Site icon NTV Telugu

Off The Record: ఏపీ మంత్రి గుమ్మడి సంద్యారాణికి సొంత ప్రాంతంలో చెక్ పడబోతోందా?

Ap Ministerr

Ap Ministerr

Off The Record: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సొంత ప్రాంతంలో చెక్‌ పడబోతోందా? అందుకోసం తోటి మంత్రివర్గ సహచరుడే కామ్‌గా పావులు కదిపాడా? నిన్నటిదాకా తెర వెనక జరిగిన వార్‌ ఇక ఓపెన్‌ అవుతుందా? కొత్తగా జరిగిన ఓ నియామకం మంత్రి ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికేనా? ఎవరా చెక్‌మేట్‌? ఏంటా పొలిటికల్‌ కహానీ?

Read Also: Off The Record: తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? కాంగ్రెస్ సీపీఐ మధ్య ఏం జరుగుతుంది?

కొండ ప్రాంత రాజకీయాల్లో కీలక మలుపు. ఆధిపత్య పోరులో అసలైన కుదుపు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత పోరుకు ముగింపు పలుకాలన్న ఉద్దేశ్యంతో.. అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది అధిష్టానం. గిరిజన నాయకురాలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మోజూరు తేజోవతికి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించింది. ఇన్నాళ్ళు ఆ పోస్ట్‌లో ఉన్న కిడారి శ్రవణ్ కుమార్‌ను పక్కన పెట్టేసింది. ఇక్కడే సరికొత్త చర్చలు మొదలయ్యాయి పార్టీ వర్గాల్లో. మంత్రి గుమ్మడి సంధ్యారాణికి చెక్‌ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. పైగా… ఆ దిశలో మరో మంత్రి అచ్చెన్నాయుడే పావులు కదిపారన్న టాక్‌ ఇంకా ఆసక్తి రేపుతోంది. అరకు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీలోని గ్రూప్ రాజకీయాలు, నాయకత్వ లోపాలపై ఇటీవల అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు వెళ్ళాయట. ఇన్నాళ్ళు ఆ బాధ్యతలు చూసిన శ్రవణ్‌కుమార్‌ మీద వ్యక్తిగతంగా ఎలాంటి రిమార్క్‌లు లేకపోయినా… ఆయన అరకు , పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వరకే పరిమితం కావడం, నాలుగు సెగ్మెంట్స్‌లో సమన్వయం లేకపోవడం, సీనియర్ నాయకుల దగ్గర పట్టు సాధించలేకపోవడం లాంటివన్నీ ఆయనకు మైనస్‌ అయినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

Read Also: CM Revanth Reddy: డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్‌.. క్రిస్మస్ పండుగ ప్రేమ, సేవ, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది!

మరోవైపు ఉన్నత విద్యావంతురాలైన తేజోవతి ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గిరిజన ప్రాంతాల్లో అడుగడుగునా పరిచయాలు, కార్యకర్తలతో నేరుగా మమేకమయ్యే శైలి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2024 ఎన్నికల్లో ఆమె సాలూరు టిడిపి టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. కానీ… ఇప్పుడు ఆమెకే అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక రకంగా ఇది సాలూరు నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణికి మింగుడు పడని అంశంగా చెప్పుకుంటున్నారు జిల్లాలో. శ్రవణ్ కుమార్‌కే మళ్లీ బాధ్యతలు ఇప్పించేందుకు సంధ్యారాణి గట్టిగా ప్రయత్నించారన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఆమె పనితీరు, నాయకత్వ శైలిపై రాష్ట్ర స్థాయిలో అసంతృప్తి ఉండటంవల్లే వ్యతిరేక గ్రూప్‌లో ఉన్న తేజోవతిని తెర మీదికి తెచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలకపాత్ర పోషించారని, వ్యూహాత్మకంగానే ఆయన సంధ్యారాణి వ్యతిరేక వర్గంలో ఉన్న తేజోవతికి ఆశీస్సులు అందించారన్నది లోకల్‌ వాయిస్‌. రాష్ట్ర కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధినేతగా తేజోవతి ఎదగడం వెనుక నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమెకు ఉన్న బలమైన నెట్వర్క్ ప్రధాన కారణం అంటున్నాయి టీడీపీ శ్రేణులు. మొత్తానికి అరుకు టిడిపిలో నాయకత్వ మార్పుతో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఇది పార్టీని ఏకం చేస్తుందా లేదా అంతర్గత పోరును కొత్త మలుపు తిప్పుతుందా అన్నది తేలాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version