Yalamanchili MLA : ఆ జిల్లాలో…ఆయనో సీనియర్ శాసనసభ్యుడు. ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. దశాబ్ధంన్నర కాలంగా తిరుగులేని నేతగా ఎదిగారు. అలాంటిది ఆ ఎమ్మెల్యేపై ఇప్పుడు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయ్. ద్వితీయ శ్రేణి నేతలు నేరుగా మంత్రులకు టచ్‌లోకి వెళ్లడం రాజకీయ వేడిని మరింత రాజేసింది. ఇదంతా పథకం ప్రకారమే జరుగుతుందని గమనించిన ఎమ్మెల్యే అలెర్ట్ అయ్యారు. ఇంతకీ…ఎవరా ఎమ్మెల్యే?
యు.వి.రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు…అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే. రెండు దశాబ్ధాల రాజకీయ అనుభవంతో నియోజకవర్గంపై గట్టిపట్టు సాధించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగిన కన్నబాబు…2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి..ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐతే…వచ్చే ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ గ్యారెంటీ లేదనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. వయోభారం, ఇతర కారణాల రీత్యా ఇక్కడ అభ్యర్ధి మార్పు అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయట. ఎమ్మెల్యే సైతం ఇప్పటికే మానసికంగా సిద్ధమైనట్టు టాక్. తన కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ కాబోయే ఎమ్మెల్యే అభ్యర్ధి అంటూ లీకులు ఇస్తున్నారట కన్నబాబు. అందుకే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ సుకుమార్ వర్మను ముందుంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కన్నబాబే అయినప్పటికీ వ్యవహారాలు నడిపించేది మాత్రం సుకుమార్ వర్మనే అన్నట్లుగా తయారైందట పరిస్థితి.
ఇక..ఇలాంటి తరుణంలోనే నియోజకవర్గంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ప్రచారం జరుగుతోంది. అచ్యుతాపురం మండలానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతోందట. జిల్లా మంత్రులు అమర్నాథ్, ముత్యాల నాయుడిని నేరుగా కలవడం సహించ లేక ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్నారనేది కార్యకర్తల ప్రధాన ఆరోపణ. అక్కడితో ఆగకుండా కన్నబాబు రాజు కక్ష సాధింపుల నుంచి విముక్తి కల్పించాలని ఓ ఎంపీటీసీ నేరుగా సీఎం జగన్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. దీంతో అధికార పార్టీలో అంతర్గత వ్యవహారాలపై చర్చ మొదలైంది. ఇంతకాలం ఎమ్మెల్యేపై భయంతోనే, పార్టీ మీద విధేయత కారణంగానో పనిచేసిన ద్వితీయ శ్రేణి నేరుగా ఆరోపణలు చెయ్యడం…అంతర్గత రాజకీయాలను బయటపెట్టినట్లయిందని గుసగుసలాడుకుంటున్నారు.
ఈ పరిణామాలతో ఎమ్మెల్యే అలెర్ట్ అయ్యారట. ఈ వ్యవహారాల వెనుక లోగుట్టును పసిగట్టి ఓ అడుగు వెనక్కి తగ్గారని టాక్. అసమ్మతి గళం వెనుక అసలు సూత్రధారి ఓ మంత్రికి అత్యంత సన్నిహితుడనేది ఎమ్మెల్యే కన్నబాబురాజు అనుమానం. దీంతో యలమంచిలిలో టిక్కెట్ తనకు ఇవ్వని పక్షంలో ఆప్షన్ హైకమాండ్ తీసుకుంటుందని చెప్పుకుంటున్నారట. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న స్ధానం కావడంతో ఇక్కడి నుంచి పోటీకి అధికార పార్టీలో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు…రాజకీయంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు బలహీనంగా ఉన్నాయని వైసీపీ భావిస్తోందట. టిక్కెట్ ఆశించే వారి సంఖ్య సహజంగానే పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పోటీలో నుంచి పుట్టుకు వచ్చిందే తాజా అసమ్మతి అని ఎమ్మెల్యే వర్గం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసి ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదంటున్నారట కన్నబాబు. పార్టీకి ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించేది లేదని బహిరంగంగానే చెప్పేస్తున్నారట. రాజకీయంగా ఎదుర్కొనే వాళ్లుంటే రావొచ్చని ప్రకటించడం ద్వారా ఆయన భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు అనుచరులు. ఈ వ్యవహారం టీ కప్పులో తుఫాన్‌గా చల్లారిపోతుందా?లేక పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతుందా?అనేది చూడాలి మరి.