Site icon NTV Telugu

Off The Record: పార్టీ మారాక అయోమయ పరిస్థితిలో బాలినేని.. పదవి లేక విలువ పోతుందని ఆవేదన..!

Balineni

Balineni

ఒకప్పుడు వెళ్ళిన చోటల్లా కుర్చీ గౌరవం దక్కే ఆ నేత ఇప్పుడు ఇప్పుడు తన కుర్చీ తానే వేసుకుందామనుకుంటున్నా కుదరడం లేదట. పార్టీ మారాక తన పరిస్థితి గడ్డిపోచతో సమానమైపోయిందని తీవ్రంగా మథనపడుతున్నారట. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా మారిన పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ఏమని మొరపెట్టుకున్నారాయన? ఎవరా లీడర్‌?

Also Read:Off The Record: ప్రధాని చెప్పినా ఎంపీల్లో ఒకరు లీక్‌ చేశారా?.. అనుమానపు చూపులు ఎటువైపు?

వైసీపీ హయాంలో కొన్నాళ్ళ పాటు ఓ వెలుగు వెలిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు వైఎస్‌ కుటుంబ బంధుత్వ బలం కూడా కలిసి రావడం ఆయనకు ప్లస్‌ అయింది. వైసీపీ ప్రభుత్వపు చివరి ఏడాదిలోనే ఆయనకు కష్టకాలం మొదలై ఇప్పుడు పీకల్లోతుకు దిగిపోయినట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అప్పట్లో జగన్‌తో ఏర్పడ్డ విభేదాలు ముదిరిపోయి చివరికి బాలినేని వైసీపీకి బైబై చెప్పేదాకా వెళ్ళాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక జనసేనలో చేరినా అక్కడ కూడా కంఫర్ట్‌గా లేరు బాలినేని. కంఫర్ట్‌ సంగతి తర్వాత… ముందసలు ఉనికే ప్రమాదంలో పడుతోందన్న ఆవేదన ఆయనలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అధికార కూటమిలో చేరితే తన రాజకీయ భవిష్యత్‌ వెలిగిపోతుందని ఈ మాజీ మంత్రి అనుకుంటే… ఇప్పుడు వెలుగు కాదుకదా…. ముందున్న దారి కూడా స్పష్టంగా కనిపించడం లేదని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.

పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అందులో ఆయన పాత్ర ఏంటన్నది ఇంత వరకు క్లారిటీ లేదట. నా సంగతేంటని పదేపదే అడుగుతున్నా… అధిష్టానం వైపు నుంచి నో రియాక్షన్‌. అసలు బాలినేని జనసేనలో చేరడాన్ని ఒంగోలు టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు వర్గాల మధ్య ఇప్పటికీ సఖ్యత లేదు. ఆయన పొలిటికల్‌ బ్రేక్స్‌కు ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చంటున్నారు. ఈ పరిస్థితిని మార్చుకుంటూ కూటమిలో తన ఎగ్జిస్టెన్స్‌ను చాటుకోవాలని కొద్ది నెలలుగా బాలినేని చేయని ప్రయత్నం లేదట. అయినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్‌ అవడం లేదంటున్నారు. కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తూ ఆయనకు ప్రాధాన్యం దక్కకుండా టార్గెట్ చేస్తున్నారన్నది సన్నిహితుల మాట.ఈ క్రమంలో… తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు బాలినేని.

ప్రస్తుతం ఎలాంటి పదవి లేకపోవడంతో పార్టీలో తనకు కనీస విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారట. గతంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి సంగతి కూడా తేల్చమని అడిగినట్టు సమాచారం. పార్టీలోకి ఎంట్రీ సమయంలోనే… ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారన్న మాటలు వినిపించినప్పటికీ…ఇప్పటి వరకు ఛాన్స్‌ దక్కలేదు. ఇప్పుడసలు ఏ పదవీ లేకపోవడంతో పార్టీలోనూ, వ్యక్తిగతంగానూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న భావనతో మళ్లీ ఎమ్మెల్సీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలిసింది. కానీ… ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవుల కోసం చాలామంది క్యూలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన కోటాలో బాలినేనికి అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్నలున్నాయి.

Also Read:Delhi Pollution: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వ్యాలిడ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వెహికల్స్ కు నో ఫ్యుయల్

ఇప్పటికిప్పుడు ఖాళీలు లేకపోయినా… రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల సీట్లు ఖాళీ అయితే, వాటిలో ఒకటి బాలినేనికి కేటాయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే… తన ఆదాయ వనరుల గురించి కూడా పవన్‌ దగ్గర శ్రీనివాసరెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ దగ్గర గ్రానైట్‌ క్వారీయింగ్‌ చేసుకునేందుకు పవన్‌ తలూపినట్టు సమాచారం. అదే క్వారీకి సంబంధించి గతంలో బాలినేని చాలాసార్లు జగన్‌కు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందట. మొత్తం మీద ఇంకా సైలెంట్‌గా ఉంటే మొత్తానికే మర్చిపోతారని భావిస్తున్న ఈ మాజీ మంత్రి ఇక లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Exit mobile version