నిత్యానంద పేరు తెలియని వారుండరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. పుట్టుక నుంచి ఇప్పటివరకూ ఆయన ప్రతి అడుగూ వివాదాస్పదమే. భారత్ లో ఎన్నో ఘనకార్యాలు చేసిన నిత్యానంద.. దేశం విడిచి పారిపోయాడు. కైలాస దేశాన్ని సృష్టించానని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మరో దేశంలో భూ ఆక్రమణలకు పాల్పడడంతో ఆయనపై కేసు నమోదైంది.
బొలీవియాలో కొత్త మోసం
నిత్యానంద మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడాయన బొలీవియా దేశంలో భూఅక్రమాలకు పాల్పడినట్లు కేసు నమోదైంది. నిత్యానంద వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. బొలీవియాలో ఆయనతో పాటు అతని అనుచరులు 4.8 లక్షల హెక్టార్ల భూమిని మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ భూమి స్థానిక గిరిజనులదని సమాచారం. అయితే నిత్యానంద దీనిని కైలాస దేశ విస్తరణగా ప్రకటించాలని చూశాడు. ఈ విషయం బయటకు రావడంతో బొలీవియా ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది. అతని 20 మంది అనుచరులను దేశ బహిష్కరణ చేసింది. బొలీవియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కైలాసను దేశంగా గుర్తించబోమని స్పష్టం చేసింది. ఈ ఘటన నిత్యానంద అవినీతి, మోసపూర్వక చర్యలకు మరో ఉదాహరణగా నిలిచింది.
నిత్యానంద ‘కైలాస’ మార్గం
భారత్ నుంచి పారిపోయిన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని సృష్టించానని ప్రకటించాడు. దానికి కైలాస అని పేరు పెట్టాడు. నిత్యానంద 2019లో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అనే దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించాడు. అయితే, ఈ దేశం ఎక్కడ ఉందనే దానిపై స్పష్టత లేదు. కొందరు ఈక్వెడార్ సమీపంలోని ఒక ద్వీపమని, మరికొందరు ఇది పూర్తిగా కల్పితమని అంటారు. ఏ దేశం గానీ, అంతర్జాతీయ సంస్థ గానీ కైలాసను గుర్తించలేదు. అయితే 2023లో నిత్యానంద కైలాస ప్రతినిధులను ఐక్యరాజ్య సమితి సమావేశానికి పంపాడు. అక్కడ వారు అతనిపై హిందూ వ్యతిరేక శక్తులు వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే, ఈ సమావేశాలు పబ్లిక్ ఈవెంట్‌లు కావడంతో ఎవరైనా హాజరు కావచ్చని, ఇది కైలాసకు అధికారిక గుర్తింపు కాదని ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేశారు.
నిత్యానందపై అవినీతి ఆరోపణలు
నిత్యానందపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. దేశవిదేశాల్లో ఎంతోమంది నుంచి విరాళాల రూపంలో కోట్ల రూపాయలు సేకరించాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. నిత్యానందపై అవినీతి ఆరోపణలు తక్కువేం కాదు. అతను తన శిష్యుల నుంచి కోట్ల రూపాయలు విరాళాల రూపంలో సేకరించాడని, వాటిని వ్యక్తిగత లాభాల కోసం వినియోగించాడని ఆరోపణలు ఉన్నాయి. అతని ఆశ్రమాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఆస్తులు అక్రమంగా సంపాదించాడని చెబుతారు. 2019లో ఒక ఫ్రెంచ్ భక్తుడు నిత్యానంద తన దగ్గర 4లక్షల డాలర్లు తీసుకుని మోసం చేశాడని కేసు పెట్టాడు. ఫ్రాన్స్ అధికారులు కూడా అతనిపై విచారణ మొదలుపెట్టారు. ఈ డబ్బుతోనే అతను కైలాస ద్వీపాన్ని కొనుగోలు చేసి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి.
ఇదీ నిత్యానంద చరిత్ర
నిత్యానంద పుట్టుక నుంచి ప్రతిదీ వివాదాస్పదమే. ఈ నేపథ్యంలో అతని పుట్టుపూర్వోత్తరాలను ఓసారి చూద్దాం. నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. 1978 జనవరి 1న తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు సామాన్య జీవనం గడిపేవారు. నిత్యానంద చిన్నతనంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాడని అతని అనుచరులు చెబుతారు. తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర ఆలయం ఉంది. దాని ప్రభావం అతనిపై చూపించి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, అతని బాల్యం గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. అతను తన యవ్వనంలో దేశమంతా తిరిగి, హిమాలయాల్లో సాధన చేసినట్లు చెబుతాడు. కానీ ఇవన్నీ అతని సొంత డబ్బా మాత్రమే. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.
