుంటే.. వారితో వైసీపీ కేడర్‌ కూడా జత కలుస్తోందట. ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి శ్రమించిన తమను ఎందుకు విస్మరించారని వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేను నిలదీయడం పార్టీలో చర్చగా మారింది. కనీసం తమను దగ్గరకు పిలిచి పలకరించిన పాపాన పోలేదని మండిపడుతున్నారట. అయితే అలా ప్రశ్నించిన సొంత పార్టీ కేడర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం మరో సమస్యగా మారుతోందట. గుడిపాడులో ఒక మహిళ వేసిన ప్రశ్నకు ఎమ్మెల్యే దగ్గర సమాధానం లేదని కనిగిరిలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.

దీంతో గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యే.. అక్కడి ఘటనలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించకుండా జాగ్రత్త పడుతున్నారట. ఒకవేళ ఎవరైనా వీడియోలు తీసినా.. వాటిని డిలీట్‌ చేసే వరకు ఊరుకోవడం లేదని చెబుతున్నారు. అయితే స్థానిక సమస్యలు ఏంటో తెలుసుకోకుండా.. వాటికి పరిష్కారాలేంటో అధికారులను వాకబు చేయకుండా ఎమ్మెల్యే నేరుగా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అంతా రివర్స్‌ అయిందని పార్టీలో చర్చ జరుగుతోంది. కాస్తా ఆలస్యంగా తేరుకున్న ఎమ్మెల్యే సైతం.. తన వెంట వస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేస్తే ఎలా? అని ప్రజల ముందే ఆఫీసర్లను తలంటేస్తున్నారు.

కనిగిరిలో పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు ఇకపై గట్టిగానే ఫోకస్‌ పెట్టాలని ఎమ్మెల్యే నిర్ణయించారట. ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలు.. మధ్యలో ఆగిపోయిన పనులు.. కొత్తగా ప్రారంభించాల్సిన వర్క్స్‌పై కసరత్తు చేస్తున్నారట. ఆ మధ్య పార్టీ అధినేత చెప్పినట్టుగా ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తే.. ప్రజల్లో వ్యతిరేకత తగ్గుతుందనే అంచనాల్లో ఉన్నారట ఎమ్మెల్యే. మరి.. ఈ మార్పు ఎమ్మెల్యే మధుసూదన్‌కు ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

 

Exit mobile version