టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం మంచుకోటగా మారి.. క్రమంగా పార్టీ ఉనికి కోల్పోతున్న దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గంపగుత్తగా వైసీపీ కైవశం చేసుకున్నప్పుడే ఈ విషయం తేటతెల్లమైంది. అప్పటితో పని అయిపోయిందని అనుకున్నారో.. పార్టీకి ఊపిరి లూదడం తమకు సంబంధం లేదని భావించారో ఏమో ప్రస్తుతం నాయకులతోపాటు పార్టీ కూడా పొలిటికల్ తెరపై నుంచి కననుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని తెలిసినా.. చీమ కుట్టినట్టు అయినా లేదట ఇక్కడి టీడీపీ నేతలకు.
ఎన్నికలు చేదు ఫలితాలను ఇచ్చినా.. ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న నాయకులు ఒక్కరూ లేరన్నది కేడర్ చెప్పేమాట. వైసీపీని గట్టిగా విమర్శించేవారు కానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కే నేతలు కానీ కనిపించడం లేదు. అధిష్ఠానం నుంచి గట్టి ఒత్తిడి వస్తే .. ప్రెస్‌నోట్ ఇచ్చి సరిపెట్టేస్తున్నారు నేతలు. మరి గట్టిగా ప్రశ్నిస్తే.. ఒక పదిమందిని పోగేసుకుని మీడియాకు ఫోజులిచ్చి వెంటనే కలుగుల్లోకి వెళ్లిపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని కీలక నియోజకవర్గాలకు నాయకులెవరో కూడా కేడర్‌కు అర్ధంకాని పరిస్థితి ఉందట. విజయనగరంలో టీడీపీ ఇంఛార్జ్‌గా గత ఎన్నికల్లో పోటీ చేసిన అదితి గజపతిరాజు ఉన్నారు. ఆమె యాక్టివ్‌గా లేకపోవడం పార్టీ శ్రేణులు డిశ్చార్జ్ అయిపోయాయి. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సొంత కుంపటి పెట్టేసుకున్నారు. నెల్లిమర్లలో నేతల గొడవలు చూశాక.. ఎవరివైపు ఉండాలే కేడర్‌కు అర్ధం కావడం లేదట. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు టీడీపీ బలోపేతానికి ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఈ విషయంలో ఆయనకు ఉన్న ఇబ్బందులు ఆయనవి.
విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా యువనేత కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. గతలో పార్టీ .. ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన అనుభవం లేదు. పైగా నియోజకవర్గాల్లోని టీడీపీ ఇంఛార్జులు సీనియర్లు కావడంతో.. వారికి నాగార్జున గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. గజపతినగరంలో కేఏ నాయుడు టీడీపీ ఇంఛార్జ్. ఇక్కడ మరో టీడీపీ నేత కరణం శివరామకృష్ణతో ఆయనకు పడదు. బొబ్బిలి, చీపురుపల్లి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీ దుస్థితి ఇలా ఉంటే.. పార్టీ హైకమాండ్ మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుంటోందట. ఇదే వైఖరి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునేది ఎలా అన్నది తమ్ముళ ప్రశ్న.
