OTR : బొత్స అనూష… డాటర్ ఆఫ్ సత్తిబాబు. నిన్నటి వరకు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిచితమైన పేరు ఇది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుని చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న ఆమె ఇప్పుడు కొత్తది, సొంత పొలిటికల్ ఐడెంటిటీతో ప్రజల ముందుకు వచ్చారు. అనూషకు కీలకమైన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బొత్స సత్యనారాయణ దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ది, పార్టీకి విధేయుడిగా వ్యవహరించిన చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాస్ ఝలక్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలను చూపించి కీలక సమయంలో జంప్ కొట్టడంతో పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. మజ్జి టీడీపీలో చేరడంతో ఆయన అనుచరులు, కేడర్ ఎటువైపు వెళ్తుందన్న చర్చ విస్త్రుతంగా నడిచింది. అదే సమయంలో భీమిలి నియోజకవర్గ కొత్త సమన్వయకర్త ఎవరన్న చర్చ మొదలవగా… రకరకాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. 2019లో ఇక్కడి నుంచి ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన అవంతి శ్రీనివాస్… నాడు జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. పార్టీ ఓడిపోయిన తర్వాత అవంతి రాజీనామా చేసి తటస్ధంగా ఉంటున్నారు. దాంతో…ఆ స్థానంలో భీమిలి వైసీపీ బాధ్యతలు చేపట్టిన చిన్న శ్రీను కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో పార్టీకి విధేయతతో పాటు నాయకత్వానికి అన్నివేళలా అండగా వుండే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ దిశగా పలు సమావేశాలు జరగ్గా….రాష్ట్రంలో తొలిసారి కీలక ప్రయోగం చేసింది వైసీపీ అధిష్టానం. ఆశావహుల పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇప్పటి వరకు సమన్వయకర్త నియామకంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ప్రకటనే కీలకంగా వుండేది. కానీ… ఈసారి మాత్రం భీమిలితో పాటు ఖాళీ అయిన నెల్లిమర్ల సమన్వయకర్త విషయంలోనూ ఇదే విధానం పాటించింది ఫ్యాన్ పార్టీ.
కానీ… భీమిలి రాష్ట్రంలోని పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి కావడం, రాజకీయ ప్రాధాన్యతను ద్రుష్టిలో పెట్టుకుని కేడర్ అభిప్రాయాలకు పెద్ద పీట వేసింది. ఆ దిశగా పలు పేర్లు ముందు పెట్టి సర్వే నిర్వహించగా…అనూహ్యంగా రేసులో ముందుకు వచ్చారు బొత్స అనూష. ఆమెకు 24శాతం మద్దతు లభించడం, సత్తిబాబు కుటుంబానికి భీమిలి నియోజకవర్గంలో వున్న వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు వంటివి కీలక పాత్ర పోషించాయట. ఆ లెక్కలతో అంతకు ముందు చిన్నశ్రీను ఇక్కడ కో ఆర్డినేటర్‌గా ఎంట్రీ ఇవ్వగలిగారని అంటున్నారు. ఇక, స్ధానిక సంస్ధల నుంచి మొదలుపెడితే… సార్వత్రిక సమరం వరకు రాబోయే రోజులు వైసీపీకి చాలా కీలకం. ఈ క్రమంలో… అనూష బొత్స కుటుంబ వారసురాలిగా కంటే… చీపురుపల్లిలో పార్టీతో సత్సంబంధాలు కలిగిన నాయకురాలిగా….మంచి అభ్యర్ధిగా ప్రొజెక్ట్ అవుతారని ఆలోచిస్తున్నారట వైసీపీ పెద్దలు. ఇక, సామాజికవర్గ పరంగానూ భీమిలి మొదటి నుంచి కాపు ఓటింగ్ ఎక్కువ. మిగిలిన బీసీ సామాజిక వర్గాలు కూడా బొత్స కుటుంబాన్ని ఓన్ చేసుకుంటాయి. దీంతో వివిధ కోణాల్లో విస్త్రుతమైన పరిశీలన తర్వాత ఆమెను నియమించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… సొంత పార్టీలో సమన్వయం అనూషకు పెద్ద కష్టం కాకపోవచ్చుగానీ… రాజకీయంగా భీమిలి బరిలో ప్రత్యర్ధులను ఎలా ఢీ కొడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్రలో ఎక్కువ ఫోకస్ వున్న స్ధానం భీమిలి. పెద్ద నియోజకవర్గం కావడంతోపాటు ప్రస్తుతం అభివృద్ధికి కేరాఫ్‌గా మారుతోంది. ఐటీ, డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులంటూ విశాఖ మీద గట్టిగా ఫోకస్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి ప్రాజెక్ట్‌ల పరంగా చూసుకుంటే భీమిలి చాలా కీలకం. దీంతో ఇక్కడ జరిగే ప్రతీపరిణామం అధికార పక్షంగా టీడీపీకి ఎంత ముఖ్యమో…ప్రతిపక్షంగా వైసీపీకి కూడా అంతే కీలకం. పైగా…ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయంగా బలమైన నేత. కాస్త అటూ ఇటుగా అనూష తండ్రితో సమానమైన గుర్తింపు, అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి మాజీమంత్రిని ఢీ కొట్టడం ఆషామాషీయేం కాదన్న అభిప్రాయం ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. అదే సమయంలో ఆ కుటుంబ నేపధ్యానికి అనూష క్లీన్ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. ఇలా… కొన్ని సంక్లిష్టతలు ఉన్నా… జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే… ఇంకా టైం ఉన్నందున ఎన్నికల నాటికి బొత్స అనూష సొంత ఇమేజ్‌తో నాయకురాలిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఓవరాల్‌గా ఈసారి భీమిలి రాజకీయం మాత్రం రసవత్తరంగా మారుతుందన్నది వాళ్ళ ఒపీనియన్.