విచిత్ర ప్రవచనాలతో ఫేమస్
కొన్నేళ్ల తర్వాత నిత్యానంద ఆధ్యాత్మిక గురువుగా అవతరించాడు. అప్పటి నుంచి అతను తనదైన శైలిలో బోధనలు చేశాడు. 2003లో నిత్యానంద స్వామిగా ఆవిర్భవించాడు. కర్ణాటకలోని బిడదిలో ఆశ్రమం స్థాపించి, తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్నాడు. అతని బోధనలు హిందూ తత్వశాస్త్రం, యోగా, ధ్యానం చుట్టూ తిరిగాయి. అతను పరమశివుడి అవతారంగా తనను తాను చెప్పుకున్నాడు. అద్భుతాలు చేయగలనని ప్రచారం చేసుకున్నాడు. సూర్యోదయాన్ని 40 నిమిషాలు ఆలస్యం చేయగలనని., ఆవులను తమిళం, సంస్కృతంలో మాట్లాడేలా చేయగలనని విచిత్ర వాదనలు చేశాడు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను తప్పని నిరూపిస్తానని ప్రకటించాడు. ఈ వాదనలు అతన్ని హాస్యాస్పదంగా మార్చాయి. కానీ అతని అనుచరుల సంఖ్య తగ్గలేదు. దేశంలో చాలామంది అతని శిష్యులుగా మారిపోయారు. అతని ఆశ్రమంలో ధ్యాన శిబిరాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేవి. ఇవి విదేశీయులను కూడా ఆకర్షించాయి.
అడుగడుగునా వివాదాలే!
అయితే ఎంత త్వరగా పాపులర్ అయ్యాడో అంతే త్వరగా వివాదాల్లోనూ చిక్కుకున్నాడు నిత్యానంద. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయాడు. నిత్యానంద జీవితంలో తొలి పెద్ద వివాదం 2010లో చోటు చేసుకుంది. ఒక తమిళ టీవీ ఛానల్ నిత్యానంద- రంజిత రాసలీలల వీడియోను ప్రసారం చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతని ఆశ్రమంపై దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఆ వీడియోను మార్ఫింగ్ చేసారని మొదట్లో నిత్యానంద, రంజిత వాదించారు. అయితే బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ దాన్ని నిజమైనదిగా నిర్ధారించింది. కర్ణాటక పోలీసులు అతనిపై అత్యాచారం, మోసం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కొన్ని వారాల తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటన అతని ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బతీసింది.
లైంగిక ఆరోపణలు
2010 తర్వాత నిత్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువయ్యాయి. అతని ఆశ్రమంలోని శిష్యురాళ్లు కొందరు అతను తమను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. 2010లో ఒక అమెరికన్ భక్తురాలు తనపై నిత్యానంద ఐదేళ్లపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో భారత్‌లో అతనిపై అత్యాచారం, మోసం వంటి కేసులు నమోదయ్యాయి. 2012లో కర్ణాటకలోని రామనగర కోర్టులో విచారణ ప్రారంభమైంది. అదే సమయంలో, అతని ఆశ్రమంలో రెండు అనుమానాస్పద మరణాలు సంభవించాయి. ఆశ్రమంలో గంజాయి, కండోమ్‌లు లభ్యమవడం అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు బలం చేకూర్చాయి. 2018లో ఒక మహిళ నిత్యానందపై అత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో మరో కేసు నమోదైంది. అదే సమయంలో, గుజరాత్‌లోని అతని ఆశ్రమంలో చిన్నారులను అపహరించి నిర్బంధించాడని మరో ఆరోపణ వచ్చింది. ఈ కేసులు అతన్ని చుట్టుముట్టడంతో నిత్యానంద పారిపోయేందుకు స్కెచ్ వేశాడు.
దేశం విడిచి పరారీ
2019లో నిత్యానంద భారతదేశం నుంచి పరారీ అయ్యాడు. అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సమయంలో అతను దేశం విడిచి వెళ్లిపోయాడు. నిత్యానంద ఎలా పారిపోయాడు, ఎక్కడికి వెళ్లాడు అనేది మొదట్లో రహస్యంగా ఉండేది. కొన్ని నెలల తర్వాత, అతను దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి, “కైలాస” అనే స్వతంత్ర దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించాడు. ఇది సనాతన ధర్మాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును కోల్పోయిన హిందువుల కోసం స్థాపించబడిన సరిహద్దులు లేని దేశంగా చెప్పుకున్నాడు. కైలాస దేశానికి సొంత జెండా, కరెన్సీ, జాతీయ చిహ్నం, జాతీయ పుష్పం, జాతీయ జంతువు ఉన్నట్టు వెబ్ సైట్ సూచిస్తోంది. ఇంగ్లీష్, సంస్కృతం, తమిళం దీని అధికార భాషలుగా చెప్పబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా స్థాపించినట్లు నిత్యానంద 2020లో ప్రకటించాడు.
అయితే ఈ కైలాస దేశం ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కానీ నిత్యానంద మాత్రం తనదైన శైలిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అతడ్ని దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నా నిత్యానంద ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకట్లేదు. మొత్తానికి నిత్యానంద స్వామి జీవితం ఆధ్యాత్మికత, వివాదాలు, మోసాల మధ్య సంచరిస్తూ ఒక విచిత్ర కథగా మిగిలిపోయింది.