Site icon NTV Telugu

BJP : బీజేపీ నాయకులు లొల్లి చేస్తున్నారా..? అసంతృప్తితో ఉన్నవారు ఎవరు.? l

New Project (22)

New Project (22)

ఈ దఫా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికైంది హైదరాబాద్‌. చురుకుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి జరిగే మీటింగ్స్‌ కోసం బీజేపీ పెద్దలు ఏర్పాట్లపై వరసగా సమీక్షలు చేస్తున్నారు కూడా. సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా.. పని విభజనపై కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది బీజేపీ. కేవలం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసమే ఆ కమిటీల కూర్పు జరిగింది. దాదాపు 30 విభాగాలను గుర్తించి.. అక్కడ ఎవరెవరు.. ఏఏ పనులు చేయాలి? ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో పార్టీ నిర్దేశించింది. ఆ కమిటీలకు ఇంఛార్జులతోపాటు కొందరు నాయకులకు పని కల్పించారు. స్వాగత కమిటీ… ట్రాన్స్‌పోర్ట్ కమిటీ.. వసతి కమిటీ.. భోజన కమిటీ.. రిజిస్ట్రేషన్‌ కమిటీ.. ఎగ్జిబిషన్‌ కమిటీ.. కార్యాలయ కమిటీ.. ఇలా వివిధ విభాగాలు ఆ జాబితాలో ఉన్నాయి. వీటికి సంబంధించిన కమిటీలే ప్రస్తుతం కాషాయ శిబిరంలో అసంతృప్తి రాగాలకు కేంద్రం అయ్యాయట. రచ్చ రచ్చ అవుతున్నట్టు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు బీజేపీ నేతలు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆ 30 కమిటీలు ఉనికిలో ఉండబోవని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఫలానా కమిటీలో ఉండాలని.. ఆ కమిటీలో ఉంటే ఏదో జరిగిపోతుందని.. ప్రివిలేజ్‌ లభిస్తుందని చాలామంది తెలంగాణ కమలనాథులు భావిస్తున్నారట. ఈ 30 కమిటీలలో చొటు దక్కని వారు మాత్రం తెగ ఫీలవుతున్నారట. బీజేపీ పెద్దలకు అదే పనిగా ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. ఆయన్ని పిలిచారట.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు అని ముఖం మీదే అడిగేస్తున్నారట కొందరు నాయకులు. ఏదో ఒక పని కల్పించాలని కమిటీలలో చోటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్న నాయకులు ఉన్నారట.

కమిటీలలో చోటు దక్కని వారి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఛాన్స్‌ లభించిన వారిలో కొందరి బాధ మరోలా ఉందట. తన స్థాయిని గుర్తించకుండా.. చిన్న కమిటీలలో వేస్తారా అని కొందరు.. అక్కడ నన్నెలా వేస్తారు అని మరికొందరు.. బీజేపీలో ఇదే గుర్తింపు అని ఇంకొందరు అలకబూనినట్టు తెలుస్తోంది. కమిటీలో తమకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని రుసరుసలాడుతున్నారట. ఇంతలో మరో విషయం బయటకు రావడంతో.. దానిపై లొల్లి ఓ రేంజ్‌లో ఉన్నట్టు సమాచారం. కొన్ని కమిటీలలో కొందరి పేర్లు మొదట్లో ఉన్నా ఆ తర్వాత డిలీట్‌ చేశారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కావాలనే తమ పేరు తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కమలనాథలు.

ఈ అసంతృప్త సెగలు గట్టిగానే తాకేయో ఏమో… ఇంకా ఏ కమిటీ ఫైనల్‌ కాలేదని.. వాటిని బయట పెట్టడం లేదని.. మరికొన్ని పేర్లు యాడ్‌ చేసే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు లీకులు ఇస్తున్నారట. దీంతో వాటిల్లో చోటుకోసం పైరవీలు మొదలు పెట్టేశారట. 30లో కీలకంగా భావిస్తున్న కొన్ని కమిటీలలో ఉంటే.. జాతీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి.. భవిష్యత్‌ రాజకీయాల్లో ఆ పరిచయాలు అక్కరకు వస్తాయని కొందరు లెక్కలేస్తున్నారట. ఆ కారణంగానే ఒత్తిళ్లు.. అసంతృప్తులు.. ప్రశ్నలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. మరి.. ఈ సమస్యను కమలనాథులు ఎలా అధిగమిస్తారో చూడాలి.

 

 

Exit mobile version