Site icon NTV Telugu

భూ వివాదాల్లో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు

Caselu

Caselu

ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీ నేతల ల్యాండ్‌ పంచాయితీలు శ్రుతి మించుతున్నాయి. గుడిహత్నూర్‌.. ఇచ్చోడ మధ్య ఉన్న భూమి విషయంలో కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ ల్యాండ్‌ పంచాయితీ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్‌ ఇంటికి చేరడంతో.. సమస్యపై మాట్లాడేందుకు కొందరు పార్టీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఒకానొక సమయంలో హీటెడ్‌ ఆర్గ్యుమెంట్స్‌ జరగడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లారని ఎంపీ గన్‌మెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయింది.

తాజా గొడవపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆ రాత్రి ఎంపీ ఇంటికి పంచాయితీకి వెళ్లిన అందరిపై కాకుండా.. కొందరిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే కాదు… కొద్ది రోజులుగా ఆదిలాబాద్‌ జిల్లా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారట. కొందరు నేతల తీరుపై ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం.

భూ తగాదాల్లో ఎవరు తలదూరుస్తున్నారు? ఏ నేత బంధువులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు అనేది బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. ఇచ్చోడ భూ వివాదాల్లో మాత్రం.. పార్టీ నేతల తీరుపై ఎంపీ బాపూరావ్‌ సీరియస్‌గా తీసుకున్నారట. ఏం జరిగిందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన వెల్లడించారట. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌పై ఫిర్యాదు చేసినట్టు సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ఆ తర్వాతే పాయల్‌ శంకర్‌ ఎంపీని శరణు కోరడంతో కొందరిపైనే కేసులు నమోదైనట్టు చెవులు కొరుక్కుంటున్నారట. అయితే ఈ వ్యవహారంలో ఎంపీ పాత్రను కొందరు పార్టీ నేతలు అనుమానిస్తున్నారట. ఆయన మాత్రం కేసుల విషయంలో తన ప్రమేయం లేదని చెబుతున్నారట.

మొత్తానికి ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీ నేతలపై కేసులు.. భూ వివాదాలపై రకరకాలుగా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. పార్టీ నుంచి బయటకు సాగనంపేందుకు ఎవరికో పొగ పెడుతున్నారని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. ఈ రగడను పార్టీ పెద్దలు పరిష్కరిస్తారో లేదో చూడాలి.

Exit mobile version