Site icon NTV Telugu

మొన్నటి దాకా ఒక లెక్క..అమిత్ షా వచ్చాక మరో లెక్క

Bjp

Bjp

తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత ఆధిపత్య పోరుకు పార్టీ అగ్రనేత అమిత్ షా చెక్ పెట్టినట్టేనని తాజా టాక్‌. పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌కే హైకమాండ్‌ అండ అని తుక్కుగూడ సభలో షా క్లారిటీ ఇవ్వడంతో.. కాషాయ శిబిరంలో అలజడి మొదలైందట. బహిరంగ సభ నుంచే పార్టీ నేతలకు.. శ్రేణులకు షా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ అంశాలపైనే వాడీవేడీ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు బీజేపీ సీనియర్లకు బీపీ ఎక్కువైందట.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభ సక్సెస్ అయిందని బీజేపీ శ్రేణులు సంబర పడుతున్నాయి. అమిత్ షా సభకు హాజరు కావడం.. ఆయన మాట్లాడిన మాటలు.. కామెంట్స్‌ చేసిన తీరు కమలదళానికి బలమైన టానిక్‌గా పనిచేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే షా చేసిన కొన్ని కామెంట్స్‌ చుట్టూ పార్టీ వర్గాల్లో గట్టి చర్చే జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించడానికి తాను రావాల్సిన అవసరం లేదని.. బండి సంజయ్‌ సరిపోతారని అమిత్‌ షా ప్రకటించారు. సంజయ్యే రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తారని చెబుతూ.. ఆయన పాదయాత్రపై ప్రశంసల జల్లు కురిపించారు. పైగా మూడో విడత పాదయాత్ర ఉంటుందని సంకేతాలివ్వడమే కాకుండా.. రాష్ట్ర చీఫ్‌ను దగ్గరకు తీసుకుని ఆప్యాయత ప్రదర్శించారు.

తుక్కుగూడ సభలో ఆ దృశ్యాలు చూసినవారందరికీ.. బీజేపీలో సంజయ్‌ ప్రాధాన్యంపై చెవులు కొరుకుడు ఎక్కువైంది. వాస్తవానికి బీజేపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉంది. సంజయ్‌ సారథ్యాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అసమ్మతి.. అసంతృప్తి పెద్దగా బుసలు కొట్టకపోయినా.. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదన్నది కాషాయ శిబిరంలో గట్టిగా వినిపించే మాట. ఒకరినొకరు కలుపుకొని సాగే వాతావరణం కనిపించడం లేదట. ఈ క్రమంలోనే ఒకరిద్దరు నేతలు సంజయ్‌పై బీజేపీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై ఇలా ఆరోపణలు వస్తే అగ్రనాయకత్వం గట్టిగానే పరిశీలిస్తుంది. దానికి తగ్గట్టుగానే పార్టీ నేతలు దూకుడు తగ్గించడమో.. వైఖరి మార్చుకోవడమో చేస్తారు. కానీ.. తుక్కుగూడ సభలో అమిత్‌షా కామెంట్స్‌.. సంజయ్‌ను పోగడ్తల్లో ముంచెత్తడం చూశాక.. ఫిర్యాదులను ఢిల్లీ పెద్దలు పక్కన పెట్టేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయట.

సభలో అమిత్‌ షా ఆ విధంగా మాట్లాడతారు అనికానీ.. పాదయాత్రను అంతలా ప్రశంసిస్తారని కానీ బీజేపీలో చాలా మంది సీనియర్లు ఊహించలేదట. దీంతో ఇప్పుడేం చేయాలా అని తీవ్రంగా మథన పడుతున్నట్టు సమాచారం. పైగా ఇకపై పార్టీలో తమపట్ల సంజయ్‌ ఇతర నేతల తీరు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి అమిత్ షా సభ కాషాయదళంలో ఉత్సాహంతోపాటు కొందరిలో కలవరం కూడా తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది.

Exit mobile version