అదేంటి సాయి పల్లవికి లక్కీ హీరోయిన్ అనే పేరు ఉంది. గోల్డెన్ లెగ్ అని కూడా కొంత మంది పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆమెకు ఇక కష్టమే అనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. సాయి పల్లవి ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా కొన్ని సీజన్స్ చేసిన ఆమె తర్వాత మలయాళంలో వచ్చిన ప్రేమం అనే సినిమాలో మలర్ టీచర్ అనే పాత్రతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమా ఆమెకు వరుస తమిళ అవకాశాలు తీసుకొచ్చింది. అయితే వెంటనే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా చాలా పద్ధతిగా సినిమాలను ఎంచుకుంటూ వచ్చింది. తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత దాదాపుగా చేసిన అన్ని సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఇంకేముంది వరుసగా రెండు మూడు సినిమాలు హిట్ అయితే మన తెలుగు వాళ్ళు ఆమెను లక్కీ హీరోయిన్ అని గోల్డెన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు, అలాగే వేసేశారు.
Shraddha Das: ‘కంగువ’లో పాట పాడిన టాలీవుడ్ హీరోయిన్
ఇప్పుడు సాయి పల్లవి క్రేజ్ ఎల్లలు దాటి పోయింది. ఆమెకు భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో అభిమానులు ఏర్పడ్డారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు హిందీలో సైతం డబ్బింగ్ అయి రిలీజ్ కావడంతో హిందీలో కూడా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఇటీవల ఆమె నటించిన అమరన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది, కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. మరోపక్క నాగచైతన్య హీరోగా తండేల్ అనే సినిమా చేస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఆమె తాజాగా వరుసగా అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరన్ సక్సెస్ మీట్, తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ల కోసం తెలుగు మీడియా ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్లకు ఈవెంట్ నిర్వాహకులు పాసులు సైతం అభిమానులకు జారీ చేశారు. ఇక ఈవెంట్ కి హాజరైన అభిమానులు ఎక్కువగా సాయి పల్లవి అభిమానులే ఉన్నట్టున్నారు. అందుకే ఈ ఈవెంట్ కి ఆమె వచ్చినప్పటి నుంచి ఆమె మాట్లాడే సమయంలో సైతం కరతాళ ధ్వనులతో ఆమెను మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు పెద్దగా అభిమానులనుంచి స్పందన రావడం లేదు. కానీ సాయి పల్లవి ప్రస్తావన వస్తే మాత్రం ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా అరుస్తున్నారు.
నిజానికి హీరోలకు ఇది ఒక రకంగా మింగుడు పడని అంశమే. ఎందుకంటే హీరోల అభిమానులు అలా గోల చేయాలి కానీ అది లేకుండా సాయి పల్లవి ప్రస్తావన వచ్చినప్పుడు అలా గోల చేస్తూ ఉండడంతో భవిష్యత్తులో ఎప్పటికైనా సాయి పల్లవికి ఈ విషయంలో ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకు వచ్చిన గోల, ఆమె పక్కన ఉంటే ఫోకస్ అంతా ఆమె మీదకే వెళ్ళిపోతుంది అనుకుని ఆమెను ఆయా పాత్రల నుంచి తప్పించి వేరే హీరోయిన్లకు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సాయి పల్లవి ఈ విషయాన్ని గుర్తెరిగి ఏవైనా నివారణ చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడటం కష్టమే.