ఆ ఎమ్మెల్యేకు సోషల్ మీడియా గట్టి షాకే ఇచ్చిందా? ఆయన అన్నది ఒకటైతే.. ఆ మాటలను వేరొకరికి ఆపాదిస్తూ వైరల్ చేశారా? విషయం తెలుసుకుని తలపట్టుకున్న ఎమ్మెల్యే ఎవరు? ఇంతకీ ఆయన ఏం అన్నారు? ఏమా కథా? లెట్స్ వాచ్..!
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలనే ప్రస్తుతం ఎవరికి తోచిన విధంగా వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే భూమన పునర్ముద్రించిన మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తక ప్రతులను తిరుపతి సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భూమన చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను కొందరు చర్చకు పెట్టేశారు.. రచ్చ రచ్చ చేసేస్తున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలిసిన తర్వాత తల పట్టుకున్నారట ఎమ్మెల్యే భూమన. ఆ సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించినా.. నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని.. పతనమైన వ్యక్తి అధికారంలోకి వస్తే ఒరగబెట్టేది ఏదీ లేదని ఆయన ప్రస్తావించిన మాటలను పట్టుకుని చిలువలు పలువలు చేస్తున్నారట. కార్యక్రమం విజయవంతమైందనే సంతోషం కంటే.. సోషల్ మీడియాలో అవుతున్న రచ్చే ఎమ్మెల్యే శిబిరాన్ని కలవర పెడుతోందట. పార్టీ అధినేతను ఉద్దేశించే భూమన ఆ వ్యాఖ్యలు చేశారని కొందరు ట్రోల్ చేస్తున్నారట. దీంతో ఎక్కడో తేడా కొడుతుందని భావించిన ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే.
తన ప్రసంగానికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. వక్రీకరించడం బాధ కలిగిస్తోందని చెప్పారు భూమన. వైఎస్ కుటుంబంతో తనకు 48 ఏళ్ల అనుబంధం ఉందని.. తీవ్రవాద రాజకీయాల నుంచి వైఎస్‌ఆర్ వల్లే ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. జీవితాంతం వైఎస్ కుటుంబంతోనే ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ వివరణను కూడా వైరిపక్షాలు.. భూమన అంటే పడని వాళ్లు విపరీతార్థాలు తీస్తున్నారని భూమన శిబిరం టెన్షన్ పడుతోందట. మంత్రి పదవి రాకపోవడం వల్లే భూమన తన మనసులోని మాటను బయటపెట్టారని టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. జనసేన, టీడీపీ సోషల్ మీడియా విభాగాలు ఆ అంశాన్నే వైరల్ చేస్తున్నాయి. మొత్తానికి భూమన ఒకటి అంటే.. అవి వేరే విధంగా ప్రచారంలోకి వెళ్లడంతో ఎమ్మెల్యే బృందం ఉలిక్కి పడింది. మరి..ఈ కొత్త సమస్యను భూమన ఎలా అధిగమిస్తారో చూడాలి.