OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?

  • అనంత అర్బన్‌ టీడీపీలో దగ్గుపాటి వర్సెస్‌ ప్రభాకర్‌ చౌదరి
  • గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి
  • ఎమ్మెల్యే అయ్యాక వరుస వివాదాల్లో దగ్గుపాటి
  • ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలంటూ అధిష్టానానికి ఫిర్యాదులు
  • ఇన్నాళ్ళు ఇద్దరి మధ్య నడిచిన కోల్డ్‌వార్‌ ఇప్పుడు ఓపెన్‌
  • ఎమ్మెల్సీ విషయంలో ప్రభాకర్‌ చౌదరికి భంగపాటు అంటూ ప్రచారం
  • ఎమ్మెల్యే అనుచరులు రూ.200 కోట్లు సంపాదించారని ప్రభాకర్ ఆరోపణ
  • మాజీ ఎమ్మెల్యే ఆరోపణలకు అస్సలు స్పందించని ఎమ్మెల్యే
Cinema

Cinema

OTR: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య వార్ పీక్స్‌కు చేరింది. రెండేళ్లుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధం… ఇప్పుడు ఓపెన్‌ అయిపోయింది. వాస్తవంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు ప్రభాకర్ చౌదరి. కానీ… చివరి నిమిషంలో దగ్గుపాటికి టికెట్ ఇచ్చింది అధిష్టానం. దాంతో… అప్పట్లో పార్టీ క్యాడర్ భగ్గుమంది. అసలేంటీ దారుణం అంటూ ఏకంగా పార్టీ కార్యాలయానికే నిప్పు పెట్టారు. అయినా… అధిష్టానం తగ్గకపోవడంతో ఆ ఎన్నికల్లో అంతా కలసి పని చేయాల్సి వచ్చింది. కానీ… దగ్గుపాటి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన అనుచరులు బెదిరింపులపై అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలు, భూ ఆక్రమాల వంటి చాలా ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో కాల్స్ మరింత కాక రేపాయి. వీటిపై ప్రభాకర్ చౌదరి ఎప్పటికప్పుడు స్పందిస్తూ నగరంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని పరోక్షంగా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వచ్చారు. అక్కడితో ఆగకుండా దీనిపై ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారట. కానీ… అధిష్టానం వీటిని ఏ రోజూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. కొన్ని సార్లు దగ్గుపాటిని పిలిపించి మందలించినట్టు ప్రచారం జరిగినా… అందులో నిజమెంత అన్నది ఎవరికీ తెలియదు.. ఇటు దగ్గుపాటి కూడా చాలా సార్లు ప్రభాకర్‌ చౌదరిపై పరోక్షంగా విమర్శలు చేశారు.

ఇలా నడుస్తున్న అంతర్గత పోరు ఈసారి డైరెక్ట్ వార్ గా మారింది. రాష్ట్రంలో వడ్డెర కులానికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ప్రతిపాదన మేరకు రమాదేవికి అవకాశం కల్పించింది అధిష్టానం. ఈ పరిణామంతో ప్రభాకర్‌ చౌదరికి ఆశాభంగం అంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎమ్మెల్యే వర్గీయులు. దీంతోపాటు టిడిపి కార్యకర్త శ్రీనివాస్ చౌదరిపై కేసు పెట్టడం లాంటి పరిణామాలు ప్రభాకర్ చౌదరికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయట. వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనంతపురం సిటీలో జరుగుతున్న భూకబ్జాలు, అరాచకాలు, దౌర్జన్యాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఎమ్మెల్యే దగ్గుపాటే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా గత రెండేళ్లుగా జరిగిన వాటన్నింటినీ వివరాలతో సహా వెల్లడించారు. ఈ రెండేళ్లలో దగ్గుపాటి వర్గీయులు 200 కోట్లకు పైగా ఆస్తుల సంపాదించారని, ఆయన చేసిన అక్రమాల మీద సమగ్రమైన రిపోర్ట్‌ నా దగ్గర ఉందంటూ… ఏకంగా వెయ్యి పేజీల పుస్తకాన్ని బయటపెట్టారాయన. దీంతోపాటు కొన్ని ఆడియో కాల్స్‌ను కూడా మీడియాకు విడుదల చేశారు. ఇన్ని రోజులు పార్టీ కోసం మౌనంగా ఉన్నానని.. ఇప్పుడు పార్టీ కార్యకర్తలను కూడా దగ్గుపాటి టార్గెట్ చేయడం వల్లే ఇలా బయటికి వచ్చి మాట్లాడాల్సి వచ్చిందన్నారాయన. పార్టీ పెద్దలు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోతే అనంతపురంలో టీడీపీ బతికే పరిస్థితి ఉండదని కూడా అన్నారు.అయితే ప్రభాకర్ చౌదరి ఎన్ని మాట్లాడినా… ఎమ్మెల్యే వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్‌ అయింది. వాస్తవానికి గతంలో ప్రభాకర్ చౌదరి ఏ చిన్న విషయం పరోక్షంగా మాట్లాడినా.. దానిపట్ల తీవ్రంగా స్పందించేవారు దగ్గుపాటి. కానీ ఈసారి ఇలా ప్రత్యక్షంగా, అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా… ఎందుకు రియాక్ట్ అవడం లేదన్న చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నందున….పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే నోటికి తాళం వేసిందన్న ప్రచారం ఉంది.

ఇప్పటికే వైసిపి కూడా దగ్గుపాటి టార్గెట్ గా నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో… మంత్రి అనగాని ప్రసాద్‌కు అనంతపురం అర్బన్ కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో సూచనప్రాయంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో…ఇప్పుడు అవగాని ఎలాంటి రోల్‌ పోషించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.