మొదట కొందరికి వాంతులు వచ్చాయి. తర్వాత జ్వరం. తర్వాత ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆ షిప్ వైపు తిరిగి చూసింది. ఆ షిప్ పేరు ఎంవీ హోండియస్. ఇది అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి మార్చిలో ప్రారంభమైన ఒక అంటార్కటికా నేచర్ ఎక్స్‌పెడిషన్. ఈ షిప్ చుట్టూనే ఇప్పుడు భయాలు నెలకొన్నాయి. షిప్‌లో ఉన్నవారికి నోరో వైరస్ సోకిందని ముందుగా అందరూ భావించారు కానీ.. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు హాంటా వైరస్. ఇంతకీ ఈ రెండు వైరస్‌ల మధ్య ఉన్న తేడా ఏంటి? ఏది ప్రమాదకరం?
నోరో వైరస్‌కి హాంటా వైరస్‌కి తేడా ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ షిప్‌లలో ఎక్కువగా వినిపించే పేరు నోరోవైరస్. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఒకరికి సోకితే చాలు… డైనింగ్ టేబుల్ నుంచి బాత్రూమ్ హ్యాండిల్ వరకు… నీళ్ల బాటిల్ నుంచి గాలి తాకిన ఉపరితలాల వరకు… ఎక్కడైనా చేరిపోతుంది. ప్రత్యేకంగా క్రూయిజ్ షిప్‌లలో అయితే ఈ వైరస్‌కు పరిస్థితులు మరింత అనుకూలం. ఎందుకంటే వందలాది మంది ఒకే చోట తింటారు… ఒకే మార్గాల్లో తిరుగుతారు… ఒకే గదుల్లో గాలి పంచుకుంటారు. అందుకే ఒక్కసారి నోరోవైరస్ అడుగుపెడితే… అది సైలెంట్‌గా మొత్తం షిప్‌ను చుట్టేస్తుంది. అయితే ఎంవీ హోండియస్ క్రూయిజ్ షిప్ ఘటన తర్వాత హాంటా వైరస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. మొదట ఇది ఎలా మొదలైందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత విచారణలో బయటపడిన విషయం మరింత కలవరపరిచింది. అర్జెంటీనాలో బర్డ్ వాచింగ్ టూర్‌కు వెళ్లిన ఓ జంట… అక్కడ ఓ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాన్ని సందర్శించినట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో ఎలుకల ద్వారా వ్యాపించే హాంటావైరస్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక్కడే నోరోవైరస్, హాంటావైరస్ మధ్య అసలు భయంకరమైన తేడా మొదలవుతుంది. నోరోవైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా సులభంగా వ్యాపిస్తుంది. కానీ హాంటావైరస్ ప్రధానంగా ఎలుకల మూత్రం… ఉమ్మి… మలమూత్రాల ద్వారా వ్యాపిస్తుంది.
ప్రాణాంతకమా?
ముఖ్యంగా ఆండీస్ స్ట్రెయిన్ అనే హాంటావైరస్ కొన్ని అరుదైన సందర్భాల్లో మనుషుల మధ్య కూడా వ్యాపించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది కరోనా లాగా గాలిలో వేగంగా వ్యాపించే వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కానీ సమస్య ఏంటంటే… హాంటావైరస్ చాలా ఆలస్యంగా తన అసలు రూపాన్ని చూపిస్తుంది. మొదట సాధారణ జ్వరంలా మొదలవుతుంది. శరీర నొప్పులు… అలసట… తలనొప్పి. చూసినవారికి ఇది ఫ్లూ లాగా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. రక్తపోటు పడిపోతుంది. తర్వాత హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ అనే ప్రాణాంతక పరిస్థితికి చేరుతుంది.
అక్కడి నుంచి ప్రతి నిమిషం కూడా ప్రమాదమే. ఇక నోరోవైరస్ రెండు రోజుల్లో బయటపడితే… హాంటావైరస్ లక్షణాలు కనిపించడానికి కొన్ని వారాలు పట్టొచ్చు. అంటే వైరస్ శరీరంలో దాగి ఉండి… ప్రయాణాలు చేస్తూ… దేశాలు దాటుతూ… గుర్తుపట్టలేని దూరం వెళ్లిపోవచ్చు. అందుకే ఆరోగ్య సంస్థలు ఈ ఘటనను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఎలుకలుంటే జాగ్రత్తగా ఉండాలి:
క్రూయిజ్ షిప్‌లు ఎందుకు వైరస్‌లకు స్వర్గంలా మారుతున్నాయో కూడా ఇప్పుడు ప్రపంచం అర్థం చేసుకుంటోంది. సముద్రం మధ్యలో వేలాది మంది ఒకే ప్రదేశంలో జీవించడం… పంచుకున్న భోజనాలు… మూసివేసిన గదులు… అంతర్జాతీయ ప్రయాణాలు. ఒక వైరస్‌కు కావాల్సిన ప్రతి అవకాశం అక్కడే ఉంటుంది. ఇప్పుడు వైద్యులు ఒకే విషయాన్ని చెబుతున్నారు. ప్రయాణాల్లో చేతులు తరచూ కడుక్కోవాలి. ఆహార పరిశుభ్రత పాటించాలి. ఎలుకలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
జ్వరం లేదా శ్వాస సమస్యలు మొదలైతే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొన్ని వైరస్‌లు మన కళ్లముందే దాడి చేస్తాయి. మరికొన్ని… మనలో దాక్కుని సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాయి. సరిగ్గా హాంటా వైరస్ అలాంటిదే.. సో..బీ కేర్‌ఫుల్!
