Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా

  • గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు కోసం నియోజకవర్గాల మీటింగ్స్‌కు నిర్ణయం
  • నమోదు గడువు ముగిసినా జరగని సన్నాహక సమావేశాలు
  • ఆ మీటింగ్‌లంటే ఖర్చుతో కూడిన వ్యవహారమన్న భావన
  • అంత ఖర్చు ఎలా భరించాలంటూ ఇన్ఛార్జ్‌లు వెనక్కి?
  • అంతకు ముందే SIR మీటింగ్స్‌ కోసం బాగా ఖర్చు
  • డబ్బులు ఊరికే వస్తున్నాయా అంటూ ఇన్ఛార్జ్‌ల మధ్య మాటలు?
  • ఇన్ఛార్జ్‌ల స్పందన చూసి అధిష్టానం కూడా వత్తిడి చేయలేదా?
Otr

Otr

Off The Record: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగబోయే ఈ ఎలక్షన్‌ ఓటర్ నమోదు కార్యక్రమం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్లాన్ చేస్తున్నాయి. అయితే అందరికంటే ముందే ఈ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన బీఆర్ఎస్ ప్రత్యేకమైన కార్యాచరణ కూడా రూపొందించుకుంది. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్‌లకు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు బాధ్యతలు అప్పగించారు. నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాకుండా… నియోజకవర్గం వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా భావించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ భావించారట. పట్టభద్రుల ఓటరు నమోదు కోసం సన్నాహక సమావేశాన్ని ఒక నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే అక్కడికి తాను హాజరవుతానని నియోజకవర్గ ఇన్చార్జ్‌లకు సూచించారు కేటీఆర్‌.

కానీ నమోదు తేదీ ముగిసిందిగానీ… సన్నాహక సమావేశాలు మాత్రం జరగలేదు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉందన్న గుసగుసలు ఇప్పుడు పార్టీలో తెగ వినిపిస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించకుండా నిర్వహించాలనుకున్న ఈ సన్నాహక సమావేశాలన్నీ ఇన్చార్జ్‌ల చేతుల మీదుగానే జరగాలని సూచించారు కేటీఆర్. సన్నాహక సమావేశాలు జరక్కపోవడానికి అదే ప్రధాన కారణమన్నది ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ టాక్‌. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలంటే అదొక పెద్ద ప్రహసనం అని నేతలు భావించినట్టు తెలుస్తోంది. ఆ కార్యక్రమం కోసం పెద్ద హాల్ బుక్ చేయడం నుంచి కార్యకర్తలకు భోజనాలు, మంచి చెడ్డ చూడాల్సిన అవసరం ఉంటుందని, అందుకు బాగా ఖర్చవుతుందని భావించారట ఇన్ఛార్జ్‌లు. అంత ఖర్చు మొత్తం మేమే భరించాలా? ఇప్పుడు అంత సీన్‌ ఎక్కడుందని అనుకుంటూ ఎక్కువ మంది ఇన్ఛార్జ్‌లు వెనక్కు తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. రెండు మూడు నెలల క్రితమే SIR కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించామని, దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్, హరీష్‌రావుని కూడా ఆహ్వానించామని చెబుతున్నారు. అప్పుడే తమకు ఖర్చు తడిసి మోపిడైందని అంటున్నారట.

ఇప్పుడు మళ్లీ పట్టభద్రుల ఓటర్ల సన్నాహక సమావేశాల పేరుతో ఖర్చు చేయాలంటే ఎలా…? డబ్బులేమన్నా ఊరికే వస్తున్నాయా అంటూ చాలామంది ఇన్ఛార్జ్‌లు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ పరిధిలో ఏ మండలాలు ఉంటాయో ఏ మండలాలు ఉండవో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఉత్తిపున్నేనికి ఖర్చు పెట్టడం దేనికి? పైసలేమన్నా చెట్లకు కాస్తున్నాయా అని అనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున ఇప్పుడు పెట్టే ఖర్చు వృధా అని నేతలు భావించినట్టుగా అధిష్టానానికి సమాచారం అందిందట. ఇలా ఇన్చార్జిల దగ్గర నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో అధిష్టానం కూడా గట్టిగా ఫోర్స్ చేయలేదని చెప్పుకుంటున్నారు. అందుకే పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాల పేరుతో సభలు ఏర్పాటు చేయకుండా… మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకోమని అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇలా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి డబ్బు ఖర్చు పెట్టడం ప్రధాన ఉద్దేశం కాదని ఓటర్ల నమోదు చేయించడమే ప్రధానమైన ఉద్దేశమని పార్టీ భావించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థి ప్రకటన జరగకుండా కేటీఆర్ సమావేశాలకు వెళ్లడం కన్నా…. ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల వారీగా మీటింగులు పెడితే బాగుంటుందన్న ఆలోచన కూడా ఈ సమావేశాలు రద్దవడానికి కారణంగా చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు.