HHVM : పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ స్థాయి బజ్ ఉండాలి.. టాలీవుడ్ అగ్ర హీరో మూవీ వస్తోందంటే బాక్సాఫీస్ మొత్తం అటే చూడాలి. కానీ హరిహర వీరమల్లుకు ఆ బజ్ రావట్లేదా అంటే అవుననే అంటున్నారు సినీ విమర్శకులు. రిలీజ్ డేట్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ ఇంకా ప్రమోషన్లు మొదలు కాలేదు. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఎంత ముందస్తుగా ప్రమోషన్లు మొదలు పెడితే అంత బజ్ క్రియేట్ అవుతోంది. రకరకాల ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే సరైన హైప్ రాక స్టార్ హీరోలే ఇబ్బందులు పడుతున్నారు. ఒక మూవీని తీయడం ఒక ఎత్తు అయితే.. ప్రమోషన్లు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ రోజుల్లో మరో ఎత్తు.
Read Also : Kubera : కుబేర నుంచి ‘అనగనగా కథ’ సాంగ్ రిలీజ్..
అలాంటిది ఐదేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమాను ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు. సినిమా రిలీజ్ డేట్ కు 20 రోజుల ముందు నుంచే ప్రమోషన్లు చేస్తున్న రోజులివి. అలాంటిది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా భారీ బడ్జెట్ సినిమా గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ఈ మూవీ గురించి మాట్లాడలేదు. ఆయన ప్రమోషన్లకు రాకపోవడానికి రాజకీయాల్లో చాలా బిజీగా ఉండటమే ప్రధాన కారణం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఇలాంటివి పక్కకు వెళ్తాయి. దాన్ని ఎవరూ కాదనలేరు.
కానీ మిగతా వాళ్లకు ఏమైంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మూవీ ప్రమోషన్లకు రావడం కాదు కదా.. కనీసం ఒక ఇంటర్వ్యూ కూడా ఇప్పటి దాకా ఇవ్వలేదు. మిగతా నటీనటులు కూడా అంతే. ఈ మూవీలో పెద్ద స్టార్లే నటించారు. కానీ వారు నోరు విప్పట్లేదు. ఒక మూవీ గురించి ఎంత చెబితే అంత పబ్లిసిటీ వస్తుంది. ఎంత పవన్ కల్యాణ్ సినిమా అయినా ప్రమోషన్ చేయకుంటే అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రావు. ఇది నిర్మాత మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఏఎం రత్నం నానా పాట్లు పడుతున్నారు.
ఒక నిర్మాత ఇంటర్వ్యూలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. కానీ రత్నం గారు వరుసగా మూడు ఛానెళ్లకు ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంత పెద్ద పబ్లిక్ స్టార్లు ప్రమోషన్లు చేస్తే వచ్చే హైప్.. రత్నం చేస్తే రాదు కదా. ప్రమోషన్లు అంటే జనాలు చూసే ముఖాలే కావాలి. పవన్ కల్యాణ్ గతంలో ఏ సినిమాకు అయినా దగ్గరుండి ప్రమోషన్లు చేసేవారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కావాల్సినంత టైమ్ కేటాయించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కాకపోతే పవన్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టినా సరే కావాల్సినంత బజ్ క్రియేట్ అయిపోతుందనే నమ్మకం అందరికీ ఉంది.
పాన్ ఇండియా సినిమాగా వస్తుంది కాబట్టి.. ఇతర భాషల్లో కూడా ప్రమోట్ చేయాల్సిందే. లేకపోతే అక్కడ ఎవరూ పట్టించుకోరు. కానీ ఇంకెప్పుడు.. రిలీజ్ డేట్ చాలా దగ్గరకు వచ్చేసింది. మరో మూడు రోజులు అయితే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ లోపే కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తేనే బుకింగ్స్ అనుకున్న స్థాయిలో అవుతాయి. ఈ లెక్కన వీరమల్లు ప్రమోషన్ల విషయంలో చాలా వెనకబడిపోయాడు. ఇప్పటికైనా ప్రమోషన్లు మొదలు పెడితే పవన్ సినిమా మరో లెవల్లోనే ఉంటుంది.
Read Also : Venkatesh : వాడిని అంచనా వేయడం కష్టం.. తన పాత్రపై వెంకటేశ్ కామెంట్స్..