బనగానపల్లె వైసీపీలో రాజకీయం రంగులు మారుతోంది. వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యక్తి బరిలో ఉంటారని.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో పదవిచ్చి బుజ్జగిస్తారని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధిష్ఠానం మూడ్ ఏంటో కానీ.. పార్టీ శ్రేణులు మాత్రం ఒక్కటే చెవులు కొరుక్కుంటున్నాయి. అదేంటో స్టోరీలో చూద్దాం.
చల్లా శ్రీలక్ష్మి రాజకీయాల్లో చురుకైన పాత్ర
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం. బనగానపల్లెలో ఆ ఫ్యామిలీకి బలమైన వర్గమే ఉంది. రామకృష్ణారెడ్డి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా చేశారు. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో ఎమ్మెల్సీ పదవిని రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఇచ్చారు. భగీరథరెడ్డి సైతం రెండు నెలల క్రితం పదవిలో ఉండగానే ఆకస్మికంగా కాలం చేశారు. దీంతో చల్లా కుటుంబం నుంచి బలమైన రాజకీయ నాయకులు ఇక ఎవరూ లేరని అనుకుంటున్న తరుణంలో భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి నేనున్నాను అని చురుకైన పాత్ర పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీగా ఉన్నప్పటికీ పెద్దగా జనాల్లోకి వచ్చింది లేదు. శ్రీలక్ష్మి యాక్టివ్ కావడం చల్లా వర్గానికి సంతోషం తీసుకొచ్చింది. పనిలో పనిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే చర్చ ఊపంబదుకుంటోంది. అదే బనగానపల్లె వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది.
ఎమ్మెల్సీ పదవిపై నిర్ణయం తీసుకోని అధిష్ఠానం
భగీరథరెడ్డి మరణంతో ఆయన ఎమ్మెల్సీ పదవి ఖాళీగానే ఉంది. పరామర్శించేందుకు వచ్చిన సమయంలో సీఎం జగన్.. చల్లా కుటుంబ సభ్యులతో చాలాసేపు మాట్లాడారు. చల్లా ఫ్యామిలీ రాజకీయ భవితవ్యంపై మాట్లాడి సమన్వయం చేసే బాధ్యతను మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది. శ్రీలక్ష్మికే ఎమ్మెల్సీ పదవి ఇస్తారని భావించారట. అయితే వైసీపీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమె మాత్రం వైసీపీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బనగానపల్లె ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి ఉన్నారు. ఆయన్ని కాదని శ్రీలక్ష్మికి పార్టీ టికెట్ ఇస్తుందా? అయితే అందుకు దారితీసే అంశాలేంటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పార్టీ పెద్దల దృష్టి శ్రీలక్ష్మి అభ్యర్థిత్వంపై పడిందా?
ఎమ్మెల్యే కాటసాని అనుచరులపై అక్రమ మైనింగ్, భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. అవి వైసీపీ అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లాయట. అందుకే వచ్చే ఎన్నికల్లో కాటసానికి టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నారట. ఇదే సమయంలో పార్టీ పెద్దల దృష్టి శ్రీలక్ష్మిపై పడిందని చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు రాజకీయంగా తన ఎదుగుదలకు ఉపయోగపడతాయని ఆమె కూడా భావిస్తున్నారట. చల్లా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం.. సింపతి శ్రీలక్ష్మికి కలిసి వస్తాయని కూడా మరికొందరు ఆ చర్చను ముందుకు తీసుకెళ్తున్నారట. అదే జరిగితే.. ఎమ్మెల్యే కాటసానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బుజ్జగిస్తారని టాక్. ఆ పదవి తీసుకోవడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారట.