WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!

Who Report World On Edge

Who Report World On Edge

ప్రపంచం మాస్కులు తీసేసింది.. లాక్‌డౌన్ జ్ఞాపకాలను మర్చిపోతోంది.. ఆస్పత్రుల బయట ఆక్సిజన్ కోసం ఏడ్చిన కుటుంబాలను కాలం నెమ్మదిగా పూడ్చేస్తోంది… కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ బోర్డు ఇప్పుడు ఇచ్చిన హెచ్చరిక మాత్రం గుండెల్లో మళ్లీ అదే భయాన్ని నింపుతోంది. ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధంగా లేదట. అవునండి..! కరోనా(Corona) సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారిందంటే నమ్మగలరా?

ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్:

WHO, వరల్డ్ బ్యాంక్ మద్దతుతో పనిచేసే గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ నివేదిక పేరు ‘ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్…’ అంటే ప్రపంచం ఓ అంచున నిలబడిందని అర్థం. ఈ నివేదికలో చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే… కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ఆరోగ్య వ్యవస్థలను బలపరుస్తాయని అంతా అనుకున్నారు. కానీ వాస్తవానికి దేశాల మధ్య సహకారం తగ్గిపోయింది. వ్యాక్సిన్ సమానత్వం కూలిపోయింది. ఆరోగ్య రంగానికి నిధులు తగ్గాయి. పేద దేశాలు ఇంకా బలహీనపడ్డాయి. ఈ పరిస్థితుల్లో మరో వైరస్ వస్తే ప్రపంచం మళ్లీ భారీ విధ్వంసాన్ని చూడాల్సి రావచ్చని హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలు వస్తున్న సమయం కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. మధ్య ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మళ్లీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండాలో బుండిబుగ్యో అనే అరుదైన స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. ఈ స్ట్రెయిన్ గురించి ప్రపంచానికి పూర్తి సమాచారం కూడా లేదు. ఇది ఎలా వ్యాపిస్తుంది? ఎంత వేగంగా చంపుతుంది? దాని మరణాల రేటు ఎంత అన్న అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత లేదు.

కొంపముంచుతున్న ఎంపాక్స్:

ఇదే సమయంలో ఎంపాక్స్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ జంతువుల నుంచి మనుషులకి సోకే ప్రమాదం పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హంటావైరస్ లాంటి వైరస్‌లు కూడా అప్పుడప్పుడు బయటపడుతూ భయపెడుతున్నాయి. ఇక ఈ తరహా వైరస్‌ల వ్యాప్తికి ప్రపంచమే అనుకూలంగా మారిపోతోందని నివేదికలో సైంటిస్టులు స్పష్టంగా రాసుకొచ్చారు. వాతావరణ మార్పులు అడవుల వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. అడవి జంతువులు మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరవుతున్నాయి. కొత్త వైరస్‌లు జంతువుల నుంచి మనుషులకి దూకే అవకాశాలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు, వలసలు, నగరీకరణ విపరీతంగా పెరిగాయి. ఒక ప్రాంతంలో మొదలైన వైరస్ కొన్ని గంటల్లోనే ఖండాలు దాటే పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలో మనం ఇదే చూశాం.. చైనాలో మొదలైన వైరస్ కొన్ని వారాల్లోనే ప్రపంచం మొత్తం పాకిపోయింది. అయితే కరోనా నుంచి ప్రపంచం కనీసం ఒక పాఠమైనా నేర్చుకుందా అంటే.. ఈ నివేదిక సమాధానం లేదని చెబుతోంది. కరోనా సమయంలో ధనిక దేశాలు ముందుగా వ్యాక్సిన్లు దాచుకున్నాయి. పేద దేశాలు నెలల తరబడి ఎదురుచూశాయి.

రాజకీయ అస్థిరతను పెంచుతాయా?

ఇప్పుడు ఎంపాక్స్ విషయంలో పరిస్థితి ఇంకా దారుణంగా మారిందని నివేదిక చెబుతోంది. ఎంపాక్స్ వ్యాక్సిన్లు పేద దేశాలకు చేరడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అంటే కరోనా తర్వాత కూడా ప్రపంచం సమానత్వం నేర్చుకోలేదన్న మాట. ఒక పేద దేశంలో ప్రాణం విలువ ఇంకా తక్కువగానే ఉందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఇక్కడ మరో ప్రమాదకర అంశం ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం. కరోనా సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు ఎలా వ్యాపించాయో ప్రపంచం చూసింది. వ్యాక్సిన్లపై అనుమానాలు పెరిగాయి. శాస్త్రవేత్తలపై దాడులు జరిగాయి. ప్రభుత్వాలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు WHO అనుబంధ బోర్డు చెబుతున్నది కూడా ఇదే. భవిష్యత్ మహమ్మారులు కేవలం ఆరోగ్య సంక్షోభాలగా మాత్రమే మిగిలిపోకుండా అవి రాజకీయ అస్థిరతను కూడా పెంచుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దెబ్బకొడతాయి. సమాజంలో విభజనలు పెంచుతాయి. అంటే ఒక వైరస్ కేవలం శరీరాలను మాత్రమే కాకుండా దేశాల స్థిరత్వాన్ని కూడా కూల్చగలదని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

మరోవైపు భారత్‌కు ఈ హెచ్చరికలు చాలా కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా విపత్తుల్లో భారత్ ఒకటి. సెకండ్ వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడం, ఆక్సిజన్ కొరత, గంగానదిలో తేలిన మృతదేహాలు, శ్మశానాల్లో ఆగని దహనాలు ఇంకా ప్రజల మదిలోనే ఉన్నాయి. అయినప్పటికీ భారత ఆరోగ్య వ్యవస్థలో ఇంకా భారీ లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత కొనసాగుతోంది. వ్యాధులను ముందుగానే గుర్తించే సర్వైలెన్స్ వ్యవస్థలు బలహీనంగానే ఉన్నాయి. అత్యవసర నిధుల విడుదలలో ఆలస్యం ఇంకా పెద్ద సమస్యగానే ఉంది. భారీ జనాభా, వేగంగా పెరుగుతున్న నగరాలు, రాష్ట్రాల మధ్య వలసలు లాంటివి భారత్‌ను భవిష్యత్ మహమ్మారులకు అత్యంత సున్నిత దేశంగా మారుస్తున్నాయి. ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన కానీ భయపెట్టే అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI టెక్నాలజీ వైరస్‌లను ముందుగానే గుర్తించగలదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా పోస్టులు… ఆస్పత్రుల డేటా… ప్రయాణాల సమాచారం విశ్లేషించి వ్యాధి వ్యాప్తిని ముందుగానే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ప్రమాదం ఉందట. ధనిక దేశాలకే అధునాతన టెక్నాలజీ అందితే పేద దేశాలు మరింత వెనుకబడిపోతాయి. అంతేకాదు… తప్పుడు సమాచారం వ్యాప్తిలో కూడా AI కీలక పాత్ర పోషించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అసలు సమస్య వైరస్‌లు కాదు…అది దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు.

మూడు కీలక సూచనలు:

కరోనా తర్వాత ప్రపంచ రాజకీయాలు మరింత కఠినంగా మారాయి. యుద్ధాలు పెరిగాయి. దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నాయి. ఆరోగ్య రంగానికి అంతర్జాతీయ నిధులు తగ్గుతున్నాయి. WHO వంటి సంస్థలపైనా రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక కొత్త మహమ్మారి వస్తే ప్రపంచం కలిసికట్టుగా పనిచేయగలదా అన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. అందుకే ఈ నివేదిక మూడు కీలక సూచనలు చేసింది. మొదటిది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రమాదాలను నిరంతరం పర్యవేక్షించే స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెండోది వ్యాక్సిన్లు, మందులు, పరీక్షలు అన్ని దేశాలకు సమానంగా అందేలా WHO ప్రతిపాదించిన ప్యాండమిక్ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలి. మూడోది అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు భారీ నిధులను సిద్ధంగా ఉంచాలి.

అయితే ప్రపంచం నిజంగా ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుంటుందా…? లేదా కరోనా జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోయాక మరో వైరస్ వచ్చే వరకు మళ్లీ నిర్లక్ష్యంగానే కొనసాగుతుందా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో తెలిసిపోతుంది కానీ ఇప్పటి పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం కరోనాను మించిన విధ్వంసం తప్పకపోవచ్చు!