‘ఇండియా అంటే దేశం కాదు.. కేవలం జనాభా మాత్రమే..’ బ్రిటీష్ పాలకుడు విన్‌స్టన్ చర్చిల్ ఎన్నో దశాబ్దాల క్రితం చెప్పిన ఈ మాటలు ఒరిస్సా హైకోర్టులో మార్మోగాయి. ఇది వలస పాలకుడి అవమాన వ్యాఖ్యగా అప్పట్లో కొట్టిపారేశారు. కానీ దశాబ్దాల తర్వాత అదే మాటను ఒక భారతీయ న్యాయస్థానం గుర్తు చేయడం దేశాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది.
ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేవలం ఒక గ్రామపంచాయతీ సభ్యుడి అర్హత రద్దు కేసు కాదు. అది పెరుగుతున్న జనాభా దేశాన్ని ఎంత ప్రమాదకరమైన మలుపు వైపు తీసుకెళ్తుందో చెప్పిన గట్టి హెచ్చరిక. జనాభా అంటే సంఖ్య కాదు.. అది దేశ శ్వాస. కానీ ఆ శ్వాస అదుపు తప్పితే అదే ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఈ నిజాన్ని గుర్తుచేస్తూ ఒరిస్సా హైకోర్టు ఒక అసాధారణమైన మార్గాన్ని ఎంచుకుంది. బ్రిటిష్ పాలకుడి మాటలతో పాటు శతాబ్దాల క్రితం చెప్పిన తత్వవేత్తల హెచ్చరికలు, మహమ్మారి రోజుల్లో మనం అనుభవించిన భయానక క్షణాలు.. అన్నింటినీ ఒకే తీర్పులో కలిపింది. బెర్ట్రాండ్ రస్సెల్ జనాభా పేలుడు హైడ్రోజన్ బాంబుకంటే ప్రమాదకరం అని చెప్పిన హెచ్చరికను, మాల్థస్ శతాబ్దాల క్రితం చెప్పిన అంచనాలను ఈ తీర్పులో ప్రస్తావించింది.
ఓవైపు అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న దేశం, పెరుగుతున్న జనాభా బరువుతో తనకే తాను శత్రువుగా మారుతోందా అన్న ఆలోచనను ఈ తీర్పు బలంగా ముందుకు తెచ్చింది. ఇంతకీ జనాభా పెరుగుదలపై కోర్టు ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించింది? ఆ తీర్పులో దాగి ఉన్న హెచ్చరిక ఏంటి?
ఒరిస్సా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం చాలా కారణాలున్నాయి. ఈ కేసు ఒక గ్రామపంచాయతీ సభ్యుడి అర్హత రద్దుకు సంబంధించినది. ఒరిస్సా గ్రామపంచాయతీ చట్టం ప్రకారం ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు ప్రజాప్రతినిధులుగా కొనసాగే అర్హత కోల్పోతారు. ఈ నిబంధనను సవాల్ చేస్తూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు ఈ అంశాన్ని కేవలం చట్టపరమైన సాంకేతికతగా చూడలేదు. దాని వెనుక ఉన్న సామాజిక ప్రమాదాన్ని కేంద్రంగా చేసుకుని తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పిన విషయం ఇదే. జనాభా నియంత్రణ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్య. కరోనా మహమ్మారి సమయంలో దేశం ఎదుర్కొన్న పరిస్థితులను కోర్టు గుర్తు చేసింది. ఆస్పత్రుల్లో బెడ్లు లేని పరిస్థితి, శ్వాస తీసుకునేందుకు ఆక్సిజన్ దొరకని దుస్థితి, రెండు అడుగుల దూరం పాటించాలన్న సూచనలను అమలు చేయడానికి స్థలం లేక ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ జనాభా ఒత్తిడికి స్పష్టమైన ఉదాహరణలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును జస్టిస్ కృష్ణ శ్రీపాద దీక్షిత్,చిత్తరంజన్ దాష్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ఈ తీర్పులో కోర్టు అంతర్జాతీయ గణాంకాలను కూడా ఆధారంగా తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్ జనాభా ఇప్పటికే 143 కోట్లను దాటింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరే అవకాశం ఉంది.
ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావని, ప్రతి కొత్త పౌరుడితో నీరు, ఆహారం, వైద్యం, విద్య, ఉపాధి మీద ఒత్తిడి పెరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇటు ఒడిశా విషయానికి వస్తే, రాష్ట్రం దేశ జనాభాలో సుమారు 3.3 శాతం వాటా కలిగి ఉందని యూఎన్ పాప్యులేషన్ ఫండ్ నివేదికను కోర్టు ప్రస్తావించింది. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు ఒడిశాను కూడా జనాభా నియంత్రణకు ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తించిన విషయాన్ని గుర్తుచేసింది. ఇప్పటికే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవ్వకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి జనాభా భారమేనని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం మరో కీలక అంశాన్ని కూడా లేవనెత్తింది. జనాభా పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య కాదని… ఇది మానవ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందని చెప్పింది. ఒక్కో వ్యక్తికి దక్కాల్సిన వనరులు తగ్గిపోతే ఆ వ్యక్తి విలువ కూడా వ్యవస్థలో తగ్గిపోతుందన్నది కోర్టు ఆందోళన. అందుకే మాల్థస్ శతాబ్దాల క్రితం చెప్పిన మాటను గుర్తుచేసింది. జనాభా అడ్డూఅదుపు లేకుండా పెరిగితే విపత్తు తప్పదన్న హెచ్చరికను నేటి పాలకులు మళ్లీ చదవాల్సిన అవసరం ఉందని కామెంట్ చేసింది.
ఒరిస్సా హైకోర్టు తీర్పు ఒక కేసుతో ముగియదు. ఇది పాలకులకి, విధాన రూపకర్తలకి, సమాజానికే ఇచ్చిన గట్టి సిగ్నల్. జనాభా సమస్యను పట్టించుకోకపోతే, అభివృద్ధి అన్న మాట పుస్తకాలలోనే మిగిలిపోతుంది. దేశం ముందుకు వెళ్లాలంటే, సంఖ్యలను కాదు.. మనుషుల జీవన నాణ్యతను కేంద్రంగా పెట్టాల్సిందే అన్న సందేశమే ఈ తీర్పు సారాంశంగా చెప్పవచ్చు.
ALSO READ: చరిత్ర నుంచి రక్తపాతాన్ని తుడిచివేసే ప్రయత్నం.. చైనా బరితెగింపు రాజకీయం!
