Assembly Seats increase In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఇప్పట్లో పెంచేది లేదని కేంద్రం స్పష్టం చేసేసింది. దీనిపై ఏపీలోని ప్రధాన పార్టీలు ఎందుకు ఆచితూచి స్పందించాయి? లాభనష్టాలపై లెక్కలేసుకున్నాయా? దాని వెనక కూడా పెద్ద కథే ఉందని చెవులు కొరుక్కుంటున్నారా? ఏమా కథా? లెట్స్ వాచ్.
రాష్ట్ర విభజన సమయం నుంచీ ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపు హాట్ టాపిక్. పార్లమెంట్ సమావేశాల్లో 2014 నుంచి అనేకసార్లు ఈ అంశంపై ప్రశ్నించారు కూడా. దీనిపై కేంద్రం నుంచి ఒకటే సమాధానం. ఇప్పట్లో లేదు.. జరగదు అని. తాజాగా కూడా అదే రిపీటైంది. వాస్తవానికి కొన్ని సందర్భాలలో ఫైల్ రెడీగా ఉందని.. గెజిట్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా పొలిటికల్ కలర్ ఇచ్చాయి పార్టీలు. అనేక ఊహాగానాలు చెలరేగాయి. కానీ… ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అని తేలిపోయింది. 2031లోనే అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన.. పెంపు ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.
కేంద్రం చెప్పినదానిపై రాజకీయ పార్టీలు గగ్గోలు పెడతాయని అనుకున్నారంతా. ఏపీలోని ప్రధాన పార్టీలేవీ పట్టించుకోలేదు. ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా.. ఆయా పార్టీలు వేరే లెక్కల్లో ఉన్నాయని టాక్. అధికారంలో ఉన్నంత కాలం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే బాగుండేదని టీడీపీ ఆకాంక్షించింది. విపక్షంలోకి వచ్చాక ఆ ఆసక్తే లేదు. కేంద్రం ప్రకటనపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వారు కాస్తో కూస్తో స్పందించినా.. టీడీపీలో ఆ స్థాయిలో చర్చ నిల్. ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున మనీ పాలిటిక్స్ చేయడం కష్టమని భావిస్తోందట టీడీపీ. ఇప్పటికిప్పుడే సీట్ల సంఖ్య పెరగకుంటేనే మంచిదని తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఫీలవుతున్నారట. దీనికి అనుగుణంగానే కేంద్రం ప్రకటన ఉండడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారట.
మిగిలిన ప్రతిపక్ష పార్టీల్లోనూ సేమ్ సీన్ ఉందట. సీట్ల సంఖ్య పెరిగితే అభ్యర్థుల సమస్య వస్తుందని.. ఇబ్బందుల్లో పడతామని బీజేపీ, జనసేన శిబిరాల్లో అభిప్రాయ పడుతున్నారట. అధికార వైసీపీ దగ్గరకు వచ్చేసరికి.. వారిదో విచిత్ర సమస్యగా కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే లాభపడేది.. వైసీపీనే. కానీ కేంద్రం తాజా ప్రకటనపై ఆచితూచి స్పందించింది. సీట్ల సంఖ్య పెరిగితే మంచిదే కానీ.. అసలు అది తమ ప్రాధాన్యం కాదనే రీతిలో కామెంట్ చేసింది. ఇప్పుడన్న పరిస్థితుల్లో కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు చాలా వరకు ఉన్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం వంటివి కీలకం. అవి వదిలేసి అసెంబ్లీ సీట్ల గురించి అడిగితే రాజకీయంగా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇలా ప్రధాన పార్టీల నాయకులు ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.